గ్రేటర్ గొప్పలన్నీగప్పాలే..మూలకు పడ్డ టీఆర్ఎస్ మేనిఫెస్టో హామీలు

గ్రేటర్ గొప్పలన్నీగప్పాలే..మూలకు పడ్డ టీఆర్ఎస్ మేనిఫెస్టో హామీలు
  • లక్ష బెడ్రూం ఇండ్లన్నరు.. వెయ్యి కూడా ఇయ్యలె
  • పేదలకు పట్టాలిస్తమన్నరు.. పక్కన పడేసిన్రు
  • అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ.. ఆగమాగంగా రోడ్ల రిపేర్లు
  • చినుకు పడితే చాలు నగర జీవికి నరకమే
  • స్కైవేల ముచ్చట్నే లేదు.. ఫ్లై ఓవర్లు అంతంత మాత్రమే

చినుకు పడితే చాలు చెరువులు, వాగుల్ని తలపించే రోడ్లు.. పొంగి పొర్లే  డ్రైనేజీలు.. మనుషుల్ని మింగే ఓపెన్‌ నాలాలు.. ఎటుచూసినా ట్రాఫిక్​ జామ్​లు.. నీట మునిగే కాలనీలు.. విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని టీఆర్​ఎస్​ చెప్పిన మన హైదరాబాద్​ పరిస్థితి ఇది. ఐదేండ్ల కిందట జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. మేనిఫెస్టోనే తమకు భగవద్గీత, ఖురాన్​, బైబిల్​ అని చెప్పింది. కానీ.. ఇప్పటికీ మేనిఫెస్టోలోని  80 శాతం హామీలు అమలుకు నోచుకోవడం లేదు. ఎక్కడి పనులు అక్కడే పెండింగ్​లో ఉన్నాయి. లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఇస్తామన్న గులాబీ లీడర్ల మాటలు నమ్మి ఉన్న ఇండ్లు ఖాళీ చేసిన పేదలు.. కిరాయి ఇండ్లల్లోనే ఉండాల్సి వస్తున్నది. ఇప్పుడు మళ్లీ జీహెచ్​ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో టీఆర్​ఎస్​ లీడర్లు హడావుడి చేస్తున్నారు. ఐదేండ్ల కింద ఇచ్చిన హామీలు ఎటుపోయాయని సిటీ జనం నిలదీస్తున్నారు.

హైదరాబాద్, వెలుగుదాదాపు ఐదేండ్ల కింద జరిగిన గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల్లో టీఆర్​ఎస్  64 హామీలను మేనిఫెస్టోలో చేర్చింది. అందులో  8 హామీలు మాత్రమే అమలవుతున్నాయి. మిగతా ​56 హామీలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ‘సురక్షిత, సుందర, పరిశుభ్ర’ నగరం దిశగా పయనిద్దామని పిలుపునిచ్చిన లీడర్లు ఆ విషయాన్ని మర్చిపోయారు.  గుంతలు పడ్డ రోడ్లు, తాగు నీటి సమస్య, పొల్యూషన్‌ ప్రాబ్లమ్‌.. ఇట్ల చుట్టుముట్టు సమస్యలతో నగరజీవి నరకం అనుభవిస్తున్నాడు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకే గ్రేటర్‌ పట్టం కడితే సిటీ సూపర్‌గా డెవలప్‌ అవుతుందని భావిస్తే  నిరాశే మిగిలింది. సిటీని విశ్వనగరంగా తీర్చిదిద్దుతారని నమ్మి ఓటేస్తే అధ్వాన్నమైన పరిస్థితుల్లో జీవనం సాగించాల్సి వస్తున్నదని జనం ఆవేదన చెందుతున్నారు. మేనిఫెస్టోలో టీఆర్​ఎస్​ ఇచ్చిన హామీలు ఏమిటి? అందులో అమలవుతున్నవి ఎన్ని..? అసంపూర్తిగా ఉన్నవి ఎన్ని..? నగరజీవి పరిస్థితి ఏంది?!

