
న్యూఢిల్లీ: మంచి రాబడులను ఇచ్చే నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)కు ఏటా ఆదరణ పెరుగుతోంది. 2021–22 ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్పీఎస్ సబ్స్క్రయిబర్ల సంఖ్య 22 శాతం పెరిగి 5.20 కోట్ల మందికి చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పీఎస్‌లో 4.42 కోట్ల మంది సబ్స్క్రయిబర్లు ఉండేవారని పెన్షనల్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) తెలిపింది. 2022 మార్చి 31 నాటికి అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) సహా మొత్తం పెన్షన్ ఆస్తులు విలువ 27.43 శాతం పెరిగి రూ.7.36 లక్షల కోట్లకు పెరిగింది. ఎన్పీఎస్, ఏపీవై.. పీఎఫ్ఆర్డీఏ నిర్వహిస్తున్న రెండు ముఖ్యమైన స్కీములు. ఎన్‌పీఎస్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కేటగిరీలోని సబ్స్క్రయిబర్లు వరసగా 4.96 శాతం, 8.48 శాతం పెరిగి 22.84 లక్షలు, 55.77 లక్షలకు చేరారని పీఎఫ్ఆర్డీఏ డేటా పేర్కొంది. కార్పొరేట్ సెక్టార్ ఏడాదిలో 24.8 శాతం గ్రోత్‌ను సాధించింది. సబ్స్క్రయిబర్ల సంఖ్య కిందటి సంవత్సరంతో పోలిస్తే 11.25 లక్షల నుండి 14.04 లక్షలకు పెరిగింది. ‘ఎన్‌పిఎస్ లైట్’ సబ్స్క్రయిబర్ బేస్ మాత్రం ఇదే కాలంలో 43.02 లక్షల నుంచి 41.87 లక్షలకు తగ్గింది. ఏప్రిల్ 1, 2015 నుండి అమలులోకి వచ్చేలా ఈ కేటగిరీ కింద కొత్త రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వడం లేదు. అటల్ పెన్షన్ యోజన సబ్స్క్రయిబర్ల సంఖ్య మార్చి 2022 చివరి నాటికి 29.33 శాతం పెరిగి 3.62 కోట్లకు చేరుకుంది. ఇందులో గత ఏడాదిలో 2.81 కోట్ల మంది ఉన్నారు.
ఎన్పీఎస్ అంటే ఏమిటి ?
రిటైర్మెంట్ తర్వాత లేదా ముసలివయసులో కొంత ఆదాయాన్ని అందించడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పదవీ విరమణ ప్రయోజన పథకమే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్). పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ( పీఎఫ్ఆర్డీఏ ) ఎన్పీఎస్ను నిర్వహిస్తుంది. దీనికి పాలకమండలిగానూ పనిచేస్తుంది. జనంలో పొదుపులను పెంచడం, పెన్షన్ సంస్కరణలను అమలు చేయడం ఈ పథకం ఉద్దేశం. 2004 జనవరి తరువాత చేరిన ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ ఎన్పీఎస్ తప్పనిసరి. ఇందులో రెండు ఖాతాలు ఉంటాయి. టయర్ – 1 ఖాతా మొదటిది. సబ్స్క్రయిబర్లంతా దీనిని కచ్చితంగా తీసుకోవాలి. ఉద్యోగుల బేసిక్ పే + డియర్నెస్ అలవెన్స్ లో 10శాతం ప్రాణ్ ఖాతాలో జమ చేస్తారు. దానికి సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ టయర్ –1 ఖాతానుండి 60 సంవత్సరాలవరకు డబ్బును వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. ఉద్యోగికి ఇష్టముంటే టయర్ –2 ఖాతా తెరచి అందులో కూడా జమ చేయవచ్చు. టయర్ –2 ఖాతాలకు గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఉండదు. అందులో పెట్టిన డబ్బును ఎన్నిసార్లయినా వెనక్కి తీసుకోవచ్చు. ఇలా జమ అయిన మొత్తాన్ని ఫండ్ మేనేజర్స్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఉద్యోగికి 70 సంవత్సరాలు వచ్చిన తరువాత టయర్ –1 ఖాతాలోని మొత్తంలో కనీసం 40 శాతం డబ్బును ఏదైనా ఒక గుర్తింపు పొందిన పింఛను పథకంలో (యాన్యుటీ) తప్పక పెట్టాలి. మిగిలిన మొత్తాన్ని తీసుకోవచ్చు. ఎన్పీఎస్కు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరి లిమిటెడ్.. సెంట్రల్ రికార్డు కీపింగ్ ఏజెన్సీ పనిచేస్తుంది. ఖాతాల నిర్వహణ, అకౌంటింగ్ వంటివి దీని బాధ్యతలు.
