ఐపీఎల్​లో హయ్యెస్ట్​ రేటుతో సామ్​ కరన్​​ రికార్డు

ఐపీఎల్​లో హయ్యెస్ట్​ రేటుతో సామ్​ కరన్​​ రికార్డు
  • గ్రీన్​ కోసం రూ. 17.5  కోట్లు పెట్టిన ముంబై
  •  రూ. 16.25 కోట్లకు స్టోక్స్​ చెన్నైకి

రికార్డుల మోత మోగే ఐపీఎల్​ ఆక్షన్​ మరోసారి దద్దరిల్లిపోయింది..! సీనియర్, జూనియర్​ అన్న తేడా లేకుండా టాలెంట్​ ఉన్న  టీ20 హీరోలపై  ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపించాయి..!  ఈసారి కూడా ఆల్​​రౌండర్లకే  అత్యధిక ధరతో పట్టం కట్టాయి..! ముఖ్యంగా ఇంగ్లిష్​ ప్లేయర్లు సామ్​ కరన్​, బెన్​ స్టోక్స్​, హ్యారీ బ్రూక్​పై కోట్లు కుమ్మరించాయి..! ఆసీస్​ స్టార్​ కామెరాన్​ గ్రీన్, విండీస్​ హిట్టర్​ నికోలస్​ పూరన్​అ‘ధర’హో అనిపించగా.. ఊహించినట్టే  ఇండియా బ్యాటర్​ మయాంక్​ అగర్వాల్ మంచి రేటు పలికాడు. ఓవరాల్​గా పేరుకు మినీ ఆక్షనే​ అయినా..  మెగా లీగ్​ రికార్డులన్నీ బ్రేక్​ అయ్యాయి..!

కొచ్చి:

ఐపీఎల్ అసలు సమరానికి ముందు జరిగిన ‘కోట్లాట’లో.. ఇంగ్లండ్​ ఆల్​రౌండర్​ సామ్​ కరన్​ జాక్​పాట్​ కొట్టాడు. శుక్రవారం జరిగిన మినీ ఆక్షన్​లో  24 ఏండ్ల కరన్​ను రూ. 18.5 కోట్లకు పంజాబ్​ కింగ్స్​ సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్​ హిస్టరీలో హయ్యెస్ట్​ రేటు  పలికిన ప్లేయర్​గా అతను రికార్డు సృష్టించాడు.  23 ఏండ్ల  ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ కామెరూన్​ గ్రీన్​ కోసం ముంబై ఇండియన్స్​ రూ. 17.5 కోట్లు వెచ్చించింది. దాంతో, 2021లో సౌతాఫ్రికా ఆల్​రౌండర్​ క్రిస్​ మోరిస్​ కోసం రాజస్తాన్​ రాయల్స్ ఖర్చు చేసిన​ రూ. 16.25 కోట్ల రికార్డు  బ్రేక్​ రెండు సార్లు అయ్యింది. 2019లో పంజాబ్​ కరన్​ను  రూ. 7.20 కోట్లకు, 2020లో చెన్నై రూ. 5.50 కోట్లకు దక్కించుకుంది. కానీ ఈసారి ఆ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కరన్​ కోసం ముంబై ఇండియన్స్​, బెంగళూరు, రాజస్తాన్​ ​, చెన్నై , లక్నో​, పంజాబ్​ కింగ్స్​ హోరాహోరీగా పోటీపడ్డాయి. ఈ టీ20 వరల్డ్​కప్​ హీరో కోసం పంజాబ్​ లాస్ట్​ వరకు రేస్​లో నిలిచి తిరిగి తమ జట్టులోకి తీసుకుంది.  ఇంగ్లండ్​ టెస్ట్ ​కెప్టెన్, టాప్​ ఆల్​రౌండర్​ ​ బెన్​ స్టోక్స్​ రూ. 16.25 కోట్లకు చెన్నై సూపర్​కింగ్స్​ సొంతమయ్యాడు. ఇతని కోసం  హైదరాబాద్​, కోల్​కతా పోటీ పడ్డాయి.  విండీస్​ కీపర్​ నికోలస్​ పూరన్​ కోసం లక్నో సూపర్​జెయింట్స్​ రూ. 16 కోట్లు ఖర్చు చేసి ఆశ్చర్యపరిచింది. ఇండియన్​ యంగ్​స్టర్స్​ శివమ్​ మావి (రూ. 6 కోట్లు), ముకేశ్​ కుమార్​ (రూ. రూ. 5.5 కోట్లు) వరుసగా గుజరాత్, ఢిల్లీ క్యాపిటల్స్​​ సొంతం కాగా, జేసన్​ హోల్డర్​ను రూ. 5.75 కోట్లకు రాజస్తాన్​ దక్కించుకుంది. ఈ సీజన్​లో నలుగురు ప్లేయర్లు రూ. 15 కోట్ల కంటే ఎక్కువ పలకడం విశేషం.

