టెస్టులు చేసిన కొద్దీ బయటపడుతున్న కరోనా కేసులు

టెస్టులు చేసిన కొద్దీ బయటపడుతున్న కరోనా కేసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్దీ కేసులు పెరుగుతున్నయి. వారం రోజులుగా రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నయి. టెస్టు చేస్తున్న ప్రతి నలుగురిలో ఒకరికి వైరస్ పాజిటివ్ వస్తోంది. బుధవారం 1,096 టెస్టులు చేస్తే 269 మందికి కన్ఫామ్​ అయింది. శుక్రవారం 2,477 టెస్టుల్లో 499 మందికి, శనివారం 3,188 టెస్టుల్లో 546 మందికి పాజిటివ్ వచ్చింది. ఆదివారం 3,297 మందికి టెస్టులు చేస్తే 730 మందికి వైరస్ ఉన్నట్టు తేలింది. రాష్ట్రంలో టెస్టుల సంఖ్య పెంచాలని.. వైరస్​ కేసులన్నీ బయటపడ్తాయని, వ్యాప్తిని అడ్డుకోవచ్చని డాక్టర్లు, ఎక్స్​పర్టులు చేసిన సూచనలు ఇప్పుడు నిజమవుతున్నాయని అంటున్నారు. టెస్టులు చేయాలని ఎవరు అడిగినా.. తప్పుపట్టిన సర్కారు, అధికారులు ఇప్పుడేం సమాధానం చెప్తారని నిలదీస్తున్నారు.

జనవరి చివరి నుంచే రాష్ట్రంలో కరోనా హడావుడి మొదలైంది. మొదట్లో ఇక్కడ శాంపిల్స్‌‌ తీసి.. టెస్టుల కోసం పుణెలోని వైరాలజీ ల్యాబ్​కు పంపేవారు. ఫిబ్రవరిలో గాంధీ హాస్పిటల్లోని వైరాలజీ ల్యాబ్​లో టెస్టులు చేయడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ పాజిటివ్ వచ్చిన శాంపిల్స్‌‌ను మరోసారి కన్ఫర్మేషన్ కోసం పుణెకు పంపేవారు. రాష్ట్రంలో మార్చి 2న తొలి కేసు, అదే నెల 14న రెండో కేసు నమోదైంది. తర్వాత రోజూ నమోదయ్యాయి. ఆ నెలలో 97 కేసులు వచ్చాయి. అందులో 60 మంది విదేశాల నుంచి వచ్చినవాళ్లు, వాళ్ల కాంటాక్టు వ్యక్తులు ఉండగా.. మిగతావి మర్కజ్ లింక్​ ఉన్నవి. మర్కజ్ లింక్​ బయటపడ్డప్పటి నుంచీ రాష్ట్రంలో కేసులు, టెస్టులు పెరుగుతూ వచ్చాయి. ఏప్రిల్ 19 వరకు రాష్ట్రంలో 14,962 టెస్టులు చేస్తే 858 మందికే వచ్చింది. పాజిటివ్ రేటు 3.9% గా నమోదైంది.

టెస్టులు చెయ్యక తగ్గి..

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏప్రిల్ 20 నుంచి టెస్టుల సంఖ్య తగ్గించారు. డెడ్‌‌ బాడీలకు శాంపిల్స్ తీయొద్దని, సింప్టమ్స్ ఉంటే తప్ప ప్రైమరీ కాంటాక్టులకు కూడా టెస్టులు చేయొద్దని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దాంతో ఏప్రిల్ నెల చివరి పది రోజుల్లో 180 కేసులు మాత్రమే నమోదైనయి. ఈ టైంలో టెస్టుల కోసం జనాలు ఎమ్మెల్యేలతో రికమండేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. టెస్టుల కోసం జనం నుంచి ఒత్తిడి పెరిగినా, ప్రతిపక్షాలు విమర్శలతో విరుచుకుపడినా కూడా అంతంత మాత్రంగానే టెస్టులు చేస్తూ వచ్చారు. మేలో మొత్తం 11,597 మందికి టెస్ట్‌‌ చేస్తే.. 1,660 మందికి పాజిటివ్ వచ్చింది. ఏప్రిల్‌‌లో 3.9 శాతం ఉన్న పాజిటివ్ రేటు.. తర్వాతి నెలలో 14.31 శాతానికి పెరిగింది. ట్రేసింగ్, టెస్టింగ్ సరిగా చేయకపోవడంతో పలువురు కరోనా క్యారియర్లు మారి.. వాళ్లకు తెలియకుండానే వైరస్ ను వ్యాప్తి చేశారు. ఇందుకు లాక్‌‌ డౌన్ సడలింపులు మరింతగా తోడయ్యాయి.

