డీనోటిఫై​ నోట్లను కొత్త నోట్లుగా మార్చుకునేందుకు ప్లాన్​

డీనోటిఫై​ నోట్లను కొత్త నోట్లుగా మార్చుకునేందుకు ప్లాన్​

ములుగు, వెలుగు: ప్రభుత్వం రద్దు చేసిన రూ.1.65 కోట్ల విలువగల రూ.500, రూ.1000 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ డాక్టర్ ​సంగ్రాంసింగ్​ జి పాటిల్​ ములుగులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూర్యాపేటకు చెందిన పప్పు నాగేంద్ర బాబు రియల్​ ఎస్టేట్​వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారంలో చేసిన అప్పులు చెల్లించలేక ఈజీ మనీ బిజినెస్ కు అలవాటుపడ్డాడు. హైదరాబాద్​కు చెందిన వారితో కలిసి రద్దు చేసిన నోట్ల మార్పిడికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. విషయాన్ని అతని ఫ్రెండ్ ​నాగలింగేశ్వరరావుతో చెప్పాడు.

వెంకటాపురానికి చెందిన బెజ్జంకి సత్యనారాయణతో కలిసి డీనోటిఫై​ నోట్లను కొత్త నోట్లుగా మార్చుకునేందుకు మరికొందరితో కలిసి ప్లాన్​ చేశారు. సేకరించిన డీ నోటిఫై నోట్లతో హైదరాబాద్​ బయలుదేరారు. ములుగు జిల్లా వెంకటాపురంలో సివిల్, సీఆర్​పీఎఫ్  పోలీసులు గురువారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు కార్లలో 8 మంది వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను చూసి పారిపోతుండగా వారిని పట్టుకుని సోదా చేశారు. వారి వద్ద రూ.1.65 కోట్ల విలువ గల రద్దు చేసిన నోట్లు కనిపించాయి. అందులో కొంత నకిలీ కరెన్సీ కూడా ఉన్నదని నాగేంద్రబాబు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. అరెస్ట్​చేసిన వారిలో సూర్యాపేటకు చెందిన పప్పు నాగేంద్రబాబు, శ్రీరాముల నాగలింగేశ్వరరావు, భద్రాచలానికి చెందిన ఆరె సాంబశివరావు, వెంకటాపురానికి చెందిన బెజ్జంకి సత్యనారాయణ, ఛత్తీస్​గడ్​ రాష్ట్రంలోని బస్తర్​కు చెందిన రజత్​సింగ్, నారాయణపేట జిల్లాకు చెందిన వడ్డి శివరాజ్​పాటిల్, హైదరాబాద్​ ఉప్పల్​కు చెందిన గంట యాదగిరి, సైబరాబాద్​కు చెందిన కాకు రాజాసింగ్​ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.