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పేదల కోసం లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కట్టిస్తామని టీఆర్‌ఎస్‌ తన మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా చేర్చింది. బస్తీ పేదలను కూడా ఆకర్శించింది ఈ హామీనే. సొంతిల్లు వస్తుందనే ఆశలో బస్తీల్లో గుడిసెలు, చిన్న చిన్న ఇండ్లల్లో ఉండేవాళ్లు వాటిని ఖాళీ చేసి కొన్ని చోట్ల ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పారు. కానీ వెయ్యి ఇండ్లు కూడా పేదలకు సర్కారు అందించలేదు. ఉన్న ఇంటిని ఖాళీ చేసి కిరాయికి ఉంటున్న పేదలు.. కిరాయి భారం భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ‘లక్ష ఇండ్ల సంగతేమైంద’ని ప్రశ్నించినప్పుడు.. మంత్రి తలసాని శ్రీనివాస్‌  యాదవ్​  ‘రెడీగా ఉన్నాయి. చూపిస్తా’మన్నారు. తర్వాత ఇద్దరు రెండు రోజుల పాటు గ్రేటర్‌లో తిరిగినా రెండున్నర వేలకు మించి ఇండ్లను మంత్రి చూపలేకపోయారు. ఇందులో ఇంకా నిర్మాణ దశలో ఉన్నవే ఎక్కువ. గ్రేటర్‌ వెలుపల కొన్ని ఇండ్లు నిర్మిస్తున్నామని అప్పుడు తలసాని చెప్పినా.. అవి ఇంకా పునాదుల దశలోనే ఉన్నాయి. వీరి పర్యటన సందర్భంగానే.. ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న పేదల కోపం కట్టలు తెంచుకుంది. పర్యటనకు వచ్చిన మంత్రి, ఆఫీసర్లను వాళ్లు నిలదీశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక సికింద్రాబాద్‌ లోక్​సభ నియోజకవర్గం పరిధిలోని ఐడీహెచ్‌ కాలనీలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చి వేసి 396 డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టించి లబ్ధిదారులకు ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వీటినే మోడల్‌గా చూపించి లక్ష ఇండ్లను ఇదే తీరులో నిర్మించి ఇస్తామని టీఆర్‌ఎస్‌  లీడర్లు చెప్పారు. ‘13 మురికివాడల్లో 17 ప్రదేశాల్లో ఇదే తరహాలో ఇండ్ల నిర్మాణం మెదలవుతుంది’ అని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.  ఆ ప్రాంతాలకు ఇటీవల కాంగ్రెస్‌ నేతలు వెళ్తే వారికి శిలాఫలకాలు కూడా కనిపించలేదు. కాగా, సిటీలోని 111 ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టామని సర్కారు చెబుతున్నా.. అక్కడక్కడా ఇప్పటి వరకు పది వేల ఇండ్లను మాత్రమే నిర్మించారు. ఇందులో రెడీ టు ఆక్యుపై స్టేటస్‌లో రెండు వేల ఇండ్లు మాత్రమే ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. మిగితావన్నీ ఎప్పటికి పూర్తవుతాయో, ఎప్పుడు పేదల చేతికి వస్తాయో అర్థం కాని పరిస్థితి. మళ్లీ గ్రేటర్‌ ఎన్నికలు వస్తున్నందున పేదల్లోని ఆగ్రహాన్ని ఇటీవలే చవి చూసిన మంత్రి తలసాని.. 99,369 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని,  వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు.

చినుకు పడితే వణుకే..

