రోడ్డు ఖరాబైతే పట్టించుకోని ఆఫీసర్లు.. రిపేర్​ చేయిస్తుంటే అడ్డుకున్నరు

రోడ్డు ఖరాబైతే పట్టించుకోని ఆఫీసర్లు..   రిపేర్​ చేయిస్తుంటే అడ్డుకున్నరు
  • సూర్యాపేటలో అధికారుల తీరు
  • ఆరేండ్ల నుండి రోడ్డుపై గుంతలతో కష్టాలు 
  • స్పందించి పైసలిచ్చిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  
  • పనులు చేస్తుంటే ఆపి అరెస్ట్ ​చేయబోయిన పోలీసులు 
  • అడ్డుకున్న 16వ వార్డు ప్రజలు 

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేటలోని 16వ వార్డు ముత్యాలమ్మ గుడి నుంచి ఖమ్మం రోడ్డు పెట్రోల్ బంక్ వరకు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డుకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్​రావు సొంత డబ్బులతో రిపేర్లు చేయించడం ఉద్రిక్తతకు దారి తీసింది. అరేండ్ల నుంచి రోడ్డుపై గుంతలు పడి జనాలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్డు వేయాలని స్థానిక బీజేపీ కౌన్సిలర్ సలిగంటి సరిత మున్సిపల్ అధికారులకు, మంత్రి జగదీశ్​రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. అయినా, రోడ్డు బాగు చేయలేదు. దీంతో గత ఆదివారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు దృష్టికి సమస్యను తీసుకుపోగా స్పందించారు. 

ఆయన ఇచ్చిన నిధులతో 30 టిప్పర్ల మట్టిని తీసుకువచ్చి శుక్రవారం రోడ్డుకు రిపేర్లు మొదలుపెట్టారు. దీంతో మున్సిపల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి పనులను నిలిపివేయించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ లీడర్లను అదుపులోకి తీసుకోని పీఎస్​కు తరలించే ప్రయత్నం చేయగా వార్డు ప్రజలు అడ్డుకున్నారు. కొద్దిసేపటికి మున్సిపల్​ ఆఫీసర్లు అక్కడికి వచ్చి తమ నిధులతోనే రోడ్లకు రిపేర్లు చేయిస్తామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. 

బీజేపీ జల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేందర్ మాట్లాడుతూ ఆదివారం జరగనున్న ముత్యాలమ్మ బోనాల పండుగ సందర్భంగా రోడ్లకు రిపేర్లు చేయించాలని మున్సిపల్​అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోలేదన్నారు. సంకినేని వెంకటేశ్వర్​రావు స్పందించి రిపేర్​చేయిస్తే అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీకి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే మంత్రి జగదీశ్ రెడ్డి అధికారులు, పోలీసులను రంగంలోకి దింపి ఇదంతా చేయించాడన్నారు. బీజేపీ లీడర్లు పలస మల్సూర్ గౌడ్, పోలగాని ధనుంజయ్ గౌడ్, చల్లమల్ల నరసింహారావు, ఆరూరి శివ, బిట్టు నాగరాజు, ఆకారపు పరిపూర్ణ చారి పాల్గొన్నారు.