కరోనాకు మరో ఇన్ఫెక్షన్ తోడైతే రిస్క్‌ ఎక్కువ

కరోనాకు మరో ఇన్ఫెక్షన్ తోడైతే రిస్క్‌ ఎక్కువ
  • ఇలాంటి కేసుల్లో 56 శాతం మృతి
  • ఐసీఎంఆర్ తాజా స్టడీలో వెల్లడి
  • 10 హాస్పిటళ్లలో 17 వేల మందిపై స్టడీ​
  • దేశంలో కొత్తగా 1.86 లక్షల కేసులు.. 3,660 మరణాలు

న్యూఢిల్లీ: కరోనా సోకిన టైమ్​లో మరో ఇన్ఫెక్షన్ సోకితే మరణించే ప్రమాదం ఎక్కువని ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రీసెర్చ్​(ఐసీఎంఆర్) వెల్లడించింది. కరోనాతో సెకండరీ ఇన్ఫెక్షన్​ సోకిన వాళ్లలో సగం మంది మరణిస్తున్నారంది. కరోనా మరణాల రేటుతో పోలిస్తే ఇవి ఎక్కువున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది జూన్​ నుంచి ఆగస్టు మధ్య కరోనా రోగులపై స్టడీ చేయగా ఈ వివరాలు వెల్లడయ్యాయని చెప్పింది. పది ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్​మెంట్​ పొందుతున్న 17,534 మందిపై స్టడీ చేశామని.. వైరస్​ నుంచి కోలుకుంటున్న సమయంలో ఇందులో 3.6% మంది సెకండరీ ఇన్ఫెక్షన్ (బ్యాక్టీరియా లేదా ఫంగస్) బారినపడ్డారని ఐసీఎంఆర్​ చెప్పింది. వీళ్లలో 56.7 % మంది చనిపోగా మిగిలిన వారు కోలుకున్నారని తెలిపింది.

రక్తం, శ్వాసకోస సమస్యలే ఎక్కువ
సెకండరీ ఇన్ఫెక్షన్‌‌‌‌‌‌‌‌  బారిన పడుతున్న కరోనా పేషెంట్స్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువగా రక్త, శ్వాసకోస సమస్యలు వస్తున్నాయని ఐసీఎంఆర్​ చెప్పింది. పేషెంట్లలో డ్రగ్​ రెసిస్టెన్స్​వల్ల రెండో రోగం బారిన పడుతున్నారంది. కరోనా బాధితులకు విపరీతంగా యాంటీ బయోటిక్స్ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. దీని వల్ల వాళ్ల ప్రాణాలను కాపాడటంతో పాటు సెకండరీ ఇన్ఫెక్షన్లు సోకకుండా చేయొచ్చని వివరించింది. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యాక కూడా కరోనా  రోగులు సెకండరీ ఇన్ఫెక్షన్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని చెప్పింది.

మరణాల రేటు 1.15 శాతం
దేశంలో గత 24 గంటల్లో 3,660 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇందులో మహారాష్ట్రలో 884, కర్నాటకలో 476, తమిళనాడులో 474, ఉత్తరప్రదేశ్​లో 187, కేరళలో 181 మంది మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,18,895కు చేరుకుంది. మరణాల రేటు 1.15 శాతంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు బాగా తగ్గాయి. గత 24 గంటల్లో 1,072 కేసులు నమోదయ్యాయి. అక్కడ ఇప్పటివరకు153 బ్లాక్​ ఫంగస్​ కేసులు రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 33,90,39,861 టెస్టులు చేశారు. 20.57 కోట్ల మందికి వ్యాక్సిన్​ వేశారు. అమెరికా తర్వాత 20 కోట్ల మందికి వ్యాక్సిన్​ వేసిన రెండో దేశంగా ఇండియా నిలిచింది.  

దేశంలో తగ్గుతున్న కేసులు
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. అనేక రాష్ట్రాలు లాక్​డౌన్ పెట్టడంతో వైరస్​వ్యాప్తి అదుపులోకి వస్తోంది. తాజాగా 20,70,508 టెస్టులు చేయగా 1,86,364 మందికి వైరస్​ సోకినట్టు తేలింది. గత 44 రోజుల్లో ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారని కేంద్రం చెప్పింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు 2.75 కోట్లకు చేరుకున్నాయని వెల్లడించింది. రోజురోజుకు యాక్టివ్​ కేసులు తగ్గుతూ రికవరీ రేటు పెరుగుతోందని.. గత 15 రోజులుగా కొత్త కేసుల కన్నా రికవరీలు ఎక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 2,59,459 మంది వైరస్​ నుంచి కోలుకున్నారని.. రికవరీ రేటు 90.01 శాతానికి చేరుకుందని చెప్పింది. మొత్తంగా 2.48 కోట్ల మందికి పైగా వైరస్‌‌‌‌‌‌‌‌ను జయించారంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23,43,152 యాక్టివ్​ కేసులున్నాయని తెలిపింది.