మరికొన్ని ముఖ్యమైన సంగతులు
1. ఎన్‌పీఎస్‌లో ఎన్ఆర్ఐలు సహా 18–70 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు ఖాతా తెరవచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల ముసలితనంలో/రిటైర్మెంట్ తరువాత డబ్బు కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు. భవిష్యత్‌లో కచ్చితమైన రాబడులు అందుతాయి. ఏటా 9 శాతం నుంచి 12 శాతం వరకు వడ్డీ రేటు వచ్చే అవకాశం ఉంటుంది.
2. ఇది వాలంటరీ స్కీమ్. మీరు మీ ఎన్పీఎస్ ఖాతాలో ఎప్పుడైనా పెట్టుబడి పెట్టవచ్చు. రూల్స్ ప్రకారం పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు.
3. మీరు పీఓపీ (పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్), ఇన్వెస్ట్‌మెంట్ ప్యాటర్న్, ఫండ్ మేనేజర్‌ని ఎంచుకోవడానికి లేదా మార్చడానికి అవకాశం కల్పిస్తారు. మీకు నచ్చిన/అనువైన అసెట్ క్లాస్‌లలోనే (ఈక్విటీ, కార్పొరేట్ బాండ్‌లు, ప్రభుత్వ సెక్యూరిటీలు) ఫండ్ మేనేజర్ మీ డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు.
4. ఎన్‌పీఎస్‌లో చిన్న మొత్తాల్లోనూ పొదుపు చేయవచ్చు. ఉద్యోగం, నగరం లేదా రాష్ట్రం మారినా ఎన్పీఎస్ ఖాతా లేదా ప్రాణ్ అలాగే ఉంటుంది.
5. ఎన్‌పిఎస్ ఖాతాదారులు తమ సూపర్ యాన్యుయేషన్ ఫండ్‌లను ఎటువంటి పన్ను సమస్యలు లేకుండా తమ ఎన్‌పిఎస్ ఖాతాకు బదిలీ చేయవచ్చు.
6. జీతం వచ్చేవారితోపాటు స్వయం ఉపాధి పొందే వారికీ పన్ను ప్రయోజనాలు ఉంటాయి. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద
రూ.50వేల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. సెక్షన్ 80సీ కింద 1.50 లక్షలకు మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ. 50వేల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. సెక్షన్ 80సీ కింద 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.
ఎంత ఇన్వెస్ట్ చేయాలి ?
ఉద్యోగులు అయితే బేసిక్ శాలరీ + డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)లో 10శాతం వరకు పెట్టుబడి పెట్టవచ్చు . సెక్షన్ 80సీసీడీ(1) కింద పెట్టుబడి పెట్టిన మొత్తంపై పన్ను మినహాయింపును పొందవచ్చు. ఈ పన్ను మినహాయింపు ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 80సీ కింద రూ. 1.50 లక్షల పరిమితికి లోబడి ఉంటుంది. ఇతరులు అయితే ఏడాది ఆదాయంలో 20 శాతం వరకు పెట్టుబడి పెట్టవచ్చు సెక్షన్ 80సీసీడీ(1) కింద పెట్టుబడి పెట్టిన మొత్తంపై పన్ను మినహాయింపును పొందవచ్చు. ఈ పన్ను మినహాయింపు ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 80సీ ప్రకారం రూ. 1.50 లక్షల పరిమితికి లోబడి ఉంటుంది.