నాలుగు చినుకులు పడ్డాయంటే చాలు నగర జీవికి వణుకుపుడుతున్నది. ఉద్యోగాలకు వెళ్లిన వాళ్లు  ట్రాఫిక్​ జామ్‌లో ఇరుక్కుంటామని, కాలనీల్లో ఉన్నవాళ్లు సెల్లార్లు నీట మునుగుతాయని, బస్తీవాసులు ఇండ్లలోకి నీళ్లు వస్తాయని టెన్షన్‌ పడుతున్నారు. బయటకు వెళ్లిన వాళ్లు సురక్షితంగా ఇంటికి వస్తారో లేదోనని ఇంట్లో వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఏ నాలా మింగుతుందో, ఏ మ్యాన్‌హోల్‌ నోరు తెరుచుకొని ఉందోనని బుగులు పడే పరిస్థితి హైదరాబాద్​లో ఉంది. శుక్రవారం కురిసిన వర్షానికి ముషీరాబాద్‌‌లో అపార్ట్‌‌మెంట్‌‌ సెల్లార్‌‌లో చిక్కుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రెండు గంటల పాటు కురిసిన వానకు నగరం అతలాకుతలమైంది. రోడ్లు చెరువులను తలపించాయి. కాలనీలు, బస్తీలు నీట మునిగి ఇంకా వర్షపు నీటిలోనే జనం అవస్థలు పడుతున్నారు. 25 రోజుల కింద నేరెడ్​మెట్  పరిధిలో ఉప్పొంగిన నాలాలో చిన్నారి సుమేధ కొట్టుకుపోయి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత నాలుగైదురోజులకే సరూర్​నగర్​లో నాలా ఉధృతికి ఎలక్ట్రీషియన్​ నవీన్​కుమార్​ కొట్టుకుపోయి మృత్యువాతపడ్డాడు. జనం మృత్యువాతపడుతున్నా.. డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకునే దిక్కు లేదు. నాలాలు ఆధునీకరిస్తామని, మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని, వరద నీటి కాలువల నిర్మాణం చేపడతామని మేనిఫెస్టోలో టీఆర్​ఎస్​ హామీలు ఇచ్చింది. నగరంలోని మూడున్నర వేల కిలోమీటర్ల పొడుగున ఉన్న మురుగు నీటి వ్యవస్థను ఆధునీకరించి శివారు కాలనీల వరకు విస్తరిస్తామని చెప్పింది. గ్రేటర్‌లో 216 మేజర్‌ నాలాలు, 735 కిలో మీటర్ల మేర పైప్‌లైన్‌  డ్రెయిన్లు ఉన్నాయి. వీటి ఆధునీకరణకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. నాలాలపై చిన్నా చితకా కలిపి 12 వేల ఆక్రమణలున్నాయని జీహెచ్‌ఎంసీ గతంలో గుర్తించింది. 800 కిలోమీటర్ల పూడికతీత ఉందని, 390 మేజర్‌ నాలాలను విస్తరించాలని అప్పట్లో కమిటీ చెప్పింది. వీటిలో పది శాతం సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోలేదని ఆఫీసర్లే అంగీక రిస్తున్నారు. సిటీలో వాన పడితే 199 ప్రాంతాలు ముంపుకు గురవుతాయని ఈ మధ్యే పోలీసులు తేల్చారు.

రైలు మార్గాలు విస్తరించలె

హైదరాబాద్​లో మెరుగైన రోడ్ల నిర్మాణంతోపాటు మాస్ ట్రాన్స్ పోర్టు వ్యవస్థలను బలోపేతం చేసేలా కృషి చేస్తామని టీఆర్​ఎస్​ చెప్పింది. ఇందులో సిగ్నల్ వైట్ ట్యాపింగ్ రోడ్లు కలగానే మిగిలితే, పాడైన రోడ్ల తక్షణ రిపేర్ల బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించింది.  దీంతో కాంట్రాక్టర్లు, నిర్మాణ రంగ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందే తప్ప… జనాలకు మాత్రం మెరుగైన రోడ్లు దక్కడంలేదన్న విమర్శలు ఉన్నాయి. రూ. 20వేల కోట్లతో చేపట్టిన ఎస్ఆర్డీపీ స్కైవే, ఫ్లైఓవర్ల నిర్మాణం ఏండ్లు గడుస్తూ… నిర్మాణ వ్యయం పెరుగుతుందే తప్ప అందుబాటులోకి రావడంలేదు. ఇక సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు విస్తరణ ఇప్పటికీ ప్రతిపాదనలకే పరిమితమైపోగా.. గతేడాదిలో రాయదుర్గం వరకు మెట్రో సేవలను అందుబాటులోకి వచ్చాయి. 2013 నుంచి ఎదురుచూస్తున్న ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణ పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. దీన్ని పూర్తి చేస్తానని టీఆర్​ఎస్​ ఎన్నికల హామీల్లో చెప్పినా.. ఇంత వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇందులో ప్రధానమైన మౌలాలి–ఘట్ కేసర్‌, ఫలక్‌నుమా–ఉందానగర్‌–ఎయిర్‌పోర్టు, బొల్లారం–మేడ్చల్‌, సనత్‌నగర్‌–మౌలాలి, తెల్లాపూర్‌ –రామచంద్రాపురం, మౌలాలి–సీతాఫల్‌మండి వరకు దాదాపు 80 కిలోమీ టర్ల మేర ట్రాక్ ల నిర్మాణం జరగాల్సి  ఉంది.

నరకం చూపించే రోడ్లు..

