నా బిడ్డను చంపిన హంతకున్ని ఉరి తీయాలి: పోలీస్ స్టేషన్ ముందు సహస్ర తల్లిదండ్రుల ఆందోళన

నా బిడ్డను చంపిన హంతకున్ని ఉరి తీయాలి: పోలీస్ స్టేషన్ ముందు సహస్ర తల్లిదండ్రుల ఆందోళన

హైదరాబాద్: కూకట్‎పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నా బిడ్డను చంపిన హంతకున్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ సహస్ర తల్లిదండ్రులు రేణుక, కృష్ణ, వారి బంధువులు పీఎస్ ముందు ఆందోళనకు దిగారు. క్రికెట్ బ్యాట్ కోసమే హత్య జరిగిందంటూ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.

 పోలీస్ డౌన్ డౌన్ అంటూ పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. సహస్రను చంపిన బాలుడిని తమకు అప్పగించాలని, తన కూతుర్ని హత్య చేసినట్లు నిందితుడుని శిక్షించాలని డిమాండ్ చేశారు. తన బిడ్డను దారుణంగా హత్య చేసిన నిందితుడ్ని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.

బంధువులు, స్థానికులతో కలిసి కూకట్‎పల్లి పీఎస్ ముందు సహస్ర తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో ముంబై హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కిలో మీటర్ల మేర వాహనాలు ముందుకు కదలేని పరిస్థితి హైవే పై నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు. 

Also read:-చవితి రోజు ఇంట్లో వినాయకుడి పూజ ఈ టైంలోనే చేయండి..

హైదరాబాద్‌‌లో సంచలనం సృష్టించిన కూకట్‌‌పల్లి బాలిక హత్య కేసు మిస్టరీ వీడిన సంగతి తెలిసిందే. ఆమెను పక్కింట్లో ఉండే పదో తరగతి బాలుడే హత్య చేసినట్టు తేలింది. చోరీ చేయడం కోసం సహస్ర ఇంటికి వెళ్లిన నిందితుడు.. తనను చూసిందనే కారణంతో బాలికను దారుణంగా హత్య చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. దొంగతనం ఎలా చేయాలి? తర్వాత ఎలా ఇంటికి తిరిగి రావాలి? అని నిందితుడు ముందే ఓ పేపర్‌‌‌‌పై రాసుకున్నాడు. దొంగతనం చేసి వచ్చేప్పుడు ఆ ఇంట్లో గ్యాస్​ ఆన్​చేసి రావాలని అనుకున్నాడు. దీని వల్ల ఫైర్​యాక్సిడెంట్​జరిగి అంతా కాలిపోతుందని భావించాడు. 

ప్లాన్‎లో భాగంగా తనకు నచ్చిన బ్యాట్ కోసమే బాలిక ఇంటికి నిందితుడు వెళ్లాడు. ఎన్నిసార్లు అడిగినా డబ్బు గురించి విచారణలో నిందితుడు చెప్పడం లేదు. బ్యాట్‌ తీసుకొని వెళ్తుండగా దొంగ దొంగ అని అరుస్తూ బాలిక అతనిని అడ్డుకుంది. పారిపోయేందుకు నిందితుడు ప్రయత్నించాడు. నిందితుడి చొక్కాను పట్టుకుని బయటకు పోనివ్వకుండా బాలిక అడ్డగించింది. 

దీంతో బాలికను అతను నెట్టేశాడు. ఆమె మంచంపై పడిపోయింది. ఆ తర్వాత విచక్షణారహితంగా కత్తితో పొడిచి నిందితుడు భవనం పైన ఉన్న పిట్టగోడ దూకి పారిపోయాడు. విచారణలో నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. పోలీసుల తనిఖీల్లో నిందితుడి లేఖ, కత్తి దొరికింది. స్పెషల్ ఫోరెన్సిక్‌ టీం నిందితుడిని గుర్తించింది.