ఫిబ్రవరిలోనూ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు డౌన్​

ఫిబ్రవరిలోనూ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు డౌన్​

హైదరాబాద్​, వెలుగు : హైదరాబాద్​లో రెసిడెన్షియల్​ ఇండ్ల రిజిస్ట్రేషన్లు కిందటి నెలలోనూ తగ్గిపోయాయి. ఫిబ్రవరి నెలలో రూ. 2,816 కోట్ల విలువైన 5,274 రెసిడెన్షియల్​ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు మాత్రమే చోటు చేసుకున్నాయి. అంతకు ముందు ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఇవి 3 శాతం పడిపోయినట్లు. రిజిస్ట్రేషన్​ రెవెన్యూ కూడా ఆ మేరకు స్వల్పంగా తగ్గిపోయినట్లు నైట్​ఫ్రాంక్ తన రిపోర్టులో వెల్లడించింది. హైదరాబాద్​, మేడ్చల్​–మల్కాజ్​గిరి, రంగా రెడ్డి, సంగారెడ్డి జిల్లాలను కలిపి హైదరాబాద్​ రెసిడెన్షియల్​ మార్కెట్​గా వ్యవహరిస్తారు. రూ. 50 లక్షలలోపు ఇండ్ల వాటా 51 శాతం

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రిజిస్ట్రేషన్లలో రూ.25 నుంచి రూ. 50 లక్షల మధ్య విలువున్న ఇండ్ల వాటా 51 శాతంగా రికార్డయినట్లు నైట్​ఫ్రాంక్​ రిపోర్టు తెలిపింది. రూ. 25 లక్షల లోపు ఇండ్ల రిజిస్ట్రేషన్ల వాటా 18 శాతం వద్ద నిలిచినట్లు పేర్కొంది. రూ. కోటి అంతకు మించిన విలువైన ఇండ్లకే ఎక్కువ డిమాండ్​ ఉందని స్పష్టం చేసింది. అదేవిధంగా 500 నుంచి వెయ్యి చదరపు అడుగుల ప్రాపర్టీల వాటా 18 శాతానికి పెరిగిందని, వెయ్యి నుంచి 2 వేల చదరపు అడుగుల ప్రాపర్టీలే బాగా ఎక్కువగా అమ్ముడవుతున్నాయని నైట్​ఫ్రాంక్​ వెల్లడించింది. మొత్తం రెసిడెన్షియల్​ ఇండ్లలో ఈ కేటగిరీ వాటా 68 శాతం వద్ద నిలిచిందని, కానీ అంతకు ముందు ఏడాది ఫిబ్రవరిలో ఈ వాటా 73 శాతమని పేర్కొంది.

జిల్లాల వారీగా చూస్తే మొత్తం రిజిస్ట్రేషన్లలో మేడ్చల్–మల్కాజ్​గిరి జిల్లా వాటా 43 శాతమైతే, 39 % వాటాతో రంగా రెడ్డి జిల్లా  ఆ తర్వాత ప్లేస్​లో నిలుస్తోంది. ఫిబ్రవరి 2023 లో జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్​ జిల్లా వాటా 15 శాతం. 

రేట్లు సంగారెడ్డిలో పెరిగాయ్...

వెయిటెడ్​ ఏవరేజ్​ ధరలను చూస్తే ఫిబ్రవరి 2023 లో 3 శాతం పెరిగాయి. సంగారెడ్డి జిల్లాలో ఈ  ధరలు బాగా ఎక్కువగా 9 శాతం పెరిగాయని నైట్​ఫ్రాంక్​ రిపోర్టు తెలిపింది. ​

వడ్డీ రేట్లు ఒకవైపు పెరుగుతున్నప్పటికీ హైదరాబాద్​ రెసిడెన్షియల్​ మార్కెట్​ నిలకడగానే కదులుతోంది. రూ. 25 లక్షలు నుంచి రూ. 50 లక్షల విలువైన రెసిడెన్షియల్​ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు హై వాల్యూ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు ఎక్కువయ్యాయి. దీనిని బట్టి చూస్తే హైదరాబాద్​ రెసిడెన్షియల్​ మార్కెట్​ ఆశాజనకంగానే ఉన్నట్లు. 

‑ శామ్​సన్​ ఆర్థర్​, సీనియర్​ బ్రాంచ్​ డైరెక్టర్​  నైట్ ​ఫ్రాంక్​  ఇండియా