నర్సింగ్​ అడ్మిషన్లపై రాని క్లారిటీ

నర్సింగ్​ అడ్మిషన్లపై రాని క్లారిటీ

బిల్డింగ్​ను మెడికల్​ కాలేజీకి అప్పగించిన ఆఫీసర్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు మెడికల్, నర్సింగ్​ కాలేజీలు మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్​తో పాటు హెల్త్​ మినిస్టర్​ హరీశ్​రావు ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్​ లీడర్లు గత ఏడాది జిల్లావ్యాప్తంగా కేసీఆర్​ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. కాలేజీ మంజూరై ఏడాది దాటుతున్నా ఈ సారి అడ్మిషన్లు ఉంటాయో లేదో స్పష్టత లేకుండా పోయింది. నర్సింగ్​ కాలేజీ​ కోసం రూ. 48 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్అండ్​బీ అధికారులు నర్సింగ్​ కాలేజీ పనులు చేపట్టారు. ఆ తరువాత మెడికల్​ కాలేజీకి ఆ బిల్డింగ్​ను కేటాయించడంతో నర్సింగ్​ కాలేజీ పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. 

మెడికల్​ కళాశాలకు నర్సింగ్​కాలేజీ బిల్డింగ్

జిల్లాలోని పాల్వంచ మైనింగ్​ కాలేజీ ఆవరణలో నర్సింగ్, మెడికల్​ కాలేజీల నిర్మాణానికి అవసరమైన ల్యాండ్​ను అధికారులు ఫైనల్​ చేశారు. నర్సింగ్​ కాలేజీ నిర్మాణానికి రూ.48 కోట్లు కేటాయించగా, గత ఏడాది పనులను ఆర్అండ్​బీ అధికారులు ప్రారంభించారు. నర్సింగ్​ కాలేజీ సమీపంలోనే మెడికల్​ కాలేజీ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. నర్సింగ్​ కాలేజ్​ నిర్మాణ పనులు స్పీడప్​ చేశారు. కలెక్టర్​ స్వయంగా పనులను పర్యవేక్షించారు. పనులు ముగిసే టైమ్​లో మెడికల్​ కాలేజీకి ఆ బిల్డింగ్​ను అప్పగించారు. దీంతోపాటు కొత్తగూడెంలోని జిల్లా ప్రభుత్వ​ఆసుపత్రిని మెడికల్​ కాలేజ్​ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. 330 బెడ్స్​ హాస్పిటల్​గా అప్​గ్రేడ్​ చేస్తూ అవసరమైన పనులు చేపట్టారు. రెండు సార్లు పరిశీలించిన అనంతరం మెడికల్​ కాలేజీకి అనుమతి లభించింది. నీట్​ ఫలితాలు కూడా రిలీజ్​ కావడంతో మెడికల్​ కాలేజీలో ఈ విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్​ సీట్ల అడ్మిషన్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

నర్సింగ్  కాలేజీకి పర్మిషన్​ రాలె..

బిల్డింగ్​ను మెడికల్ కాలేజీకి కేటాయించడంతో నర్సింగ్​ కాలేజీ పర్మిషన్​ కోసం దరఖాస్తు చేసుకొనే పరిస్థితి లేకుండా పోయింది. మెడికల్​ కాలేజీతో పాటు నర్సింగ్​ కాలేజీని నడిపించేలా ఉన్నతాధికారులు ప్లాన్​ చేస్తున్నప్పటికీ ఈ ఏడాది పర్మిషన్​ వచ్చే అవకాశాలు లేనట్లేనని అంటున్నారు. ఈ విద్యా సంవత్సరంలో నర్సింగ్​ అడ్మిషన్ల ప్రక్రియను హెల్త్​ యూనివర్శిటీ ఇప్పటికే చేపట్టింది. జిల్లాలో ఏర్పాటు చేయనున్న కాలేజీని పరిశీలించేందుకు నర్సింగ్​కాలేజ్​ ఆఫ్​ కౌన్సిల్​ నుంచి ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. బిల్డింగ్​ మెడికల్​ కాలేజ్​ పరిధిలో ఉండడంతో ఈ ఏడాది అడ్మిషన్లు కష్టమేనని చెబుతున్నారు. ఇదిలాఉంటే నర్సింగ్​ కాలేజీకి సంబంధించి కొందరు స్టాఫ్​ రావడం గమనార్హం. అధికారులు చొరవ తీసుకొని నర్సింగ్​ కాలేజీ పర్మిషన్​ కోసం చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.