
ఇంకా మూడొంతుల మందికి టెన్త్ రీవాల్యుయేషన్ రిజల్ట్ రాలే!
అప్లై చేసి నెలన్నర అయిపాయే
విద్యార్థులకు తప్పని ఎదురుచూపులు
మరో వారంలో పూర్తి చేస్తామన్న అధికారులు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు త్వరలో విడుదల కానున్నా.. పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఫలితాలు మాత్రం ఇప్పటికీ పూర్తిస్థాయిలో రాలేదు. దీంతో ఫీజు కట్టిన వేలాది మందికి ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రంలో మే10న టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. మొత్తం 4,84,370 మంది రెగ్యులర్ స్టూడెంట్లకు గాను 4,19,460 మంది పాసయ్యారు. తర్వాత15 రోజుల్లోపు ఒక్కో సబ్జెక్టుకు రీకౌంటింగ్ కు రూ.500తో, రీవెరిఫికేషన్‌కు రూ.వెయ్యి ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో12 వేలకు పైగా విద్యార్థులు, 22 వేలకు పైగా సబ్జెక్టుల కోసం ఫీజు కట్టారు. అయితే, సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యేలోపే రిజల్ట్ ఇస్తారని అంతా భావించారు. కానీ, జూన్14 నుంచి 22 వరకూ టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయినా, ఇంకా రీవాల్యుయేషన్ ఫలితాలు మాత్రం పూర్తిస్థాయిలో రాలేదు.
దరఖాస్తు చేసుకున్నవారిలో మూడోవంతు స్టూడెంట్లకు రిజల్ట్ రాలేదని తెలుస్తోంది. మరోపక్క అడ్వాన్స్ డ్ ఎగ్జామ్స్ రిజల్ట్ కూడా మరోవారంలో ఇవ్వనున్నారు. అయినా, ఫీజు చెల్లించి సుమారు నెలన్నర దాటినా, ఇంకా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ రిజల్ట్ ఇవ్వకపోవడం ఏంటనీ పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. వేలాది మంది సర్కారు టీచర్లున్న స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్.. రీవెరిఫికేషన్ ఫలితాలను కనీసం నెలరోజుల్లోపు అయినా ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు. కేవలం12 వేల మంది రిజల్ట్ కోసం 2 నెలల టైం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావును వివరణ కోరగా.. ఇప్పటికే చాలామంది విద్యార్థుల ఫలితాలను పంపించామని, మరోవారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.