హైదరాబాద్‌ సిటీలో ఎస్‌ఆర్‌డీపీ (స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌) ద్వారా రూ. 20 వేల కోట్లు ఖర్చు చేసి ట్రాఫిక్‌ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామనేది.. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఒకటి. సిటీ రోడ్ల మీదికి వచ్చిన వాళ్లెవరికైనా ఇది ఎంత వరకు ఆచరణ రూపం దాల్చిందో ఎదుర్కొనే ట్రాఫిక్‌ కష్టాలే స్పష్టం చేస్తాయి. రెగ్యులర్‌ ట్రాఫిక్‌ జామ్‌లతో పాటు వర్షం పడినప్పుడయ్యే ట్రాఫిక్​ జామ్‌లు నగర జీవికి నరకం చూపిస్తున్నాయి. వాన వెలిసిందంటే గుంతల రోడ్లతో నడుములు విరుగుతున్నాయి. అప్పుడప్పుడు రిపేర్లు చేపట్టినా అవి మెయిన్​ రోడ్లకే పరిమితమవుతున్నాయి. గ్రేటర్‌ పరిధిలోని రోడ్ల రిపేర్​కు ఏటా రూ. 500 కోట్లు ఖర్చు చేసినా, కొద్ది నెలల్లోనే మళ్లీ మొదటి పరిస్థితికి వస్తాయన్నది సిటీ రోడ్ల మీద ప్రయాణం చేసే ప్రతీ ఒక్కరికి ప్రత్యక్షానుభవం. తక్కువ నిర్వహణ, ఎక్కువ మన్నిక ఉన్న వైట్‌ట్యాప్‌ రోడ్లను వేస్తామని ఇచ్చిన హామీ ఒకటి రెండు ప్రాంతాల్లో తప్ప ఎక్కడా చేపట్టలేదు. రోడ్ల తక్షణ రిపేర్ల కోసం జీహెచ్ఎంసీ వందల కోట్లు ఖర్చు చేస్తుందని,  18 వందల కిలోమీటర్ల మేర రిపేర్లు  చేపడుతుందని మేనిఫెస్టో పేర్కొన్న మాట ఆచరణలో కనిపించడం లేదు.  మెయిన్​ రోడ్లు చూసినా..  గల్లీల్లోని రోడ్లు చూసినా.. గుంతలు, తవ్వకాలు, ఆక్రమణలతోనే కనిపిస్తున్నాయి.  రోడ్లపై ఉన్న గుంతల్లో పడి ప్రమాదానికి గురై మరణించిన వారెందరో ఉన్నారు. గ్రేటర్  హైదరాబాద్ పరిధిలో 9,103 కిలో మీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. ఇందులో 709 కిలోమీటర్లు మెయిన్​రోడ్లు. మిగిలినవి సర్వీసు, లింకు రోడ్లు.

పార్టీ వెబ్​సైట్​లో మేనిఫెస్టో గాయబ్​

గత జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 64 హామీలతో, 8 భాషల్లో స్పెషల్ మేనిఫెస్టోను టీఆర్​ఎస్​ విడుదల చేసింది. 2016 ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగగా.. 150 డివిజన్లలో 99 డివిజన్లను  గెలుచుకుంది. నాడు టీఆర్​ఎస్​ ఏ హామీలు ఇచ్చిందో చూద్దామని పార్టీ​ అధికారిక వెబ్‌సైట్‌  చెక్​ చేస్తే.. అందులో మేనిఫెస్టో  కనిపించలేదు. చివరికి ఎలక్షన్‌ కమిషన్‌  వెబ్‌సైట్‌లోనూ మాయమైంది. నాటి మేనిఫెస్టోలోని ఎన్ని హామీలు అమలయ్యాయో.. పెండింగ్​లో ఏమున్నాయోనని ‘వెలుగు’ పరిశీలించింది. నామమాత్రమైన హామీలు అమలవుతుండగా.. కొన్ని అరకొర పనులతో ఆగిపోయాయి. ఇంకొన్ని ఆచరణ రూపమే దాల్చలేదు.

