హైదరాబాద్ రియల్​ మార్కెట్​ విలవిల

హైదరాబాద్ రియల్​ మార్కెట్​ విలవిల

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్​ రియల్టీ మార్కెట్ పోయిన నెల బాగా నెమ్మదించింది. పోయిన సంవత్సరం జనవరి స్థాయిలో అమ్మకాలు జరగలేదు. సిటీతోపాటు, మేడ్చల్​–మల్కాజ్​గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి మార్కెట్లలో పోయిన నెల 4,872 కోట్ల విలువైన ఇండ్ల అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.2,494 కోట్లు. అయితే 2022 జనవరిలో 7,343 ఇండ్లు సేల్​ అయ్యాయి. అంటే వార్షికంగా అమ్మకాలు 34 శాతం తగ్గాయి. ఈసారి జనవరిలో రిజిస్టర్​ అయిన ఇండ్లలో 54 శాతం ఇండ్ల ధరలు రూ.25 లక్షలు–రూ.50 లక్షల మధ్య ఉన్నాయి. రియల్టీ కన్సల్టెన్సీ ఫర్మ్​ నైట్​ఫ్రాంక్​ఈ వివరాలను వెల్లడించింది. ఇది విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. రిజిస్టర్​ అయిన ఇండ్లలో 71 శాతం యూనిట్ల విస్తీర్ణం 1,000–2,000 చదరపు అడుగుల మధ్య ఉంది. మధ్య, ఉన్నతస్థాయి ధరల ఇండ్లకు డిమాండ్​ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రూ.50 లక్షలు అంతకంటే ఎక్కువ రేటు గల ఇండ్లకు గిరాకీ కొనసాగుతున్నది. ధరలు చాలా పెరగడం, నిర్మాణంలో ఉన్న ఇండ్ల రిజిస్ట్రేషన్లు పూర్తి కాకపోవడంతో పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈసారి రిజిస్ట్రేషన్ల సంఖ్య తక్కువగా ఉంది. పండుగలతోపాటు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఉన్నప్పుడు కస్టమర్లు ఫ్లాట్లు కొనడానికి ఎగబడుతున్నారు.

గడచిన కొన్ని నెలలుగా ధరల్లో చాలా పెరుగుదల కనిపించిందని నైట్​ఫ్రాంక్​ ఇండియా సీనియర్​ బ్రాంచ్​ డైరెక్టర్​ శామ్​సన్​ ఆర్థర్​ చెప్పారు. ఐటీ గ్రోత్​, ఇన్​ఫ్రా బాగుండటం వల్ల ఇక నుంచి కూడా హైదరాబాద్​ రెసిడెన్షియల్​ మార్కెట్​దూసుకుపోతుందని చెప్పారు.  రూ. 25 లక్షలు – రూ.50 లక్షల  ప్రైస్ బ్యాండ్‌‌‌‌లో రెసిడెన్షియల్ యూనిట్‌‌లలో రిజిస్ట్రేషన్‌‌లు 2023 జనవరిలో మొత్తం రిజిస్ట్రేషన్‌‌లలో 54శాతం ఉన్నాయి.  2022 జనవరిలో వీటి వాటా 39శాతం మాత్రమే ఉంది. రూ. 25 లక్షల కంటే తక్కువ టిక్కెట్-సైజు కలిగిన అమ్మకాలు వార్షికంగా 36శాతం నుంచి18శాతానికి తగ్గాయి.   రూ. 50 లక్షలు అంతకంటే ఎక్కువ టిక్కెట్ సైజులు  ఉన్న ఆస్తుల అమ్మకాలు 2022 జనవరిలో 25శాతం నుండి 2023 జనవరిలో 28శాతంకి పెరిగాయి. దీనిని బట్టి చూస్తే పెద్ద టిక్కెట్ సైజు ఇళ్లకు ఎక్కువ డిమాండ్ స్పష్టంగా ఉందని అర్థమవుతోందని నైట్​ఫ్రాంక్​ తెలిపింది. ఇక ముందు కూడా ఈ ట్రెండ్​ కొనసాగవచ్చని పేర్కొంది.