
హైదరాబాద్, వెలుగు: కొత్త రెవెన్యూ జిల్లా కోర్టులు జూన్ 2 నుంచి ప్రారంభం కానున్నాయి. హైకోర్టు ఆవరణలో సాయంత్రం 5 గంటలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో సీజేఐ, సీఎంతో పాటు లా మినిస్టర్ ఇంద్రకరణ్‌రెడ్డి, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, ఇతర జడ్జిలు పాల్గొననున్నారు. కొత్త రెవెన్యూ జిల్లా కోర్టుల ప్రారంభం నేపథ్యంలో కోర్టులకు వేసవి సెలవులను హైకోర్టు కుదించింది. జూన్ 3 దాకా ఉన్న సెలవులను మే 31తో ముగించింది. సెలవుల కుదింపు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. కొత్త రెవెన్యూ జిల్లాలకు హైకోర్టు న్యాయమూర్తులను పోర్టుపోలియో జడ్జిలుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అన్ని కోర్టుల్లోనూ రాష్ట్రావతరణ వేడుకలను నిర్వహించాలని హైకోర్టు ఇటీవలే ఉత్తర్వులు ఇచ్చింది.