హైదరాబాద్, వెలుగు: దేశ అభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్లకు ప్రాధాన్యం పెరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొత్తగా వచ్చిన పన్నుల నిబంధనలు, జీఎస్టీ వంటి పన్నుల వ్యవస్థలతో వారి పాత్ర, పరిధి వేగంగా పెరుగుతున్నదని చెప్పారు. ఆదాయాలు, వ్యాపారాలు పెరుగుతున్నకొద్దీ పన్నుల చెల్లింపుల్లో పారదర్శకత పెరుగుతుందని, దాంతో పాటు అధునాతన టెక్నాలజీ వంటి అనేక అంశాలతో సీఏల అవసరం మరింత పెరిగిందన్నారు.
శనివారం హైదరాబాద్ లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) క్యాంపస్ లో జరిగిన కాన్వొకేషన్ కార్యక్రమంలో పట్టాలు అందుకున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం స్టార్టప్‌ల సంఖ్య భారీగా పెరిగిందని, యువత తమ సొంత వ్యాపార అవకాశాలను సృష్టించుకుంటున్నాయని చెప్పారు. అలాంటి వారందరికీ సీఏల ఆర్థిక మార్గదర్శకత్వం, మద్దతు అవసరమన్నారు. రానున్న భవిష్యత్తు వ్యాపార వాణిజ్య అవకాశాలు, దేశ ఆర్థిక ప్రగతిలో సీఏల పాత్ర మరింత పెరుగుతుందన్నారు.
వ్యాపార, వాణిజ్యాలు పెరిగితే ప్రైవేట్ వ్యక్తులకే కాకుండా ప్రభుత్వాలకు కూడా భారీగా ఆదాయం వస్తుందని, తద్వారా ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కూడా చేయూత లభిస్తుందని చెప్పారు. సీఏలు తమ వృత్తిలో ప్రస్తుత టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకోవడంపై ఆలోచించాలన్నారు.
