ప్యాకేజీ కోసం గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల పడిగాపులు

ప్యాకేజీ కోసం గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల పడిగాపులు

మెరుగైన పరిహారాల కోసం గిరిజన నిర్వాసితుల ఆందోళన

గౌరవెల్లి ప్రాజెక్టు కమిటీతో చర్చలు విఫలం

సిద్దిపేట, వెలుగు : ‘భూములు, ఇల్లూవాకిలీ, చెట్టూపుట్టా అన్ని పొగొట్టుకున్నాం.. ప్రాజెక్టు ట్రయల్​రన్​కూడా చేశారు.. ఏండ్లకు ఏండ్లు గడుస్తున్నాయి..ఇప్పటికైనా మెరుగైన ప్యాకేజీ ఇవ్వండి’ అంటూ గౌరవెల్లి ప్రాజెక్టు కింద ముంపునకు గురైన 7 గిరిజన తండాల నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో 1.45 టీఎంసీల కెపాసిటీతో 2007లో గౌరవెల్లి ప్రాజెక్టు చేపట్టారు. గుడాటిపల్లి జీపీ పరిధిలో చెవులపల్లి, మద్దెలపల్లి,తెనుగులపల్లి,కొత్తపల్లి,సోమాజీతండాల్లో 1,835 ఎకరాల వ్యవసాయ భూములు, 687 ఇండ్లు ముంపుకు గురయ్యాయి. 2014లో ప్రాజెక్టు సామర్థ్యాన్ని 8.2 టీఎంసీలకు పెంచుతూ రీడిజైన్ చేసి, 3,870 ఎకరాల భూములను సేకరించాలని నిర్ణయించారు. దీనివల్ల గుడాటిపల్లి పంచాయతీ పరిధిలోని చింతల్ తండా, సోమాజీ తండా, సేవ్యానాయక్ తండా, బొంద్యా నాయక్ తండా, జాలుబాయి తండా, కపూర్ నాయక్ తండా, తిరుమల్ తండాలకు చెందిన గిరిజనుల భూములు ముంపుకు గురయ్యాయి. రీడిజైన్ తో మరో ఆరు తండాల రైతుల నుంచి రెండు వేల ఎకరాలను సేకరించారు. ఈభూములకు ఎకరానికి రూ. 6.95 లక్షల పరిహారాన్ని అందించారు. ఆ తండాల్లో సామాజిక సర్వే నిర్వహించి 166 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నట్టు అధికారులు గుర్తించినా ప్యాకేజీ అమలు చేయలేదు. మూడు నెలల కింద చింతల్ తండా, సోమాజీ తండాల్లో గ్రామ సభలు నిర్వహించారు. అధికారులు ప్రకటించిన ప్యాకేజీని తండావాసులు తిరస్కరించారు. గిరిజన నిర్వాసితులు అడిగిన పరిహారం ఎక్కువగా ఉందంటూ అధికారులు గ్రామసభ నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. 

చర్చలు విఫలం

గౌరవెల్లి ప్రాజక్టు గిరిజన నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు ఇటీవల కలెక్టరేట్​లో జరిగిన ప్రాజెక్టు కమిటీ సమావేశంలో ఎలాంటి ఫలితం తేలలేదు. జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సభ్యులు, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఎస్​బీఐ మేనేజర్, ఆర్డీఓ, గుడాటిపల్లి, కపూర్ నాయక్ తండా సర్పంచ్ లు సమావేశంలో పాల్గొన్నారు. ఒక్కో కుటుంబానికి రూ. 12.5 లక్షలు, ఒక ప్లాట్, చట్టప్రకారం ఇతర సదుపాయాలు కల్పిస్తామని, అంతకు మించి ఇచ్చేది లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ముంపు గ్రామాల సర్పంచులు, నిర్వాసితుల ప్రతినిధులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. ప్రాజెక్టు ట్రయల్ రన్ చేసిన ప్రభుత్వం కాలువల నిర్మాణానికి రూ. 200 కోట్లు మంజూరు చేసినా.. నిర్వాసితుల సమస్య మాత్రం కొలిక్కి రాలేదు. 

ఇవీ డిమాండ్లు ..

సర్వం కోల్పోతున్న తమకు మంచి ప్యాకేజీ ఇవ్వాలని గిరిజన నిర్వాసితులు  అడుగుతున్నారు. తక్కువ రేటుకే వ్యవసాయభూములను ప్రభుత్వానికి ఇచ్చామని.. తమకు బతుకుదెరువుకు తగ్గట్టు ప్యాకేజీ ఇవ్వాలని 166 కుటుంబాలు కోరుతున్నాయి. 2013 చట్టం ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షలు, 250 గజాల స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు,18 ఏండ్లు నిండిన యువతీయువకులకు పరిహారం ఇవ్వాలని వారు అంటున్నారు. తండాల్లో మిగులు భూములకు పట్టాలు ఇచ్చి.. విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని, ప్రాజెక్టులో చేపలు వేటాడే హక్కులు కల్పించాలని కోరుతున్నారు.

ఇప్పటికైనా న్యాయం చేయాలి

జెక్టు కింద సర్వం కోల్పోతున్న గిరిజన తండాల నిర్వాసితులకు ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయం చేయాలి. విలువైన భూములను తక్కువ ధరకే ప్రభుత్వానికి అప్పగించాం. కొద్ది కుటుంబాలకు మెరుగైన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నాం. ప్రాజెక్టు కమిటీ సమావేశంలో ఇదే కోరినా అధికారుల నుంచి సరైన స్పందన రాలేదు. 
-  బానోతు సంతోష్​ నాయక్, సర్పంచ్, కపూర్ నాయక్ తండా

మానవతా థృక్పథంతో వ్యవహరించాలి

గౌరవెల్లి నిర్వాసితుల పట్ల ప్రభుత్వం మానవతా థృక్పథంతో వ్యవహరించాలి. చట్టం ప్రకారమే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నాం. ఇదే విషయాన్ని అన్ని సందర్భాల్లో అధికారుల దృష్టికి తెచ్చాం. ట్రయల్ రన్ నిర్వహించిన ప్రభుత్వం వెంటనే నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలి.  
- ఎం.రాజిరెడ్డి, సర్పంచ్ గుడాటిపల్లి