N5H1 వైరస్ కరోనా కంటే చాలా ప్రమాదకరమా..?

N5H1 వైరస్ కరోనా కంటే చాలా ప్రమాదకరమా..?

నిన్నటి వరకూ కరోనా పీడ వెంటాడింది. ఇప్పుడు మరో కొత్త రకం వైరస్ భయపెడుతోంది.  ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఈ వైరస్.. కరోనా కంటే చాలా ప్రమాదకరమని తెలుస్తోంది. కొన్ని రకాల జంతువుల నుంచి సోకుతున్న వైరస్.. కరోనా మహమ్మారిగా కంటే ప్రమాదకరమా..? ఇప్పుడు చర్చ యావత్ ప్రపంచాన్నే ఉలిక్కిపాటుకు గురిచేస్తోంది.

ఏవియన్ ఫ్లూ కొత్తరకం వైరస్ H5N1(బర్డ్‌ ఫ్లూ) ఐరోపాలోని అడవి జంతువులు, పక్షుల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ముంగిస,  పందులు, ఎలుగుబంట్లు వంటి క్షీరదాలను ఇది తవ్రంగా ప్రభావితం చేస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్‌ ఐరోపా చరిత్రలోనే అతిపెద్ద ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పక్షులకు వ్యాపించే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి H5N1. 

1997లోనే  H5N1ను తొలిసారి గుర్తించారు. గత 20 ఏళ్లలో 850 మంది మనుషులు ఈ ఫ్లూ బారినపడ్డారు. హెచ్‌5ఎన్‌1 సోకిన వారిలో 50 శాతం మంది ఇప్పటివరకూ మృత్యువాత పడ్డారు. అంటే ఇన్‌ఫ్లూయెంజా వెయ్యి మందికి సోకితే 500 మంది ప్రాణాలు కోల్పోతారట. అందుకే ఇది భవిష్యత్తులో మరో మహమ్మారిగా అవతరించే ముప్పు ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2020లో ఏవియన్ ఫ్లూ-ఏ(H5N1) అనే కొత్త వైరస్ ఉద్భవించింది. అప్పటి నుంచి ఇది అడవి పక్షుల ద్వారా మాత్రమే కాకుండా పందులు, ఎలుగుబంట్లు వంటి నిర్దిష్ట జాతుల క్షీరదాలకు వ్యాపిస్తోంది. ఈ కొత్త రకం వైరస్ 10 కంటే తక్కువ మంది మనుషులకే సోకినట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరిలో ఒక్కరు మాత్రమే చనిపోయారు. 2021 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా 37 దేశాల్లో 6,615  జంతువులు ఈ ఫ్లూ బారినపడ్డాయి. అక్టోబర్ 2022 నుంచి ఇప్పటివరకు 2,701 కేసులు నమోదయ్యాయి. 

బర్డ్‌ఫ్లూ మరణాల రేటు 50 శాతం నమోదవడంతో శాస్త్రవేత్తలు, వైద్యాధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. 2009 హెచ్‌1ఎన్‌1 నుంచి ఇప్పటివరకు వెలుగుచూసిన వైరస్‌లలో మరణాల రేటు దీనికే ఎక్కువ ఉందంటున్నారు. ఒకవేళ హెచ్‌5ఎన్‌1 మానవులకు కూడా వేగంగా వ్యాపిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య హెచ్‌5ఎన్‌1 వైరస్ బారినపడిన వారందరూ అడవి పక్షులతో అత్యంత సన్నిహితంగా ఉన్నవారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి రిచర్డ్ పిబాడీ చెప్పిన విషయం తెలిసిందే. 

అనారోగ్యానికి గురైన పక్షులు, జంతువులకు దూరంగా ఉంటే హైచ్‌5ఎన్‌1 వైరస్ బారినపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే  ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ... పక్షులు, క్షీరదాలతో పాటు ఇతర జంతువులకు వైరస్ వ్యాపించడం మొదలైందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.