 మూసీ ప్రక్షాళన పెండింగ్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామనే క్రమంలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రచారం చేసుకున్న ఎస్‌ఆర్‌డీపీలో ఐదు స్కైవేలు, 11 ప్రధాన కారిడార్లు, 60 ప్రధాన రోడ్లు, 50 గ్రిడ్‌ సెపరేటర్లతో మొత్తం రెండు వేల కిలోమీటర్ల నూతన రోడ్ల నిర్మాణం జరుగుతుందని టీఆర్​ఎస్​ హామీ ఇచ్చింది. ఈ పనుల్లో 80 శాతం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎల్‌బీనగర్‌, దుర్గం చెరువు బ్రిడ్జీలు తప్ప మిగతా వన్నీ మూలకుపడ్డాయి. బాలానగర్‌  ఫ్లై ఓవర్‌ ఎప్పుడు పూర్తవుతుందా అని చుట్టుపక్కల జనం ఏండ్ల తరబడి ఎదురుచూస్తూనే ఉన్నారు.  షేక్‌పేట, ఉప్పల్‌, ఖాజాగూడ ఎలివేటెడ్‌ కారిడార్‌, ఒవైసీ హాస్పిటల్‌ వద్ద జంక్షన్‌, అంబర్‌పేట ఫ్లైఓవర్‌, హైటెక్‌ సిటీ రైల్వే అండర్‌ పాస్‌లాంటివి ఏండ్ల తరబడి నిర్మాణంలో ఉండగా ఇంకా అనేక పనులు టెండర్ల ప్రాసెస్​లోనే  నిలిచిపోయాయి. 64 అంశాలతో భారీగా రూపొందించిన టీఆర్​ఎస్​ మేనిఫెస్టోలో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కూడా ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించేలా 25 అంతస్తులతో నిర్మిస్తున్న టవర్‌ను రెండేండ్లలో పూర్తి చేస్తామని 2015లో టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. రూ. 350 కోట్లతో టవర్‌ని పూర్తి చేస్తామని చెప్పినా దాని వ్యయం రూ. 550 కోట్లకు చేరినట్లు ఆఫీసర్లు అంటున్నారు. అయినా పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు.

హామీలన్నీ అసంపూర్ణం..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపిస్తే సిటీ ప్రజల దాహార్తి తీర్చేందుకు  కృష్ణా, గోదావరి నీళ్లను నిల్వ చేసుకునేలా రాచకొండ, శామీర్ పేట వద్ద రెండు డెడికేటెడ్ రిజర్వాయర్లను నిర్మిస్తామని ఐదేండ్ల కింద టీఆర్​ఎస్​ చెప్పింది.  కానీ వాటికి ఇంత వరకు శంకుస్థాపన జరగలేదు. రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కూడా కాలేదు. ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే అంశాల్లో సొంతిండ్లు, క్లీన్ అండ్ గ్రీన్ సిటీ, సేఫ్ డ్రింకింగ్ వాటర్, కంఫర్టబుల్ ట్రాన్స్ పోర్టు సిస్టం, హెల్త్​ వంటి అంశాలను మెరుగుపరుస్తామని టీఆర్ఎస్  హామీ ఇవ్వగా.. ఇప్పటివరకు మేనిఫెస్టోలోని హామీల్లో అమలవుతున్నయి ఎనిమిది మాత్రమే. ఇందులో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పేర్కొన్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్.. పింఛన్లు.. ఇంటింటికి నల్లా.. కరెంట్ బకాయిల రద్దు.. షీ టీమ్స్, షీ పోలీసు స్టేషన్ తదితర ఎనిమిది అంశాలు పోనూ మిగిలిన 56 హామీలన్నీ అసంపూర్ణంగానే ఉన్నాయి. త్వరలోనే గ్రేటర్ ఎన్నికల జరుగనున్నాయి. దీంతో గడిచిన పాలన కాలంలో ఇచ్చిన హామీలను కార్యరూపంలోకి తీసుకువచ్చామని ప్రచారం చేసుకునేందుకు ఇప్పుడు హడావుడిగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ప్రకటనలతో టీఆర్​ఎస్​ లీడర్లు ముందుకు వెళ్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

అమలు కానీ హామీల్లో ముఖ్యమైనవి

  • డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం
  • ప్రభుత్వ భూముల్లోనివాసం ఉన్న పేదలకు పట్టాలు
  • కేశవాపూర్ రిజర్వాయర్ పనులు
  • మెట్రో, ఎంఎంటీఎస్ మార్గాల విస్తరణ
  • ఆర్టీసీ బస్సుల కొనుగోలు
  • 5 స్కై వేలు, ఫ్లైఓవర్ల నిర్మాణం
  • సీవరేజీ మాస్టర్ ప్లాన్ ,తాగునీటి వసతులు
  • వైట్ ట్యాపింగ్,ట్రాఫిక్ రహిత మార్గాల నిర్మాణం
  • సోలార్ పవర్ వినియోగం
  • మోడ్రన్​ శ్మశాన వాటికలు,
  • మోడల్ మార్కెట్లు
  • సైక్లింగ్ ట్రాకులు,స్టేడియాలకు సౌలతులు
  • కొత్త లైబ్రరీలు,ఆడిటోరియంల నిర్మాణం
  • హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్
  • మూసీ ప్రక్షాళన