యూరియా కోసం ఆందోళన చెందవద్దు : కలెక్టర్ కుమార్ దీపక్

యూరియా కోసం ఆందోళన చెందవద్దు : కలెక్టర్ కుమార్ దీపక్
  • రైతుల అవసరం మేరకు యూరియా పంపిణీ
  • కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్(భీమారం), వెలుగు: సాగుకు అవసరమైన యూరియా పంపిణీ చేస్తామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం ఆయన భీమారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సుధాకర్ తో కలిసి రైతులతో మాట్లాడారు. సాగుకు అవసరమైన యూరియా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భీమారం మండలంలో గతేడాది 14 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించారని, ఈ ఏడాది ఇప్పటికే 11 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామని చెప్పారు. మూడు నాలుగు రోజుల్లో ఇంకా మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల్లో యూరియా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. 

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన పీహెచ్ సీ బిల్డింగ్ పనులను పరిశీలించారు. పనులు స్పీడప్​ చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేజీబీవీ స్కూల్ ను తనిఖీ చేశారు. క్లాస్ రూమ్స్, రిజిస్టర్లు, చికెన్ పరిసరాలను పరిశీలించారు.6వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు.

గోదావరిలో నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి

నస్పూర్, వెలుగు: ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి నీరు చేరుతున్న నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ కుమార్​దీపక్​సంబంధిత అధికారులకు సూచించారు. మంచిర్యాల కాలేజ్ రోడ్డులోని గోదావరి నది తీర ప్రాంతాన్ని తహసీల్దార్ రఫతుల్లాతో కలిసి పరిశీలించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నందున ప్రాజెక్టుల నుంచి వరద నీరు గోదావరి నదిలోకి చేరుతోందని, నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. 

అనంతరం పాత మంచిర్యాల ప్రాంతంలో కొనసాగుతున్న ఇందిరా మహిళ భవన్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు స్పీడప్ చేసి త్వరగా పూర్తిచేసేలా అధికారులు, గుత్తేదారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.