ఫేక్ లోన్ల లెక్క తేలింది! సభ్యులు లేని సంఘాలకు కెనరా బ్యాంకు రుణాలు

ఫేక్ లోన్ల లెక్క తేలింది! సభ్యులు లేని సంఘాలకు కెనరా బ్యాంకు రుణాలు
  • 38 సంఘాలకు రూ. 7.99  కోట్లు
  • చెల్లింపులు లేకపోవడంతో బ్యాంక్​ నోటీసులు
  • లోన్లు తీసుకోలేదంటూ గగ్గోలు పెట్టిన సభ్యులు
  • ఆర్​పీ లపై  కేసు..  కెనెరా బ్యాంకు నుంచి డేటా సేకరణ
  • విచారణ జరుగుతున్న సమయంలోనే రూ.1.61 కోట్లు చెల్లింపులు
  • ఫేక్​ సంఘాల వద్దే ఇంకా రూ. 6.38 కోట్లు 
  • కెనరా బ్యాంకు ఆర్​ఎం కు నివేదిక

యాదాద్రి, వెలుగు :   యాదాద్రి జిల్లాలో సభ్యులే లేని ఫేక్​ మహిళా సంఘాలకు ఇచ్చిన లోన్ల లెక్క తేలింది.ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ఆఫీసర్లు కెనరా బ్యాంక్​ ఆర్​ఎంకు నివేదిక ఇచ్చారు. మెప్మా హయ్యర్​ ఆఫీసర్లకు కూడా నివేదిక పంపించారు. ఫేక్​ సంఘాలను సృష్టించి లోన్లు తీసుకున్న ఆర్​పీలపై ఇప్పటికే ఎఫ్​ఐఆర్​ నమోదైంది. 

సభ్యులే లేని సంఘాల సృష్టి..

సుదీర్ఘకాలంగా మెప్మాలో పని చేస్తున్న ఆర్​పీలు లోన్లు తీసుకోవడానికి కొత్త ప్లాన్​ చేశారు. సభ్యులే లేని మహిళా సంఘాలను సృష్టించారు. ఒక్కొక్కరి పేర్లు రెండుమార్లు రాయడంతో పాటు ఆధార్​ కార్డులు కూడా రెండు చొప్పున జత చేశారు. ఇలా పలు సంఘాలను సృష్టించి కెనరా బ్యాంకులో అకౌంట్లు ఓపెన్​ చేశారు. 2022 నుంచి 2025 వరకు ఒక్కో సంఘం పేరుతో రూ. 20 లక్షలు అంతకుపైగా లోన్లు తీసుకున్నారు. ఈ విధంగా 38 సంఘాల పేర్లతో ఆర్​పీలు రూ. 7.99 కోట్లు లోన్లు తీసుకున్నారు. ఈ లోన్లు తీసుకోవడానికి 2022–-25 మధ్య కాలంలో పని చేసిన ఫీల్డ్​ ఆఫీసర్లు ఆర్​పీలకు సహకరించారు. 

బయటపడింది ఇలా..

ఈ ఏడాది ఫైనాన్స్​ ఇయర్​ ముగింపు సమయానికి మహిళా సంఘాలు తీసుకున్న లోన్లపై బ్యాంకర్లు దృష్టి పెట్టారు. పేమెంట్​ చేయని వారి లిస్ట్​లను రూపొందించిన భువనగిరిలోని కెనరా బ్యాంకు లోన్లు తీసుకున్న సభ్యులకు నోటీసులు పంపించారు. దీంతో అసలు తాము ఆ సంఘంలో లేమని, లోన్లే తీసుకోలేదంటూ పలువురు బ్యాంకుకు వెళ్లి వివరించారు. అనంతరం ఆయా సంఘాలకు లోన్లు ఇప్పించడం కీలకంగా వ్యవహరించిన ఆర్​పీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్​పీలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి కేసులు నమోదు చేశారు. తామెలాంటి తప్పు చేయలేదని ఆర్​పీలు వాదించారు. 

నలుగురు ఆర్​పీలు.. రూ. 7.99 కోట్లు

ఈ అక్రమ లోన్ల వ్యవహారాన్ని సీరియస్​గా తీసుకున్న మెప్మా ఆఫీసర్లు భువనగిరి కెనరా బ్యాంకులోని మహిళా సంఘాలకు సంబంధించిన అకౌంట్ల డేటా తెప్పించారు. అన్ని అకౌంట్ల ఆడిట్​ నిర్వహంచారు. సంఘాలకు ఏవిధంగా లోన్లు మంజూరు చేశారో పరిశీలించారు. రూల్స్​ ప్రకారం మైక్రో క్రెడిట్​ ప్లాన్​ ఆధారంగా లోన్లు ఇవ్వాల్సి ఉండగా, అలాంటిదేమీ లేకుండానే 2022 నుంచి 2025 వరకూ పని చేసిన పలువురు భువనగిరి మున్సిపల్​ కమిషనర్ల సిఫారసుతో ఇచ్చినట్టు తేలింది.  భువనగిరి చెందిన ఆర్​పీ బిందు 13 సంఘాల పేరుతో రూ. 2 కోట్లకు పైగా, మరో ఆర్​పీ దివ్య 21 సంఘాల పేర్లతో రూ. 3.54 కోట్లు, కే సిరియాళ రెండు సంఘాలకు రూ. 27.50 లక్షలు, స్వరాజ్యలక్ష్మి ఒక సంఘానికి రూ. 15 లక్షలు లోన్లు తీసుకున్నారు. గతేడాది ప్రారంభంలోనే ఏర్పాటైన సంఘానికి రూ. 20 లక్షలు లోన్​ ఇప్పించారు. ఇలా మొత్తంగా రూ. 7.99 కోట్లు లోన్లు తీసుకోగా, విచారణ జరుగుతుందని తెలియగానే కొందరు రూ. 1.61 కోట్ల వరకూ చెల్లించారని తెలిసింది. ఇప్పుడు మొత్తంగా ఈ నలుగురు ఆర్​పీలు కలిసి రూ. 6.38 కోట్లు చెల్లించాల్సి ఉంది. 

అక్రమ లోన్లపై నివేదిక

మైక్రో క్రెడిట్​ ప్లాన్​ లేకుండా సభ్యులే లేని ఫేక్​ సంఘాలకు కెనరా బ్యాంకు ఇచ్చిన లోన్లపై నివేదిక రూపొందించారు. ఈ నివేదికను మెప్మా హయ్యర్​ ఆఫీసర్లతో పాటు కెనెరా బ్యాంకు రీజినల్​ మేనేజర్​కు పంపించినట్టుగా తెలిసింది. నివేదికను రెండ్రోజులు ఆపాలని కోరడానికి అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కరరావును కెనెరా బ్యాంకుకు చెందిన ఓ హయ్యర్​ ఆఫీసర్​ కలిసే ప్రయత్నం చేసినట్టుగా సమాచారం. కాగా,  జిల్లలోని చౌటుప్పల్​లోనూ ఇదే విధంగా కొన్ని సంఘాలకు మైక్రో క్రెడిట్​ ప్లాన్​ లేకుండా లోన్లు ఇచ్చినట్టుగా, ఆయా సంఘాల నుంచి చెల్లింపులు రావడం లేదని తెలిసింది. దీంతో చౌటుప్పల్​కు చెందిన పలు బ్యాంకుల నుంచి మహిళా సంఘాలకు ఇచ్చిన లోన్ల డేటాను ఆఫీసర్లు తెప్పించిట్టగా 
తెలుస్తోంది.