
తెలంగాణ రాష్ట్రంలో జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ‘జ్వరమొచ్చింది’... ఏ ఇంటికి వెళ్లినా, ఎవరిని పలకరించినా ఇదే మాట వినిపిస్తోంది. జ్వరాలు, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారు కనిపిస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుండగా అవే లక్షణాలతో కూడిన వైరల్ జ్వరాలతో ప్రజలు సతమతమవుతున్నారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఫ్లూ వైరస్ లక్షణాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నామన్నా దశలో ప్రజలను మరోసారి ఇన్‌ఫ్లూయోంజా హెచ్3, ఎన్2 వేరియేంట్ వైరస్ ఆందోళనకు గురి చేస్తోంది. కొవిడ్ సమయంలోనే అనేక మంది ఇబ్బందులు పడ్డారు. తాజాగా రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సాధారణంగా శీతాకాలంలో కోవిడ్ కేసులు ఎక్కువగా వస్తుంటాయి. కానీ.. ఇప్పుడు ఎండాకాలలోనూ కోవిడ్ కేసులు పెరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
హైదరాబాద్ లోని పలు ఆసుపత్రుల్లో జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో వైద్యాధికారులు బెంబేలెత్తిపోతున్నారు. గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్‌లో గత వారంలో రోజుకు 600 నుండి 800 కేసులు వచ్చాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పారు. ముక్కు కారటం, తలనొప్పి, బాడీ పెయిన్స్, కడుపు నొప్పి, వాంతులు వంటి లక్షణాలతో రోగులు ఆస్పత్రికి వస్తున్నారని చెప్పారు.
* గత వారం రోజులుగా వైరల్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వ ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్ పేర్కొన్నారు. కోవిడ్, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి కేసులు మాత్రం రావడం లేదన్నారు. కేసుల సంఖ్య పెరిగితే ఎదుర్కొనేందుకు ఆసుపత్రి సిద్ధంగా ఉందని తెలిపారు.
* స్వైన్ ఫ్లూకు సంబంధించిన ట్యాబెట్లు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మెడికల్ షాపులు, ప్రైవేట్ ఆసుపత్రులలోనూ మాత్రలు అందుబాటులో ఉంటాయన్నారు.
* స్వైన్ ఫ్లూ ఊపిరితిత్తులకు కూడా సోకుతుందని చెప్పారు. స్వైన్ ఫ్లూ నివారణకు టీకాలు, మాత్రలు అందుబాటులో ఉన్నాయి.
* ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, తరచుగా చేతులు కడుక్కోవాలని, సామాజిక దూరం పాటించాలంటున్నారు.
* ఫ్లూ జ్వరాలు పెరుగుతున్నందున ప్రజలు మళ్లీ మాస్క్‌లు ధరించాలని, లేదా తుమ్మినపుడు క్లాత్ అడ్డంగా పెట్టుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫ్లూ జ్వరాలకు గురైన వారు పిల్లలు, వృద్ధులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
* H3N2, కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. చిన్న పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.