బురద గుంటలే వారి ఇండ్లకు రహదారులు.., దోమలతో దోస్తీ.. బతుకు కోసం కుస్తీ.. ఓట్లడిగేవారు వస్తారు కానీ, సమస్య తీర్చేవారు రారు.. ఇదీ పాలకుర్తి పట్టణ కేంద్రంలోని బుడగ జంగాల కాలనీవాసుల దుస్థితి. పట్టణంలో ఎర్ర మల్లయ్య కుంట సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో 18 ఏండ్లుగా 20 బుడగ జంగాల కుటుంబాలు నివసిస్తున్నాయి. మండలంలో కూలీ పనులు చేసుకుంటూ, పాత చీరలు, ప్లాస్టిక్కవర్లతో కట్టుకున్న గుడిసెలోనే బతుకీడుస్తున్నారు. ఓటు హక్కు, రేషన్‌కార్డులు ఉన్నా, ఇన్నేండ్ల నుంచి వీరికి కరెంటు సౌకర్యం లేదు. వర్షం వస్తే ఇక వారి బాధ చెప్పనక్కర లేదు. గుడిసెలకు వెళ్లాంటే బురద కుంటలు దాటాల్సి వస్తుంది. మురుగు నీరంతా ఇక్కడే చేరడంతో దుర్గంధం, దోమలతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు. - పాలకుర్తి, వెలుగు