వరంగల్ జిల్లా వివాహిత హత్య కేసు ..మరో వ్యక్తితో సంబంధం ఉందని ప్రియుడే చంపాడు

వరంగల్ జిల్లా వివాహిత హత్య కేసు ..మరో వ్యక్తితో సంబంధం ఉందని  ప్రియుడే  చంపాడు

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం శివారులో ఇటీవల సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘోరం జరిగినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నర్సంపేట ఏసీపీ పి. రవీందర్ రెడ్డి మీడియాకు వివరించారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన సుమలత అనే మహిళ హత్య కేసులో.. ఆమె ప్రియుడు పాండవుల సురేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఐదు సంవత్సరాల క్రితం సుమలత భర్త మృతి చెందగా.. నాటి నుంచి ఆమె సురేష్‌తో సన్నిహిత సంబంధం కొనసాగిస్తోంది.

అయితే, కొంతకాలంగా వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. సుమలత మరో వ్యక్తితో కూడా సంబంధం కొనసాగిస్తోందని సురేష్ అనుమానించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే ఇటీవల ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో.. ఆగ్రహానికి గురైన సురేష్, సుమలతను దారుణంగా హత్య చేసినట్లు ఏసీపీ తెలిపారు.

నిందితుడు సురేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ఈ దారుణ హత్యకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వస్తాయని ఏసీపీ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి వివాహేతర సంబంధం కారణంగా జరిగిన ఈ హత్య కేసును దుగ్గొండి పోలీసులు చాకచక్యంగా ఛేదించి, నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు.