రియల్టర్ సూర్యప్రకాష్ ఫ్యామిలీ సూసైడ్ కేసు దర్యాప్తు వేగవంతం 

రియల్టర్ సూర్యప్రకాష్ ఫ్యామిలీ సూసైడ్ కేసు దర్యాప్తు వేగవంతం 

నిజామాబాద్ లో రియలర్ట్ సూర్యప్రకాష్ కుటుంబ సభ్యుల ఆత్మహత్యలపై పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. ఫ్యామిలీ సూసైడ్ కు సూర్యప్రకాష్ బిజినెస్ భాగస్వాముల వేధింపులే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ కేసు విచారణ అధికారిగా నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లను నియమించారు. తమ నలుగురు చావులకు వెంకట సందీప్, కిరణ్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి అనే ముగ్గురు కారణమని సూసైడ్ నోట్ లో సూర్య ప్రకాష్ పేర్కొన్నాడు. 15రోజుల క్రితం సూర్యప్రకాష్ పై వెంకట సందీప్, కిరణ్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఓ పోలీస్ ఉన్నతాధికారి... ఈ ముగ్గురు నిందితుల్లో ఒకరికి బంధువని తెలుస్తోంది. ఆ పోలీసు ఉన్నతాధికారి ద్వారా కేసులు పెట్టిస్తామని వెంకట సందీప్, కిరణ్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి.. సూర్య ప్రకాష్ ను బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సూర్యప్రకాష్ తన కుటుంబ సభ్యులతో కలిసి నిజామాబాద్ కి వచ్చి ఓ హోటల్ లో ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. 

శంకరపల్లిలో వేసిన వెంచర్ విషయంలో సూర్యప్రకాష్ తో వెంకట సందీప్ , కిరణ్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి గొడవ పెట్టుకున్నారని పోలీసులు తేల్చారు. సూర్యప్రకాష్ రాసిన సూసైట్ నోట్ ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూర్యప్రకాష్ ఆత్మహత్యకు కారణమైన ముగ్గురిలో ఒకరు హైదరాబాద్, మరొకరు నిజామాబాద్, ఇంకొకరు విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరి బంధువైన పోలీసు ఉన్నతాధికారి పాత్రపైనా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.  

బిజినెస్ భాగస్వాముల ఒత్తిడి
సూర్యప్రకాశ్(37), అక్షయ(36) దంపతులకు ప్రత్యూష(13), కుమారుడు అద్వైత్‌‌(7) ఉన్నారు. సూర్యప్రకాశ్ కొన్నేళ్లు ఆదిలాబాద్ లోనే హార్డ్ వేర్ షాప్ తో పాటు పెట్రోల్ బంక్ నడిపించాడు. అయితే.. నాలుగేళ్ల క్రితం అక్కడి ఆస్తులన్నీ అమ్ముకొని కుటుంబంతో సహా హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాడు. నగర శివార్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. లాక్ డౌన్ టైమ్ లో కొన్నిచోట్ల వెంచర్లు వేయగా, పెద్ద ఎత్తున నష్టం వచ్చింది. దీంతో తాము పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాలంటూ బిజినెస్ భాగస్వాములు సూర్యప్రకాశ్ పై ఒత్తిడి తెచ్చారు. అప్పులు చేసి కొంత మొత్తం చెల్లించినా, మిగతావి ఇవ్వాలని వేధింపులకు గురి చేశారు.  

17 రోజులుగా హోటల్​లోనే మకాం... 
పార్ట్​నర్ల వేధింపులు ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న సూర్యప్రకాష్.. ఈ నెల 4వ తేదీన కుటుంబంతో సహా నిజామాబాద్ కు వచ్చి ఓ హోటల్ లో దిగాడు. అప్పటి నుంచి కుటుంబంతో అందులోనే ఉంటున్నాడు. రెండు, మూడ్రోజుల క్రితం నిజామాబాద్‌లో ఉంటున్న తమ బంధువుల ఇంట్లో జరిగిన సత్యనారాయణ వ్రతానికి కుటుంబంతో సహా హాజరయ్యాడు. ఈ క్రమంలో సూర్యప్రకాశ్ శనివారం రాత్రి 8 గంటలకు భార్య, పిల్లలకు కేక్​లో విషం కలిపి తినిపించాడు. వాళ్లందరూ చనిపోయారని నిర్ధారించుకున్నాక హోటల్ రూమ్ లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు తానూ ఉరేసుకున్నాడు. ఆదివారం రూమ్ లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడం..కాలింగ్​బెల్​కొట్టినా, ఫోన్​చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్​ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి డోర్ తెరిచి చూడగా అందరూ చనిపోయి కనిపించారు. సూర్యప్రకాశ్ దగ్గర సూసైడ్​నోట్ దొరికింది. తన రియల్​ఎస్టేట్​ వ్యాపారంలో పార్టనర్లుగా ఉన్న​ కిరణ్​కుమార్, వెంకట సందీప్,కళ్యాణ్ చక్రవర్తి  అనే ముగ్గురు వ్యక్తుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ నోట్ లో రాసి ఉంది. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు.