మందు తాగి బండి నడిపితే జైలే

మందు తాగి బండి నడిపితే జైలే
  •     మత్తులో గొడవలు, వేధింపులు 
  •     డ్రంకెన్​ డ్రైవ్​పై సీపీ ఫోకస్​

నిజామాబాద్, వెలుగు : డ్రంకెన్​డ్రైవ్​కేసుల్లో పట్టుకున్నవారిని పోలీసులు నేరుగా జైలుకు పంపుతున్నారు. మత్తులో బండ్లు నడపడంవల్ల జరుగుతున్న యాక్సిడెంట్లు, గొడవలను సీపీ కల్మేశ్వర్​సీరియస్​గా తీసుకుంటున్నారు. జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల వ్యవధిలో డ్రంకెన్​డ్రైవ్​కేసుల్లో పట్టుకున్న 267 మందిని జైలుకు పంపారు. 

ఎక్కడికక్కడే టెస్ట్​లు 

జిల్లావ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్​పై పోలీసులు ఫోకస్​ పెట్టారు. హైవేలతోపాటు ప్రధానరోడ్లు, జనసంచారం ఎక్కువ ఉండే బస్డాండ్​, చౌరస్తాలు, సినిమా థియేటర్ల దగ్గర టెస్ట్​లు నిర్వహిస్తున్నారు.గతంలో రాత్రి మాత్రమే పరీక్షలు చేయగా ప్రస్తుతం పగటిపూట కూడా డ్రంకెన్​ డ్రైవ్ టెస్ట్​లు చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కేసు బుక్​చేస్తున్నారు. గత మూడు నెలల్లో 649 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 267 మందికి 10 నుంచి 14 రోజుల జైలు శిక్ష పడింది. మిగిలిన వారికి కోర్టు జరిమానా విధించింది. 

మత్తు వల్లే యాక్సిడెంట్లు.. గొడవలు 

డ్రంకెన్​ డ్రైవ్​ వల్ల యాక్సిడెంట్లు పెరగడమే కాకుండా న్యూసెన్స్​తదితర ఘటనలు పెరుగుతున్నాయి. గత యాడాది జిల్లాలో 767 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 337 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో దాదాపు వంద మందివరకు యువకులే ఉన్నారు. రోడ్​ యాక్సిడెంట్లలో మద్యం తాగి బండ్లు నడపడంవల్ల జరిగినవే ఎక్కువ ఉన్నాయని పోలీసులు తేల్చారు. సరదాగా మందు పార్టీలు చేసుకుని యూత్​ న్యూసెన్స్​చేయడం, గొడవలకు దిగడం

నేరాలకు పాల్పడడం కూడా పెరిగిందని పోలీసులు చెప్తున్నారు. మద్యం మత్తులో యువతులను, మహిళలను వేధిస్తున్న కేసులు కూడా ఈమధ్య ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రమాదాలు, నేరాల నియంత్రణపై పోలీసులు ఇటీవల నిర్వహించిన స్టడీ ఆధారంగా డ్రంకెన్​ డ్రైవ్ కు ప్రయారిటీ ఇవ్వాలని సీపీ డిసైడ్​అయ్యారు. 

శిక్ష పడితే భవిష్యత్ ఖతం​ 

మద్యం తాగి పట్టుబడిన కేసుల్లో శిక్ష పడితే యువత భవిష్యత్​మీద ప్రభావం చూపుతుంది. శిక్ష పడ్డట్టు పోలీసులు రికార్డుల్లో నమోదయితే గవర్నమెంట్ జాబ్స్.. ముఖ్యంగా పోలీస్​ శాఖలో ఉద్యోగాలు రావడం కష్టమతుంది. ఇటీవల జిల్లాలో జరిగిన కానిస్టేబుల్​ సెలెక్షన్స్​లో అన్ని టెస్ట్ ల్లో పాస్​ అయిన 20 మంది యువకులు కేవలం పోలీస్​ కేసుల వల్ల అర్హత కోల్పోవలసివచ్చింది.

లోక్​అదాలత్​లో సెటిల్​ అయిన కేసుల్లో ఉన్నవారిని కూడా కానిస్టేబుల్​ఉద్యోగాలకు తీసుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఏండ్ల తరబడి కష్టపడుతున్న యువత సరదా కోసం మద్యం తాగి వాహనాలు నడిపతే భవిష్యత్​ అంధకారమయ్యే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.

యూత్​కు అవగాహన కల్పిస్తాం 

మద్యం తాగి బండ్లు తోలడం వల్ల జరిగే నష్టాలపై పోలీస్​ కళా బృందంతో జిల్లాలో ప్రదర్శనలు ఇప్పిస్తున్నాం. ట్రాఫిక్​ పోలీసులు కాలేజీల్లో యూత్​కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 సీపీ కల్మేశ్వర్​