ర్యాంకుల కోసం ప్రైవేటు కాలేజీల పాకులాట

ర్యాంకుల కోసం ప్రైవేటు కాలేజీల పాకులాట

ఆదిలాబాద్,వెలుగు: ప్రైవేట్​ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. కష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని చెప్పాల్సిన లెక్చరర్లు మాస్​ కాపీయింగ్ ను ప్రోత్సహిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో జరుగుతున్న ఎగ్జామ్స్​లో జోరుగా కాపీయింగ్​జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్పందించిన ఫ్లయింగ్ ​స్క్వాడ్​ బృందం వరుసగా పరీక్షల కేంద్రాలు తనిఖీ చేస్తోంది. ఇప్పటికే కాపీయింగ్ పాల్పడుతున్న చాలా మంది స్టూడెంట్లను డిబార్​ కూడా చేసింది. బుధవారం కూడా జిల్లాలోని ఇచ్చోడలో పలుకేంద్రాల తనిఖీకి వచ్చిన ఆఫీసర్లపై కొందరు స్టూడెంట్లు దాడికి తెగబడ్డారు. ఫ్లయింగ్ స్క్వాడ్ కారుపై రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిని సీరియస్​గా తీసుకున్న కేయూ పరీక్షల విభాగం అధికారి మల్లారెడ్డి గురువారం ఇచ్చోడలోని ఎగ్జామ్స్​సెంటర్లను తనిఖీ చేశారు. కాపీయింగ్​కు పాల్పడుతున్న ఎనిమిది మందిని పట్టుకున్నారు. అనంతరం ఆదిలాబాద్ పర్యటించి దాడిలో గాయపడ్డ ఆఫీసర్లను పరామర్శించారు.

మీకు మేము... మాకు మీరు...

జిల్లాలో జరుగుతున్న డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షల్లో కొన్ని కాలేజ్ యాజమాన్యాలు తమ విద్యార్థులను ఎలాగైన పాస్ చేయించుకోవాలని అడ్డదారులు తొక్కుతున్నారు. ఆయా సెంటర్లలో రాసే వివిధ కాలేజీల యాజమాన్యాలు ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నాయి. మీకు మేము.. మాకు మీరు అన్నట్లు విద్యార్థులకు తమ కాలేజ్ లో సెంటర్ పడ్డ మరో కాలేజీ విద్యార్థులకు మాస్ ​కాపీయింగ్​ చేయిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్ల హస్తం ఉన్నట్లు సమాచారం. అసలు తరగతులకే హాజరుకాని విద్యార్థుల కోసం కాపీయింగ్​చేయిస్తున్నట్లు తెలిసింది. 

పలువురు లెక్చరర్లు, కాలేజీ సిబ్బంది సైతం విద్యార్థులను నుంచి డబ్బులు దండుకొని చూచిరాతకు ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు కొన్ని యాజమాన్యాలు పోటీ కాలేజీలో విద్యార్థుల అడ్మిషన్లు సంఖ్య ఎక్కువగా ఉంటే స్ట్రిక్ట్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయా యాజమాన్యాల మధ్య విభేదాల కారణంగా విద్యార్థులను దాడులకు ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇచ్చోడలో జరిగిన దాడి ఇందులో భాగమే. ఇది ఇలాఉంటే గతంలో ఆదిలాబాద్,ఉట్నూర్ డిగ్రీ కాలేజ్ లో కాపీయింగ్ కు పాల్పడుతున్న విద్యార్థులను పట్టుకుంటే ఇన్విజిలెటర్లతో గొడవలకు దిగడం, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన ఘటనలు ఉన్నాయి. 

జిల్లాలోనే ఎక్కువ డిబార్లు..

రాష్ట్ర వ్యాప్తంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 8 రోజులుగా డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నడుస్తున్నాయి. ఇందులో ఉమ్మడి జిల్లాలో 49 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కేయూ పరిధిలో 122 మంది విద్యార్థులు మాస్ కాపియింగ్ కు పాల్పడుడితే .. అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 105 మంది ఉండటం గమనార్హం. గురువారం సైతం రాష్ట్రంలో 16 మంది డిబార్ అయితే ఆ మొత్తం విద్యార్థులు ఉమ్మడి జిల్లాకు చెందిన వారే.