
హైదరాబాద్ : బషీర్ బాగ్ లోని నిజాం కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యను పరిష్కరించాలంటూ ప్రిన్సిపాల్ చాంబర్ లో నిరసనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. నూతనంగా నిర్మించిన హాస్టల్ ను అండర్ గ్రాడ్యుయేట్ గర్ల్స్ కు కేటాయించాలంటూ.. చాంబర్ లో ప్రిన్సిపాల్ ను కలిసి విద్యార్థులు అడిగారు. అయితే నూతనంగా నిర్మించిన హాస్టల్ ను పీజీ విద్యార్థులకు కేటాయించాలని వీసీ తమకు ఆర్డర్స్ ఇచ్చారని ప్రిన్సిపాల్ చెప్పడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని, తమకు నూతనంగా నిర్మించిన హాస్టల్ ను కేటాయించాలని వేడుకున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన తమకు హాస్టల్ కేటాయించాలని ప్రిన్సిపాల్ ను కోరారు. ఈ క్రమంలోనే ప్రిన్సిపాల్ చాంబర్ లో విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే నిజాం కాలేజీకి వెళ్లారు. ప్రిన్సిపాల్ చాంబర్ లో నిరసనకు దిగిన విద్యార్థులను అడ్డుకుని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. తమను అరెస్ట్ చేయడాన్ని కొందరు విద్యార్థులు తప్పుపట్టారు. తాము ఏ తప్పు చేశామని అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పోలీసులకు విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో కొందరు విద్యార్థులు స్పల్పంగా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు విద్యార్థులను అరెస్ట్ చేసి, రాంగోపాల్ పేట స్టేషన్ కు తరలించారు.
మరోవైపు కొందరు పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్న తమను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కొంతమంది విద్యార్థులపై పోలీసులు చేయ్యి చేసుకున్నారని తెలుస్తోంది. ఐదు రోజుల్లో న్యాయం చేస్తామని చెప్పి.. రాత్రికి రాత్రి పీజీ వాళ్లకు నూతన హాస్టల్ ను కేటాయించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజాం కాలేజీలో పోలీసులకు ఏం పని అని ప్రశ్నిస్తున్నారు.