ఏపీలో 24 మంది మంత్రుల రాజీనామా

 ఏపీలో 24 మంది మంత్రుల రాజీనామా
  • కేబినెట్ భేటీ అనంతరం రాజీనామాలు సీఎం జగన్ కు అందజేసిన మంత్రులు

అమరావతి: ఏపీ మంత్రివర్గంలోని మొత్తం 24మంది సభ్యులు రాజీనామా చేశారు. గురువారం సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన చివరి కేబినెట్ భేటీ అనంతరం మంత్రివర్గ సభ్యులు రాజీనామా చేశారు. వారంతా తమ రాజీనామా లేఖలను సీఎంకు అందజేయగా.. వాటిని గవర్నర్కు పంపనున్నారు. ఈనెల 11న ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది.  ఈక్రమంలో బుధవారం సీఎం జగన్ గవర్నర్ను కలసి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై చర్చించారు. 

మంత్రివర్గ భేటీలో 36 అంశాలపై చర్చ
సచివాలయంలో ప్రస్తుత మంత్రివర్గం చివరి సమావేశంలో 36 అంశాలపై చర్చించారు. మిల్లెట్‌ మిషన్‌ పాలసీ, డిగ్రీ కళాశాలల్లో 574 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీ వంటి తదితర ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటితో పాటు పులివెందులను కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఓకే చెప్పింది.

అనుభవాన్ని పార్టీ బలోపేతానికి ఉపయోగించండి: జగన్
మంత్రుల రాజీనామా అనంతరం వారినుద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. నేతల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తొలి విడత అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. రాజీనామా చేసిన వారంతా ఇకపై పార్టీ బాధ్యతల్లోకి వెళ్తారని.. నేతలు తమ అనుభవాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించాలని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. 

నాకు నాలుగు కొమ్ములు లేవు: కొడాలి నాని
మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తనకేం నాలుగు కొమ్ములులేవని వ్యాఖ్యలు చేశారు. అంద‌రి మాదిరిగానే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశాన‌ని..మంత్రివ‌ర్గ పున‌ర్ వ్యవస్థీక‌ర‌ణ‌లో భాగంగా ప్రస్తుతం రాజీనామా చేశానన్నారు. అయితే కొంద‌రికి స్థానం ఉంటుంద‌ని చెప్పిన నానికి మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. కొడాలి నానికి కొత్త మంత్రివ‌ర్గంలో స్థాన‌ముంటుందా?  అన్న ప్రశ్నపై స్పందించిన ఆయన.. కొడాలి నానికి నాలుగు కొమ్ములేమీ లేవని జవాబిచ్చారు. కొత్త కేబినెట్ లో తనకు స్థానం దక్కకపోవచ్చని అన్నారు. 

 

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యే పెట్రోల్ బంక్ కూల్చివేత

గవర్నర్ ప్రోటోకాల్ పై కేంద్ర హోంశాఖ సీరియస్..?

తమిళిసైకి కాదు.. రాజ్ భవన్కు అవమానం

రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అమిత్ షా, మోడీ అసంతృప్తి