కేన్​ కంటే లిటిల్​కే ఎక్కువ

గతం సీజన్​ వరకు హైదరాబాద్​ కెప్టెన్​గా పని చేసిన కేన్​ విలియమ్సన్​ను గుజరాత్​ టైటాన్స్​ రూ. 2 కోట్లకే దక్కించుకుంది. మిగతా ఫ్రాంచైజీలు కేన్​పై పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఐర్లాండ్​ ప్లేయర్​ జాషువా బ్రియాన్​ లిటిల్​ను గుజరాత్​ రూ. 4.4 కోట్లకు తీసుకోవడం విశేషం. కోనా శ్రీకర్​ భరత్​ను ఆ జట్టు రూ. 1.20 కోట్లకు కోనుగోలు చేసింది. స్టోక్స్​ కోసం పెద్ద మొత్తం ఖర్చు చేసిన సీఎస్​కే.. కైల్​ జెమీసన్​ను కోటికి, రహానెను రూ. 50 లక్షలకే సొంతం చేసుకుంది. సామ్​ కరన్​కు అత్యధిక ధర పెట్టిన ఫ్రాంచైజీలు అతని సోదరుడు టామ్​ కరన్​ను పట్టించుకోలేదు అలాగే, మొదట అమ్ముడుపోని షకీబ్ (బంగ్లాదేశ్​)ను కోల్​కతా రూ. 1.50 కోట్లకు, రిలీ రోసోవ్​ (సౌతాఫ్రికా)ను రూ. 4.60 కోట్లకు ఢిల్లీ దక్కించుకున్నాయి. 

తెలుగోళ్లకు చాన్స్

వేలంలో పలువురు తెలుగు రాష్ట్రాల ప్లేయర్లకు చాన్స్​ దక్కింది. కేఎస్​ భరత్ (రూ. 1.20 కోట్లు) గుజరాత్‌‌‌‌ టైటాన్స్‌‌కు సెలక్ట్‌‌ అయ్యాడు.  హైదరాబాద్​ స్పిన్​ ఆల్​ రౌండర్​ భగత్‌‌ వర్మ (రూ. 20 లక్షలు)ను చెన్నై మరోసారి కొనుగోలు చేయడంతో పాటు అండర్‌‌19 వరల్డ్‌‌ కప్‌‌ హీరో, ఏపీకి చెందిన షేక్‌‌ రషీద్‌‌ను (రూ.20 లక్షలు) కూడా తీసుకుంది. తెలుగు ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న సన్‌‌రైజర్స్‌‌ ఏపీకే చెందిన 19 ఏండ్ల  యువ కీపర్​ నితీశ్​ కుమార్​ రెడ్డిని (రూ. 20 లక్షలు)  తీసుకుంది.

బ్రూక్​ @ రూ. 13.25 కోట్లు

రూ. 42 కోట్ల పర్స్​తో ఆక్షన్​కు వచ్చిన సన్​రైజర్స్ హైదరాబాద్​​.. ‘ఇంగ్లండ్​ విరాట్​ కోహ్లీ’గా పేరుతెచ్చుకున్న 23 ఏండ్ల హ్యారీ బ్రూక్​ కోసం రూ. 13.25 కోట్లు వెచ్చించింది. రూ. 1.5 కోట్ల బేస్​ప్రైస్​తో వేలానికి వచ్చిన బ్రూక్​.. పాకిస్తాన్​తో టెస్ట్​ సిరీస్​లో వరుసగా మూడు సెంచరీలు చేయడంతో ఫ్రాంచైజీలు అతనిపై కన్నేశాయి. దీంతో రాజస్తాన్​ చివరి వరకు హైదరాబాద్​కు గట్టిపోటీ ఇచ్చింది.  కెప్టెన్​ మెటీరియల్​ అయిన మయాంక్​ అగర్వాల్​ను కూడా సన్​రైజర్స్​ రూ. 8.25 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్​ వరకు పంజాబ్​ కెప్టెన్​గా వ్యవహరించిన మయాంక్​కు ​రైజర్స్​ పగ్గాలు దక్కే చాన్సుంది.  హెన్రిచ్​ క్లాసెన్​ (రూ. 5.25 కోట్లు), వివ్రాంత్​ శర్మ (రూ. 2.60 కోట్లు), ఆదిల్​ రషీద్​ (రూ. 2 కోట్లు), మయాంక్​ డాగర్​ (రూ. 1.80 కోట్లు), అకీల్​ హుస్సేన్​ (రూ. 1 కోటి) కోసం కూడా  బాగానే ఖర్చు చేసింది. ఈ ఆక్షన్​లో మొత్తం 13 మంది ప్లేయర్లను ఎస్​ఆర్​హెచ్​ సొంతం చేసుకుంది. మయాంక్​ మార్కండే (రూ. 50 లక్షలు) సహా పలువురు యంగ్​స్టర్స్​ను తీసుకున్న రైజర్స్​ దగ్గర ఇంకా రూ. 6.55 కోట్లు ఉన్నాయి.

 80 వేలంలో అమ్ముడైన ప్లేయర్లు

 ఇందులో ఫారిన్‌ ప్లేయర్లు 29 మంది ఉన్నారు.

167 కోట్లు ఫ్రాంచైజీలు ఖర్చు చేసిన డబ్బు.
ఇంకా 39.5 కోట్లు మిగిలాయి.