టాన్స్ఫర్ లిస్టును కేటీఆర్, హరీశ్​రావు, ప్రశాంత్​రెడ్డికి అప్పగించిన సీఎం

టాన్స్ఫర్ లిస్టును  కేటీఆర్, హరీశ్​రావు, ప్రశాంత్​రెడ్డికి అప్పగించిన సీఎం
  •     సీఎస్ , సీఎంవో ప్రిన్సిపల్​సెక్రటరీ తయారు చేసిన లిస్ట్ పక్కకి 
  •     కొత్త లిస్ట్​రెడీ చేస్తున్న ఆ ముగ్గురు మంత్రులు
  •     తమకు అనుకూలంగా పనిచేసే వారికే కలెక్టర్​ పోస్టింగ్​లు

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్రంలో ఐఏఎస్​ఆఫీసర్ల ట్రాన్స్​ఫర్ల బాధ్యత సీఎస్​, సీఎంవో నుంచి మంత్రుల చేతుల్లోకి వెళ్లింది. ఎలక్షన్​ఇయర్​ కావడంతో తమకు అనుకూలంగా పనిచేసే ఆఫీసర్లకే కలెక్టర్​పోస్టింగ్​లు ఇవ్వడంతో పాటు.. సెక్రటేరియెట్​హెచ్​వోడీ పోస్టులు కట్టబెట్టే ప్లాన్​చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే సీఎస్​ సోమేశ్​కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ రెడీ చేసిన లిస్ట్ ను పక్కన పెట్టి.. మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు, ప్రశాంత్​రెడ్డికి ఆ టాస్క్​ను సీఎం కేసీఆర్​అప్పగించినట్లు తెలిసింది. ఈ కారణంగానే 10 రోజుల నుంచి ఊరిస్తున్న  ఐఏఎస్​ల ట్రాన్స్​ఫర్లు ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ముగ్గురు మంత్రులు ఏ ఐఏఎస్​ఎక్కడ ఉండాలనేదానిపై కసరత్తు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన కొందరు ఐఏఎస్​లు వారిని  కలుస్తూ తమకు ఫలానా చోట పోస్టింగ్​ఇవ్వాలని రిక్వెస్ట్​లు పెట్టుకుంటున్నారు. బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్​సదస్సు నిర్వహించనున్నట్లు తెలిసింది.

ఇప్పుడిస్తేనే అప్పటికి ఇబ్బంది ఉండదని

షెడ్యూల్​ ప్రకారం అయితే రాబోయే సంవత్సరంలో నవంబర్​ లేదా డిసెంబర్​లో జనరల్​ఎలక్షన్స్​ జరగాలి. అయితే, అంతకు ముందే రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. టీఆర్​ఎస్​ ప్రభుత్వం ముందస్తు హడావుడి నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్​ల ట్రాన్స్​ఫర్లు తెరపైకి వచ్చాయి. జిల్లాల్లో కొంతమంది కలెక్టర్ల పదవీకాలం మూడేండ్లు దాటిపోయింది. కొంతమంది ఐఏఎస్​లు పోస్టింగ్​లు లేకుండా వెయిటింగ్​లో ఉన్నారు. ఒకవేళ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లాల్సివస్తే.. అంతకంటే మునుపే ఐఏఎస్​ల బదిలీలు పూర్తి చేసుకుంటే ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో ఈసీ నిబంధనల ప్రకారం ఎలక్షన్స్​ జరిగే కంటే ముందు జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న వాళ్లు మూడేండ్లకు మించకూడదు. దీంతో ఐఏఎస్​ ఆఫీసర్ల బదిలీలు సర్కార్​కు తప్పనిసరి అయిపోయింది. హైదరాబాద్​, మెదక్​ జిల్లాలకు పూర్తి స్థాయి కలెక్టర్​ లేరు. సీఎస్​తో సహా మరో నలురుగు ఐఏఎస్​ ఆఫీసర్లు  రెండు, మూడు  డిపార్ట్​మెంట్లకు ఒక్కరే ఇన్​చార్జ్​ బాధ్యతలు చూస్తున్నారు. 

తెలంగాణ ఐఏఎస్​లకు ప్రియారిటీ దక్కేనా

రాష్ట్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రాంత ఐఏఎస్​లు సీనియర్లుగా ఉన్నా.. వారిని లూప్​లైన్​కే పరిమితం చేస్తున్నారు. ఏండ్ల తరబడి అలాగే కొనసాగిస్తున్నారు. ఈసారైనా మంచి పోస్టులు వస్తాయేమోనని ఆశిస్తున్నారు. సీఎంవోలో ఒక్క దళిత ఐఏఎస్​ ఉన్నారా? అని అప్పట్లో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ప్రశ్నించడంతో.. ప్రభుత్వం రాహుల్​ బొజ్జాను సీఎంవోలోకి తీసుకుంది. బుర్రా వెంకటేశం లాంటి సీనియర్​ ఐఏఎస్​ను నిధులు ఇవ్వకుండా బీసీ వెల్ఫేర్​కు పరిమితం చేసింది. ఆకునూరి మురళీ ముందస్తుగానే వీఆర్​ఎస్​ తీసుకున్నారు. కిషన్​ లాంటి ఐఏఎస్​లు నామ్​కే వాస్తేగా ఉన్న పోస్టుల్లోనే రిటైర్​అవుతున్నారు. 

రెడీ అయిన లిస్ట్​ పక్కన పెట్టిన్రు

భారీగా ఐఏఎస్​ల ట్రాన్స్​ఫర్లు అని గత నెల 20వ తేదీ నుంచే చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారులు చెప్పిన దాని ప్రకారం నవంబర్​25వ తేదీనే సెక్రటేరియెట్​లో బదిలీల జీవోలు రావాల్సి ఉంది.  సీఎస్​, సీఎం ప్రిన్సిపల్​సెక్రటరీ కలిసి ఎవరెవరికి ఎక్కడెక్కడ పోస్టింగ్​లు ఇవ్వాలనే దానిపై దాదాపు వారంపాటు కసరత్తు చేసి సీఎం కేసీఆర్​కు లిస్ట్ ను అందజేశారు. ఇక ఆర్డర్లు రావడమే తరువాయి అనుకున్నారు. కానీ, సీఎం కేసీఆర్​ఆ లిస్ట్ ను పక్కన పెట్టి.. ముగ్గురు మంత్రులకు ఆ బాధ్యతను అప్పగించి ఎవరికి ఎక్కడ పోస్టింగ్​ఇవ్వాలనే దానిపై లిస్ట్​ ఇవ్వాలని ఆదేశించినట్లు  తెలిసింది. దీంతో మంత్రులు.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర మంత్రులతో సమన్వయం చేసుకుని వారికి అనుకూలమైన వాళ్లకు పోస్టింగ్​లు ఇచ్చేలా లిస్ట్ తయారు చేస్తున్నారు. ప్రగతి భవన్​లోనే కేటీఆర్, హరీశ్​రావు, ప్రశాంత్​ రెడ్డి ఐఏఎస్​ల ట్రాన్స్​ఫర్లు, పోస్టింగ్​లపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.