టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ వచ్చినా పెరిగిన వాహనాల క్యూ

టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ వచ్చినా  పెరిగిన వాహనాల క్యూ
  •  కొన్నిచోట్ల రెండే లైన్లు ఉండగా ఆలస్యం 
  •     లైన్లు పెంచాలంటున్న వాహనదారులు

హైదరాబాద్​, వెలుగు: ఓఆర్​ఆర్​పై టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ సిస్టమ్​వచ్చినా వాహనాలు బారులు తీరాల్సిన పరిస్థితి ఉంది. వాహనదారులకు అవగాహన కల్పించడంలో అధికారులు ఫెయిల్​అవుతున్నారు.   వాహనాల క్యూ ఉంటుండగా  సమయానికి చేరుకునేందుకు  ఓవర్​ స్పీడ్​తో వెళ్లాల్సి వస్తుందని, ఫాస్టాగ్ లైన్లు పెంచాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఓఆర్ఆర్ పై వెహికల్స్​ సంఖ్య పెరిగిపోవడం, ఫాస్టాగ్, క్యాష్ ఇలా 2 లైన్లు ఉన్నాయి. దీంతో ఒక్కో సందర్భంలో 20 నుంచి 30 వెహికల్స్  క్యూ కడుతున్నాయి. ఓఆర్ఆర్ పై రోజుకు 1.30 లక్షల వెహికల్స్ వెళ్తుంటాయి. ఏడాదికి రూ. 400 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. మొత్తం158 కి.మీ ఓఆర్ఆర్ పై 19 ఇంటర్‌‌‌‌ ఛేంజ్‌‌‌‌ల వద్ద టోల్‌‌‌‌ వసూలు చేస్తున్నారు. కొద్దిరోజుల్లో మరో రెండు ఇంటర్‌‌‌‌ ఛేంజ్‌‌‌‌లు అందుబాటులోకి కూడా రానున్నాయి. ఇటీవల టోల్ రేట్లు పెంపుపై దృష్టి పెట్టిన అధికారులు వాహనదారుల సమస్యలను మాత్రం పట్టించుకోవడంలేదు. దీనిపై  హెచ్ఎండీఏ అధికారులను అడిగితే ఇబ్బందులు లేవని చెప్పారు. అవసరమైతే  ఫాస్టాగ్ లైన్లను పెంచే విషయంపై ఆలోచిస్తామని పేర్కొన్నారు. 

కొన్నిచోట్ల మాత్రమే సాఫీగా..శంషాబాద్, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, 

రావిర్యాల, బొంగులూరు, పెద్ద అంబర్​ పేట్, తారామతిపేట్, ఘట్ కేసర్, కీసర, శామీర్​పేట్, కండ్లకోయ, సారెగూడెం, సుల్తాన్ పూర్, పటాన్​చెరువు, ఏదుల నాగులపల్లి, మేడ్చల్, గచ్చిబౌలి, టీఎస్ పీఏ, రాజేంద్రనగర్  ఏరియాల్లో ఔటర్​పై టోల్​ప్లాజాలు ఉన్నాయి. ఎక్కేచోట, దిగేచోట ఇరువైపులా ఇవి ఉండగా, ఎక్కువగా ఎగ్జిట్ల వద్దనే సమస్య వస్తోంది. పటాన్ చెరు, గచ్చిబౌలి లాంటి పెద్ద టోల్​ప్లాజాలతో పాటు చిన్న ఎగ్జిట్లలో కూడా ఒక్కోసారి లేట్​అవుతుంది. క్యాష్, ఫాస్టాగ్​ వేర్వేరు లైన్ల బోర్డులు ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదు. ఫాస్టాగ్ లైన్​లో వచ్చేవారికి ట్యాగ్ లేకపోయినా కూడా క్యాష్ తీసుకుంటున్నారు. దీంతో వెనకే ఉన్న వెహికల్స్​ ఆగాల్సి వస్తోంది. తక్కువ లైన్లు ఉన్న టీఎస్​పీఏ ఎగ్జిట్​టోల్ ప్లాజా వద్ద ఏ లైన్​లో వెళ్లిన కూడా అనుమతిస్తుండడంతో చాలా ఆలస్యమవుతోందని వాహనదారులు 
అంటున్నారు.

ఫాస్టాగ్ తీసుకొని ఏం లాభం 

కారుకి ఫాస్టాగ్​ తీసుకున్నా.  ఓఆర్ఆర్ పై ఫాస్టాగ్ ​లైన్లు సెపరేట్ ​అని నామ్​ కే వాస్తేగా ఉన్నాయి. ఒక్కోసారి 5 నుంచి 10 నిమిషాలు కూడా వెయిట్ ​చేయాల్సి వస్తోంది. ఫాస్టాగ్​ వేర్వేరు లైన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలె. 
- నాగుల విష్ణువర్ధన్, వాహనదారుడు

టోల్ ​ప్లాజా సిబ్బంది చెప్పట్లే..

ఫాస్టాగ్​పై వాహన దారులకు టోల్​ప్లాజా సిబ్బంది కూడా అవగాహన కల్పించడం లేదు. ఫాస్టాగ్​ లేని వెహికల్స్​కు చేసుకోవాలని కూడా చెప్పడం లేదు. ఫాస్టాగ్ లైన్లలో వస్తుండగా సమయం వృథా అవుతుంది.  ఏ లైన్​లో వెళ్లినా ఫాస్టాగ్ ​లేకున్నా,   బ్యాలెన్స్ ​లేకపోయినా మాన్యువల్ ​టికెట్​ఇస్తున్నారు. దీంతో  ఎక్కడ తక్కువ వెహికల్స్ ఉంటే దాంట్లోంచే వెళ్తున్నారు. ఫాస్టాగ్​ ఉన్న వారికి సెపరేట్ గా ఏర్పాటు చేస్తే  త్వరగా వెళ్లేందుకు వీలుంటుందని వాహనదారులు కోరుతున్నారు.