- రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుస్తం: చిన్నారెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలు 100 రోజుల కాంగ్రెస్ పాలనపై హ్యాపీగా ఉన్నారని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తోందని, రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం గాంధీ భవన్ లో ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ్ జోడో యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకు పోతోందని తెలిపారు.
వంద రోజుల రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారని వెల్లడించారు. వచ్చే పదేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు కృషి చేసి పార్టీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలుపించుకో వాలని చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తామని పార్టీలో చేరిన నేతలు పేర్కొన్నారు.
