కుమ్రంభీం వర్ధంతికి పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

కుమ్రంభీం వర్ధంతికి పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
  • కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రంభీం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. కుమ్రంభీం 85వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం కెరెమెరి మండలం జోడేఘాట్​లో ఉట్నూర్ ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి వర్ధంతి, దర్బార్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

 కుమ్రంభీం సమాధి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అక్టోబర్ 7న నిర్వహించనున్న వర్ధంతికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు.

 జోడేఘాట్ లో శాశ్వత సభావేదిక నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు, వేడుకలకు వచ్చే ప్రజలకు భోజనం, తాగునీరు ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, పారిశుధ్య కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. హట్టి నుంచి జోడేఘాట్ వరకు బస్ లు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. 

దరఖాస్తుల నమోదుకు కౌంటర్లు ఏర్పాటు 

ఐటీడీఏ ద్వారా గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై శాఖల వారీగా స్టాళ్లను ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్​ సూచించారు. గిరిజన ప్రజల సమస్యల ధరఖాస్తులను నమోదు చేసుకునేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తామని, దర్బార్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో కుమ్రంభీం మనుమడు సోనేరావు, ఏఎస్పీ చిత్తరంజన్, ఉత్సవ కమిటీ సభ్యులు పెందోర్ రాజేశ్వర్, రాయి సెంటర్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.