కాకతీయ వారుసులకు సమ్మక్క సారె

కాకతీయ వారుసులకు సమ్మక్క సారె
  • చీర, కుంకుమ భరిణె, ప్రసాదం పంపిన పూజారులు
  • చత్తీస్​గఢ్​లో స్వీకరించిన రాజమాత కృష్ణకుమారి దేవి 
  • టార్చ్​ సంస్థ పరిశోధకుడు అరవింద్​ ఆర్య ద్వారా అందజేత

వరంగల్​, వెలుగు: మేడారం సమ్మక్క, సారలమ్మ పూజారులు, కాకతీయ వారసుల మధ్య సరికొత్త బంధానికి అడుగులు పడ్డాయి. కాకతీయ వారసులకు సమ్మక్క పూజారులు సమ్మక్క సారెను పంపించారు. కొన్నేండ్లుగా కాకతీయులపై పరిశోధనలు చేస్తున్న ‘టీమ్​ ఆఫ్​ రీసెర్చ్​ ఆన్​ కల్చర్​ అండ్​ హెరిటేజ్​– టార్చ్​’ అనే సంస్థ ప్రధాన కార్యదర్శి అరవింద్​ ఆర్య ద్వారా సారెను అందజేశారు. అమ్మవారి చీర, కుంకుమ భరిణె, బంగారం (బెల్లం), ప్రసాదాన్ని చత్తీస్​గఢ్​లోని జగదల్​పూర్​లో ఉంటున్న కాకతీయ వంశానికి చెందిన రాజమాత కృష్ణకుమారి దేవి, కమల్​ చంద్రదేవ్​ భంజ్​లకు శుక్రవారం అందించారు. 

అమ్మలపై ఎన్నెన్నో కథలు

సమ్మక్క, సారలమ్మల జీవిత విశేషాలపై ఎన్నో రకాల కథలు వినిపిస్తున్నాయి. వాళ్లు తల్లీకూతుళ్లని కొందరు, అక్కాచెల్లెళ్లని ఇంకొందరు, సవతులని మరికొందరు చెప్తుంటారు. అందులో ఏది నిజమన్నది ఎవరూ తేల్చలేకపోయారు. కాకతీయ ప్రతాపరుద్రుడిని యుద్ధంలో ఎదురించి వీరమరణం పొందరాని ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. దానికి ఆధారాలు లేకున్నా జనం నమ్ముతున్నారు. అయితే, అసలు కాకతీయులు, సమ్మక్క, సారలమ్మల మధ్య ఎలాంటి యుద్ధం జరగలేదని సమ్మక్క తల్లి పూజారులు, కోయ డోలి కళాకారులు, కొందరు చరిత్రకారులు చెప్తున్నారు. చరిత్రను వక్రీకరించడం వల్ల రకారకాల కథలు వినిపిస్తున్నాయని, వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు.

జగదల్​పూర్​ కోటలో కాకతీయ వారసులు 

ఓరుగల్లు కేంద్రంగా ఉన్న కాకతీయ సామ్రాజ్యం.. ప్రతాపరుద్రుడి మరణంతో పతనమైంది. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు గోదావరి తీరం వెంట సాహస ప్రయాణం చేసి దండకారణ్యం చేరుకున్నారట. అన్నమదేవ్​ కాకతీయ వారసుడిగా జగదల్​పూర్​లో కొత్త సామ్రాజ్యం స్థాపించాడని బ్రిటీష్​ వాళ్ల పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతం అన్నమదేవ్​ పరంపరలో కమల్​చంద్రదేవ్​ భంజ్​ కొనసాగుతున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులు జగదల్​పూర్​ కోటలోనే ఉంటున్నారు. స్థానిక పండుగల్లో కాకతీయ సంప్రదాయాలు, వైభవాలను ఇంకా కొనసాగిస్తున్నారు.

స్త్రీలను శక్తి స్వరూపాలుగా పూజిస్తం 

వీరత్వం, త్యాగానికి మారుపేరైన సమ్మక్క సారె అందుకున్నందుకు సంతోషంగా ఉంది. దండకారణ్యంలో మహిళా సాధికారతకు ఎంతో ప్రాధాన్యముంది. మేం మహిళలను శక్తి స్వరూపాలుగా పూజిస్తున్నాం. శక్తిపీఠంగా పేరొందిన దంతేశ్వరి మాత మాకు ఆరాధ్య దైవం. బస్తర్​ ప్రాంతమే సమ్మక్క జన్మస్థలమన్న వాదనలు ఉన్నాయి. ఇక్కడ సమ్మక్కను ‘సడువలి’ పేరుతో కొలుస్తారు. నిజానిజాలేంటో తెలుసుకోవాలంటే సమ్మక్క, సారలమ్మలపై అధ్యయనం చేయాలి. 
- మహారాజా కమల్​ చంద్రదేవ్​ భంజ్​, 
   కాకతీయ వారసుడు

వచ్చే జాతరకు కాకతీయులను ఆహ్వానిస్తం

కాకతీయ రాజులు, సమ్మక్క, సారలమ్మ కుటుంబాల మధ్య సంబంధాలపై చాలా అబద్ధాలు ప్రచారంలో ఉన్నాయి. కాకతీయులకు, సమ్మక్క సారలమ్మలకు మధ్య యుద్ధం జరిగినట్టు మా పూర్వీకులు ఎప్పుడూ మాకు చెప్పలేదు. కాకతీయ వారసులకు సమ్మక్క తల్లి సారె పంపినం. సారలమ్మ వంశస్తులు ఎక్కువ శాతం ఇప్పటికీ బస్తర్​ ప్రాంతంలో ఉన్నారు. వచ్చే మేడారం జాతరకు కాకతీయుల వారసులను ఆహ్వానిస్తాం.
- సిద్ధబోయిన అరుణ్​కుమార్​, 
సమ్మక్క పూజారుల సంఘం అధ్యక్షుడు