బ్రిడ్జిపైనే గర్భిణి ప్రసవం 

బ్రిడ్జిపైనే గర్భిణి ప్రసవం 

కాగజ్ నగర్, వెలుగు :  అసలే మారుమూల గ్రామం. అందునా వానాకాలం. వరదలకు రోడ్లు కూడా దెబ్బతిన్నాయ్. ఈ పరిస్థితుల్లో ఓ నిండు గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆటోలో హాస్పిటల్ కు వెళ్తుండగా ఖరాబైన రోడ్డు వీరికి బ్రేక్​వేసింది. అంతకుముందే 108కు ఫోన్​చేసినా అక్కడకు టైంకు రాలేకపోయింది. దీంతో రెండుగంటల ప్రసవ వేదన అనుభవించిన ఆమె అక్కడే మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కోయపల్లి సమీపంలో ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది. బెజ్జూర్​మండలం నాగేపల్లికి చెందిన కొడిపె శ్రీహరి భార్య మల్లుభాయికి నెలలు నిండాయి. గురువారం మధ్యాహ్నం పురిటి నొప్పులు మొదలుకావడంతో ఆశా కార్యకర్త దుర్గుబాయి, మరికొంతమంది మహిళలు మల్లుబాయిని ఆటోలో ఎక్కించుకుని బెజ్జూర్​బయలుదేరారు. సుస్మీర్ దగ్గర ఒర్రె ఉధృతికి రోడ్డు దెబ్బతిని ఉండడంతో చింతలమానేపల్లి మండలం కోయపల్లి మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అంతకుముందే108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అయితే కోయపల్లి దగ్గర్లోని బ్రిడ్జి సమీపంలో రోడ్డు వర్షాలకు కోతకు గురికావడంతో అక్కడే ఆగిపోయారు. కేవలం టూ వీలర్​మాత్రమే వెళ్లే పరిస్థితి ఉండడంతో బ్రిడ్జి పైనే రెండు గంటల పాటు అంబులెన్స్ కోసం వేచి చూశారు. అంబులెన్స్​కూడా సుమారు 30 కిలోమీటర్లు రావాల్సి ఉండడం, వేరే కేసులతో సమయానికి చేరుకోలేకపోయింది. మల్లుభాయికి నొప్పులు ఎక్కువ కావడంతో ధైర్యం చెప్పి బ్రిడ్జిపైనే కాన్పు చేయగా మగబిడ్డ పుట్టింది. ఇంతలో108 అంబులెన్స్ అక్కడకు చేరుకుని తల్లీ, బిడ్డను బెజ్జూర్​పీహెచ్​సీకి తరలించింది. అక్కడికి వెళ్లాక తల్లీబిడ్డలు క్షేమంగా ఉండడంతో ఇంటికి తీసుకెళ్లారు.