ఆపేందుకొచ్చిన పోలీసులనే కొట్టిన్రు

ఆపేందుకొచ్చిన పోలీసులనే కొట్టిన్రు

మెదక్‌‌ జిల్లా హవేలి ఘనపూర్​ మండల పరిధి స్కూల్​ తండాలో ఘటన

మెదక్ టౌన్, వెలుగు: ఓ గిరిజన యువకుడు అను మానాస్పదంగా మృతిచెందడం ఇరువర్గాలు ఘర్షణకు దారితీసింది. నిలువరించేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడిచేయడంతోపాటు పోలీస్​ వెహికిల్​ ధ్వంసం చేశారు. మెదక్‌‌ జిల్లా హవేలి ఘనపూర్​ మండల పరిధి స్కూల్​ తండాలో శుక్రవారం జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని స్కూల్ తండాకు చెందిన మాలోత్ నవీన్​(22) గురువారం అనుమానాస్పదంగా చెరువులో పడి మృతిచెందాడు. శుక్రవారం మెదక్​ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం తర్వాత కుటుంబ సభ్యులు డెడ్ బాడీని తండాకు తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కాగా నవీన్​ మృతదేహంపై గాయాలు ఉన్నాయని, పాత కక్షలతో అతడిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తూ బంధువులు అనుమానితులపై దాడికి దిగారు. హవేలి ఘనపూర్​ పోలీస్​ స్టేషన్​ ఏఎస్సై విఠల్, ముగ్గురు కానిస్టేబుల్​లు తండాకు వెళ్లి  సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో వారు ఎదురుతిరిగి, పోలీసుల బొలెరో వెహికిల్​ను ధ్వంసం చేశారు. ముగ్గురు పోలీసులకు స్వల్పంగా దెబ్బలు తగిలాయి. మెదక్​ రూరల్​ సీఐ పాలవెళ్లి, రూరల్​ ఎస్సై కృష్ణారెడ్డి సిబ్బంది బందోబస్తు మధ్య నవీన్​ అంత్యక్రియలు జరిగాయి. గొడవ, పోలీసు వెహికిల్ ధ్వంసంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.