చేసిన టెస్టుల్లో ఈ నెలలోనివే సగం

గత నెల 16 తర్వాత రాష్ట్రంలో లాక్‌‌ డౌన్ సడలించారు. ఇతర రాష్ట్రాల నుంచి తిరిగొచ్చిన వలస కార్మికులతో జిల్లాల్లో కేసులు మొదలయ్యాయి. ఇదే టైంలో గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌ పరిధిలోని అన్ని ప్రాంతాలకు వైరస్ విస్తరించింది. లింకులు కూడా తేలకుండా ఎక్కడికక్కడ కేసులు పెరుగుతూ వచ్చాయి. రోజూ వందల కేసులు వస్తుండడంతో రాష్ట్రంలోనూ టెస్టుల సంఖ్యను వేల సంఖ్యలోకి పెంచారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో 57,054 టెస్టులు చేయగా… ఇందులో దాదాపు సగం వరకు ఈ నెలలో చేసినవే. గత 21 రోజుల్లో 25,562 మందికి టెస్టులు చేస్తే.. 5,104 మందికి వైరస్ ఉన్నట్టు తేలింది. సగటు పాజిటివ్ రేట్ ఏకంగా 19 శాతంగా నమోదవుతోంది.

ఇప్పటికీ టెస్టింగ్ కెపాసిటీ తక్కువే..

టెస్టులు చేయడంపై నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన రాష్ట్ర సర్కారు.. టెస్టింగ్ కెపాసిటీని పెంచుకోవాల్సిన అవసరాన్నీ పట్టించుకోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం ఐసీఎంఆర్ పర్మిషన్ ఉన్న ప్రభుత్వ ల్యాబ్​లు 10 ఉన్నాయి. వాటిల్లో రోజుకు 2 వేల టెస్టులే చేయడానికి వీలుంది. 10 రోజుల్లో 50 వేల టెస్టులు చేయాలన్న సీఎం లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ప్రైవేటు ల్యాబ్​లపై ఆధారపడక తప్పని పరిస్థితి. రోజుకు నాలుగైదు వేల టెస్టులు చేసే మిషన్ తెప్పిస్తున్నామని గత నెలలోనే మంత్రి ఈటల చెప్పారు. ఇటీవల ఆ మిషన్ వచ్చిందనీ చెప్పారు. కానీ ఆ మిషన్ ఇంకా రాలేదని అధికారులు చెప్తున్నారు. ఓ కంపెనీ సీఎస్‌‌ఆర్ కింద మిషన్ ఇచ్చేందుకు సిద్ధమైందని, దాన్ని నిమ్స్‌‌లో ఏర్పాటు చేయడానికి సిద్ధం చేశామన్నారు. వేరే రాష్ట్రాల్లో ఇప్పటికే రోజూ 5 వేల నుంచి 20 వేల దాకా టెస్టులు చేస్తున్నారు. మన దగ్గరా అదే సంఖ్యలో టెస్టులు చేస్తే తప్ప వైరస్‌‌ను కట్టడి చేయలేమని ఎక్స్​పర్ట్స్​ హెచ్చరిస్తున్నారు.

ఆగిన అర్బన్ భగీరథ