
సుదీర్ఘ చరిత్ర, సాంస్కృతిక ప్రాముఖ్యతతో నిండిన పాలస్తీనా ప్రాంతం 1948 నుంచి ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైన సంఘర్షణలలో ఒకదానిగా ఉంది. తూర్పు మధ్యధరా ప్రాంతంలో ఉన్న పాలస్తీనా, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం వంటి ప్రాంతాలను కలిగి ఉంది, పురాతన నాగరికతలు, మతపరమైన సంప్రదాయాలు, ఆధునిక రాజకీయ పోరాటాలతో ముడిపడి గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. అయితే, అక్టోబర్ 7, 2023లో హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసి గాజా సిటీని పూర్తిగా ధ్వంసం చేసింది. పాలస్తీనా ప్రజలా జీవన్నాన్ని విధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడుల వల్ల ఇప్పటివరకు 65,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది నిరాశ్రులయ్యారు. ఇందులో అత్యధికులు చిన్నపిల్లలు, స్త్రీలు ఉండగా, రెండొందలకు పైగా అంతర్జాతీయ జర్నలిస్ట్ లు ఉన్నారు. గాజాలో మానవతా సంక్షోభం పూర్తిగా క్షిణించింది. ఆహారం, నీరు, వైద్య సామగ్రి కొరత ఏర్పడింది. వెస్ట్ బ్యాంక్‌లో, ఇజ్రాయెల్ వలసవాదుల హింస పెట్రేగిపోయింది. కొంతకాలంగా ఇజ్రాయెల్ వలసవాదులు ప్రపంచ దేశాల నుంచి అందుతున్న సహాయం అడ్డుకోవడం వల్ల సరైన ఆహారం అందక పిల్లలు చనిపోతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 440 మందికి చేరుకోగా వారిలో 147 మంది పిల్లలు ఉన్నారు. ఈ ఘర్షణల కారణంగా మౌలిక సదుపాయాలు నాశనమవుతున్నాయని యూఎన్ఓ, యూనిసెఫ్ లాంటి సంస్థలు నివేదించాయి. రెండు మిలియన్లకుపైగా నివసించే గాజా ఓపెన్ ఎయిర్ జైలుగా మారిపోయింది.
శిథిలావస్థలో పాలస్తీనా
గత రెండేళ్లకు పైగా నడుస్తున్న యుద్ధంలో పాలస్తీనా శిథిలావస్థకు చేరుకుంది. ఈ క్రమంలో పాలస్తీనా ఒక ప్రపంచ సమస్య అని వివరించడానికి చాలామంది ప్రయత్నించారు. ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం వహించిన కాల్పుల విరమణ చర్చలు సహా అంతర్జాతీయ ప్రయత్నాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. అయితే కొద్దిరోజుల క్రితం హమాస్ ప్రతినిధులు లక్ష్యంగా ఖతార్ దేశం మీద దాడి చేసి ఐదుగురు ప్రతినిధులను చంపింది. దీంతో అరబ్ దేశాల్లో ఇజ్రాయెల్ పట్ల అసహనం యెలరేగి ఇస్లామిక్ దేశాల సంయుక్త సమావేశానికి పిలుపునిచ్చాయి.
పాలస్తీనాలో ఇజ్రాయెల్ దురాగతాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని యూదు వ్యతిరేకులుగా ముద్ర వేయడం శోచనీయం. హోలోకాస్ట్‌లో తమ సొంత భాగస్వామ్యాన్ని, అపరాధభావాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ, పశ్చిమ దేశాలు మొదటి నుంచి జియోనిజానికి బేషరతు మద్దతుగా నిలబడ్డాయి. అయితే, ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇజ్రాయెల్‌కి దౌత్యపరమైన అంశాల్లో ప్రధాన భాగస్వాములుగా ఉన్న ఇంగ్లాండ్, కెనడా, ఫ్రాన్స్ దేశాలు పాలస్తిన స్టేట్ ఏర్పాటుకు తమ మద్దతు ప్రకటించాయి.
పాలస్తీనాకు పెరుగుతున్న మద్దతు
పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన తొలి జీ7 దేశంగా కెనడా నిలిచింది. ఇటీవల యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో భారత్ సహా 150 పైగా దేశాలు పాలస్తీనా, ఇజ్రాయేల్ సమస్యకు రెండు దేశాల సొల్యూషన్ కోసం రూపొందించిన న్యూయర్క్ డిక్లరేషన్‌కు మద్దతు తెలిపాయి. ఈ తీర్మానాన్ని ఫ్రాన్స్ ప్రవేశపెట్టగా 10 దేశాలు వ్యతిరేకించాయి. 12 దేశాలు తటస్థంగా నిలిచాయి. వ్యతిరేకించిన వారిలో అమెరికా, ఇజ్రాయెల్, అర్జెంటీనా, హంగేరి ఉన్నాయి. అయితే, భారతదేశం ఎప్పటిలాగే శాంతి, న్యాయం, అనే విలువలకు అండగా నిలిచి యూఎన్ఓలో ఈ తీర్మానానికి తన మద్దతు తెలిపింది. ఈ తీర్మానంలో.. గాజా యుద్ధాన్ని తక్షణం ఆపాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పాలస్తీనా ప్రజలకు స్వయం నిర్ణయ హక్కు ఉందని పునరుద్ఘాటించడం, భూసమీకరణలు, ఆక్రమణలు, స్ధావర నిర్మాణాలను తక్షణం ఆపాలని కోరడంతోపాటు స్వతంత్ర, సార్వభౌమ పాలస్తీనా దేశం ఏర్పాటుకు ఇజ్రాయెల్ స్పష్టమైన నిబద్ధత చూపాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందం
గాజాలో యుద్ధానికి ముందు కూడా పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదాను గుర్తించటానికి బెంజమిన్ నెతన్యాహు మొదటి నుంచి వ్యతిరేకీంచారు. హమాస్‌కు మద్దతిస్తున్నారని ఇరాన్, లెబనాన్, సిరియా, యెమన్ దేశాల మీద ఇజ్రాయెల్ వరుస దాడులను చేస్తున్నది. ఈ క్రమంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందం జరిగినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ప్రకటించారు. దీంతో దీంతో రెండేండ్లుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి తెరపడేందుకు కీలక ముందడుగు పడినట్టయింది. శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమవారిని విడిపించేందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన టీమ్ చూపిన డెడికేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు. దేవుడి దయతో హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని తిరిగి తీసుకరానున్నామని ఎక్స్‌లో నెతన్యాహు పెర్కొన్నారు. కాగా, వలసరాజ్యాల ప్రక్రియ హింసాత్మకమైనదని చరిత్ర పదే పదే నిరూపించింది. ఇప్పుడు పాలాస్తీనా పరిస్థితి కూడా సంక్లిష్టంగా ఉన్నది. ఇప్పుడు ప్రపంచమంతా పాలస్తీనా ప్రజలకు సరైన పరిష్కారం లభించాలని, అక్కడి ప్రజల జీవనం మెరుగుపడాలని ఎదురుచూస్తున్నది.
- సునీల్ నీరడి
రీసెర్చ్ స్కాలర్, ఓయూ