బీజేపీ కుట్రలను తిప్పికొట్టటమే భారత్ జోడో యాత్ర ఉద్దేశం

బీజేపీ కుట్రలను తిప్పికొట్టటమే భారత్ జోడో యాత్ర ఉద్దేశం

నిన్న డిల్లీలో రాంలీలా మైదానంలో కాంగ్రెస్ మహా ర్యాలీ విజయవంతమైందని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. ఈ నెల 7 న రాహుల్ నేత్రత్వంలో 3590 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర ప్రారంభం అవుతుందన్న పవన్.. దేశ ప్రజలను ఏకం చేసేందుకు ఈ యాత్ర దోహదం చేస్తుందని తెలిపారు. మోడీ దేశ ప్రజల స్వప్నాన్ని చెదరకొట్టాడని, దేశ ప్రజలను మోడీ విడదీస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి బీజేపీ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చ గొడుతుందని పవన్ ఖేరా ఆరోపించారు. తినే తిండి, వేసుకునే బట్ట, పూజించే దేవుళ్ళ పేరుతో ప్రజల మధ్య గొడవలు పెడుతుందన్నారు. అనగారిన వర్గాలపై దాడులు పెరిగాయన్న ఆయన... రాజ్యాంగాన్ని బలహీన పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టటమే భారత్ జోడో యాత్ర ఉద్దేశమని పవన్ ఖేరా స్పష్టం చేశారు. 

15రోజుల పాటు రాహుల్ పాదయాత్ర

తెలంగాణలో అక్టోబర్ 24న రాహుల్ గాంధీ పాదయాత్ర ఎంటర్ అవుతుందని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ చెప్పారు. తెలంగాణ లోని మక్తల్ లో ఎంటర్ అయ్యి , జుక్కల్ లో ముగుస్తుందన్న బలరాం నాయక్... 4 పార్లమెంట్, 9 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఈ పాదయాత్ర సాగుతుందని తెలిపారు. 15 రోజుల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో ఉండబోతుందని.. 5 బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.