ధర్మసాగర్, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అంటూ ఎన్నో గొప్పలు చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉనికిచర్ల గ్రామానికి ఒక్క ఇల్లు అయినా ఇచ్చిందా? అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. గురువారం గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ పరిధిలోని ఉనికిచర్ల గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. సుమారు 700మంది మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 1994 ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఉనికిచర్ల గ్రామంలో ఎస్సీలకు 70 పక్కా ఇండ్లు కట్టించానన్నారు. మధ్యలో 20 ఏండ్లు తాను ఎమ్మెల్యేగా లేనని, ఈ కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నవారు ఏం చేశారో అందరికీ తెలుసన్నారు.
