నవంబర్ 9 నుంచి అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు

 నవంబర్ 9 నుంచి అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు

శనివారం (డిసెంబర్ 9) నుంచి హైదరాబాద్ లో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ సమావేశాల దృశ్యా 4 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.

ఎక్కువ మంది గుమికూడడం, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి, ప్రశాంతతకు భంగం కల్గించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పబ్లిక్‌ గార్డెన్స్‌, అసెంబ్లీ పరిసరాలలో వాకింగ్‌ చేసే వారు ఉదయం 7 గంటల లోపు వాకింగ్‌ ముగించుకోవాలని అసెంబ్లీ అధికారులు తెలిపారు. 7 గంటల తరువాత పోలీసు బందోబస్తు ఆంక్షలు ఉండడంతో, సామాన్య ప్రజలను అటు వైపు అనుమతించరని తెలిపారు. 

మరోవైపు.. తెలంగాణ 3వ శాసనసభ శనివారం (డిసెంబర్ 9) ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ఉదయం 8.30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీతో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్న అక్బరుద్దీన్‌ ఒవైసీ.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్‌ నియామకంపై రాజ్‌భవన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.