పాలమూరు నీళ్లు పారాలంటే.. ఇంకా రెండేండ్లు ఆగాలె!

పాలమూరు నీళ్లు పారాలంటే.. ఇంకా రెండేండ్లు ఆగాలె!
  • 2022 జూన్‌ నాటికి పూర్తి చేయాలని టార్గెట్‌
  • అవి పూర్తయితేనే ప్రాజెక్టు నీళ్లు పారే చాన్స్

హైదరాబాద్‌‌, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ ప్రాజెక్టు నీళ్లు పారాలంటే ఇంకో రెండేండ్లు ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టులోని మొదటి పంపుహౌస్‌‌, రిజర్వాయర్‌‌ పనుల గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. ఎల్లూరు పంపుహౌస్‌‌, నార్లాపూర్‌‌ రిజర్వాయర్ల నిర్మాణాన్ని 2022 జూన్‌‌ నాటికి పూర్తి చేయాలని టార్గెట్‌‌ పెట్టింది. ఈ గడువుకు పనులు పూర్తవడంపై అనేక అనుమానాలున్నాయి. వీటి పనులు పూర్తయితే తప్ప.. ఈ ప్రాజెక్టు నీళ్లు ఆయకట్టుకు చేరవు. ఈ లెక్కన పాలమూరు నీళ్ల కోసం 2023 వరకు వేచి చూడక తప్పదు.

5శాతం పనులన్నా కాలే…

నార్లాపూర్‌‌ రిజర్వాయర్‌‌, పంపుహౌస్‌‌ పనులను 2018 జూన్‌‌ నాటికే పూర్తి చేయాల్సి ఉండగా.. ఈ ఏడాది డిసెంబర్‌‌ నెలాఖరుకు గడువు పొడిగించారు. అయితే అక్కడ 5 శాతం పనులు కూడా కాకపోవడంతో గడువు మరో 18 నెలలు పెంచారు. 2015 జూన్‌‌ లో సీఎం కేసీఆర్‌‌ ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. 30 నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు. కానీ రీసర్వేలు, రీడిజైన్లతో కీలకమైన పంపుహౌస్‌‌, రిజర్వాయర్‌‌ పనులనే నిర్లక్ష్యం చేశారు. ఎల్లూరు పంపుహౌస్‌‌ను మొదట ఓపెన్‌‌ గ్రౌండ్‌‌గా ప్రతిపాదించగా, వర్క్‌‌ ఏజెన్సీ ఒత్తిడితో దాన్ని అండర్‌‌ గ్రౌండ్‌‌గా మార్చారు. అప్రోచ్‌‌ చానల్‌‌, పంపుహౌస్‌‌ పనుల కోసం భూగర్భంలో చేపడుతున్న పేలుళ్ల కారణంగా, దానికి సమీపంలో ఉన్న కల్వకుర్తి పంపుహౌస్‌‌ మునిగిపోయింది. నార్లాపూర్‌‌ రిజర్వాయర్‌‌ను 8.51 టీఎంసీలతో ప్రతిపాదించగా… మట్టి కొరత, ఇతర సాంకేతిక కారణాలతో 5 టీఎంసీలకు కుదించారు. స్థానిక ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో ఫుల్‌‌ కెపాసిటీతోనే నిర్మిస్తామని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు.

ఐదేండ్లలో 30 శాతమే

‘‘తమ్మిడిహెట్టి కాడ తట్ట మట్టి కూడా తీయలే.. కానీ చేవెళ్లలో కాల్వలు తవ్విండ్రు’’ అని తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌‌ ఆంధ్రా పాలకులపై విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుగా ప్రాణహిత–చేవెళ్లను మార్చిన టైమ్ లోనూ ఇలాంటి డైలాగులే కొట్టారు. సమైక్య పాలకులు ప్రాణహితను ఎలా నిర్లక్ష్యం చేశారో.. కేసీఆర్‌‌ అదే రీతిలో పాలమూరును పట్టించుకోలేదు. మొదటి పంపుహౌస్‌‌, రిజర్వాయర్‌‌ పనులు చేయకుండానే మధ్యలో కాల్వలు, టన్నెళ్ల పనులు చేయిస్తున్నారు. ఇంత చేసినా పాలమూరు పనులు ఐదేళ్లలో 30 శాతానికి మించి పూర్తి కాలేదు.