అయ్యో.. ‘రామచంద్రా’!

అయ్యో.. ‘రామచంద్రా’!
  • పద్మశ్రీ సకిని రామచంద్రయ్యకు ఇచ్చిన హామీ ఏమైనట్టు?
  • అనారోగ్యంతో బాధపడుతూ ఆదుకోవాలని వేడుకోలు

భద్రాచలం, వెలుగు : కోయదొరల ఇలవేల్పుల కథకుడు పద్మశ్రీ సకిని రామచంద్రయ్యను గత బీఆర్​ఎస్​ సర్కారు విస్మరించింది. 2022లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీని ఇచ్చినప్పుడు నాటి బీఆర్​ఎస్​ సర్కారు పిలిచి సన్మానించి, కోటి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించింది.

జీవో జారీ చేసి జిల్లా కలెక్టర్​కు కూడా పంపారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. కానీ నేటికీ ఆ హామీ కాగితాల్లోనే నలుగుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న సకిని రామచంద్రయ్య సర్కారు ఇస్తామన్న డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. 

ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ...

కంచు తాళం, కంచు మేళంకు దేశవ్యాప్త గుర్తింపు తెచ్చి పద్మశ్రీ అవార్డును పొందిన మణుగూరు మండలం కూనవరం గ్రామంకు చెందిన సకిని రామచంద్రయ్య ప్రస్తుతం ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. రెండేళ్లుగా నాటి బీఆర్​ఎస్​ సర్కారు ప్రకటించిన కోటిరూపాయల నజరానా కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనకు అప్పటి ప్రభుత్వం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇల్లు కట్టిస్తామని ప్రకటించింది.

ప్రకటించిన కోటి రూపాయల్లోనే ఇల్లు, కావాల్సిన కారు కొనిస్తామని చెప్పినా నేటికీ అతీగతీ లేదు. కొత్తగూడెంలో 420 చదరపు గజాలు స్థలం చూపించారు.. కానీ హద్దులు చూపలేదు, ఎటువంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదు. జిల్లా యంత్రాంగం కోటిరూపాయలకు సంబంధించిన అన్ని వివరాలు తయారు చేసి సర్కారుకు పంపించింది. కానీ ఆర్థిక శాఖలో ఆ ఫైల్​ ఆగిపోయింది. ఈ -కుబేర్​లో రెండేళ్లుగా ఈ ఫైల్​ మూలుగుతోంది. 

కనికరం చూపండి..

ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న. నాకు ఇస్తానన్న కోటిరూపాయల విషయంలో కనికరం చూపి ఆదుకోండి. ఆఫీసర్లను కలుస్తున్నం. వస్తయి అంటున్నరు. కానీ ఇప్పటికీ రాలే. 

- పద్మశ్రీ సకిని రామచంద్రయ్య