అసెంబ్లీ స్టార్టయితే రీసౌండ్ వస్తది

అసెంబ్లీ స్టార్టయితే రీసౌండ్ వస్తది

దుబ్బాక రిజల్ట్​తో టీఆర్‌‌ఎస్‌‌ మైండ్ బ్లాకైంది

మామా, అల్లుళ్ల మెడలు వంచైనా నిధులు తెస్త

మీట్ ది ప్రెస్​లో ఎమ్మెల్యే రఘునందన్​రావు

నల్లకోటుతో కేసీఆర్​ను ఎక్కడకు పంపాలో తెలుసని కామెంట్

హైదరాబాద్, వెలుగు: ‘దుబ్బాక రిజల్ట్​తో టీఆర్ ఎస్ మైండ్ బ్లాక్ అయింది. అసెంబ్లీ స్టార్ట్ అయితే రీసౌండ్ వస్తది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నోరు లేదు కాబట్టి నిధులు తెచ్చుకోలేదు. మామా, అల్లుళ్ల మెడలు వంచైనా దుబ్బాకకు నిధులు తెస్తా. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలకు ధీటుగా మూడేళ్లలో అభివృద్ధి చేస్తా. సీడీఎఫ్​ నిధులివ్వకపోతే కేంద్రం నుంచి తీసుకొస్తా’నని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రఘునందన్​రావు చెప్పారు. సోమవారం గచ్చిబౌలిలోని ఓ హోటల్ లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు కప్పర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్​లో రఘనందన్ పాల్గొని మాట్లాడారు.

కార్యకర్తకు ఇబ్బంది అంటే అర్ధరాత్రైనా వెళ్తా

‘దుబ్బాకకు వచ్చిన బస్సులు సిద్దిపేటకు తరలించారు. టికెట్ మీద సర్ చార్జ్ రూ. 45 లక్షలకు పైగా వస్తే రూ. 20 లక్షలు కూడా ఖర్చు చేయలేదు. నియోజకవర్గంలోని 150కి పైగా ఊర్లుకు బస్సు సౌకర్యం కల్పిస్తా. దుబ్బాక బస్టాండ్​ముందు సెల్ఫీలు దిగేలా అభివృద్ధి చేస్తా’నని రఘునందన్​చెప్పారు. ‘చేనేత అభివృద్ధికి దుబ్బాకకు కేంద్రం రూ.2.5 కోట్లిస్తే గజ్వేల్, సిద్ధిపేటలకు రూ. 2 కోట్లు మళ్లించారు. దుబ్బాకకు రూ. 50 లక్షలు ఇచ్చారు’ అన్నారు. దుబ్బాకలో బీజేపీ వల్లే గెలిచానని చెప్పారు. ‘ప్రాణం ఉన్నంత వరకూ పార్టీలోనే ఉంటా. సుబ్రమణ్యస్వామిలా కేసులు వాదిస్తా’నని చెప్పారు. ఉప ఎన్నికల్లో ఎంతో మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులపై కేసులు నమోదు చేశారని.. అన్నింటిని ఎదుర్కొంటామని, గెలుస్తామని రఘునందన్​ చెప్పారు. ‘పదవి శాశ్వతం కాదు. కార్యకర్తలు ఇబ్బంది అంటే ఏ అర్ధరాత్రయినా వెళ్తా’నన్నారు.

దుబ్బాక ఎఫెక్ట్​ గ్రేటర్​లో ఉంటది

బీజేపీ జాతీయ నాయకత్వం గ్రేటర్ ఎన్నికలను సీరియస్‌‌‌‌గా తీసుకుందని, పార్టీ దగ్గర ప్రత్యేక ప్రణాళికలున్నాయని రఘునందన్ ​చెప్పారు. ‘దుబ్బాక గెలుపు ఎఫెక్ట్ గ్రేటర్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుంది. త్వరలో డివిజన్లలో పాదయాత్ర స్టార్ట్ చేస్తా. ఎంఐఎంను మేయర్‌‌‌‌ పీఠంపై కూర్చోబెట్టడానికి కేసీఆర్‌‌‌‌ కుట్ర చేస్తున్నారు. గ్రేటర్ జనం హైదరాబాద్‌‌‌‌ను బెంగాల్, కోల్‌‌కతాగా మార్చొద్దు. ఓల్డ్ సిటీలో ట్యాక్స్​లు చాలా తక్కువ వసూలు అవుతున్నయి. కానీ నిధులు మాత్రం చాలా ఇస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేటీఆర్ కండ్లు కిందకు దిగుతాయి. నల్లకోటుతో కేసీఆర్​ను ఎక్కడికి పంపాలో తెలుసు’ అన్నారు.

వరద సాయాన్ని ఓట్ల స్కీమ్​ చేసిన్రు

జీహెచ్ ఎంసీలో వరద సాయం పంపిణీని ఓట్ల స్కీమ్​గా మార్చారని రఘునందన్ అన్నారు. ‘రూ. 2 లక్షలకు మించి డ్రా చేసే అధికారం ఎవరికి లేదు. అలాంటిది జోనల్ కమిషనర్లు రూ. 50 లక్షలు డ్రా చేశారు. వాళ్లను కోర్టు బోనులో నిలబెడతా. ఆన్ లైన్ ద్వారా లబ్ధిదారులకు డబ్బులెందుకు ఇయ్యలే? ఇంత నగదు డ్రా చేయడానికి బ్యాంకు అధికారులు ఎలా అనుమతిచ్చారు’ అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్, మిడ్ మానేరు కాంట్రాక్టుల పైసలే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాని చెప్పారు. ‘రాష్ట్రంలో కేటీఆర్ కన్నా అద్భుతంగా మాట్లాడే, టాలెంట్ ఉన్న రెండో క్యాడర్ నేతలున్నారు. అవకాశాలు రాక బయటకు రాలేరు. మాతో చేతులు కలపండి’ అన్నారు.

Read more news…

స్కూల్ పోటీల్లో ఓడింది.. ఇప్పుడు ఒలింపిక్స్ నే టార్గెట్ చేసింది

బరువు తగ్గడం.. కష్టమేం కాదు