ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వనపర్తి, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సి. నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో  ‘టీయూడబ్ల్యూజే హెచ్ 143’ జర్నలిస్టు సంఘం రాష్ట్ర మహాసభల వాల్​పోస్టర్​ను ఆయన ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిజంపై తనకు అపార గౌరవం ఉన్నదని చెప్పారు. ప్రజా సమస్యలు వెలుగులోకి తేవడంలో వారి పాత్ర అనిర్వచనీయమని అభినందించారు. ఆదివారం హైదరాబాద్​లో జరగనున్న  రాష్ట్ర మహాసభలు సక్సెస్​కావాలని ఆకాంక్షించారు. ఐజేయూ పదో ప్లీనరీ హైదరాబాద్​లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. యూనియన్​జిల్లా అధ్యక్షుడు  పోతుల రాము, రాష్ట్ర కమిటీ  సభ్యుడు బక్షి శ్రీధర్ రావు, మోడల చంద్రశేఖర్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. 

భూసమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలి

నారాయణపేట, వెలుగు: జిల్లాలోని గ్రామాలను భూ సమస్యలు లేకుండా తీర్చిదిద్దాలని కలెక్టర్ కోయ  శ్రీహర్ష సూచించారు. శుక్రవారం  కలెక్టరేట్​మీటింగ్​హాల్​లో తహసీల్దార్, డీటీ, ఆర్ఐ లతో రివ్యూ మీటింగ్​నిర్వహించారు. భూసమస్యలతో వచ్చే రైతులను ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా పరిష్కరించాలని  ఆదేశించారు. జిల్లాలో ఉన్న 13 మండలాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’  లో  వచ్చిన ఫిర్యాదులను వెంటనే క్లియర్​చేయాలన్నారు. పీఏసీఎస్​గోదాంల కోసం స్థలాన్ని పరిశీలించి వారికి ఇవ్వాలన్నారు. డ్యూటీలో  నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్లతో కలిసి న్యూ ఇయర్​కేక్ కట్ చేశారు.  అడిషనల్​కలెక్టర్​పద్మజా రాణి, ఆర్డీవో రామచందర్, పీఎస్​నాగేందర్ ప్రసాద్, ఏవో నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

బస్తీ దవాఖానలతో మెరుగైన సేవలు

వనపర్తి, వెలుగు :  బస్తీల్లోని ప్రతి పేద కుటుంబానికి మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం ‘బస్తీ దవాఖాన’లను ఏర్పాటు చేస్తోందని వనపర్తి కలెక్టర్​షేక్ యాస్మిన్ బాషా చెప్పారు. శుక్రవారం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి బస్తీ దవాఖానను  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ  రూ. 13 లక్షలతో బస్తీ దవాఖాన బిల్డింగ్​నిర్మించామని చెప్పారు. అన్ని రకాల వ్యాధులకు ఉచిత పరీక్షలు, చికిత్స పొందవచ్చని చెప్పారు.  డీఎంహెచ్​వో డాక్టర్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

‘కలెక్టరేట్’​  పనులు గడువులోగా పూర్తి చేయాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : కలెక్టరేట్ నిర్మాణ పనులను వేగంగా, గడువులోగా  పూర్తి చేయాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొల్లాపూర్ చౌరస్తా లో కొత్తగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​ బిల్డింగ్​నిర్మాణ పనులను పరిశీలించారు. జనవరి 15 లోపు పూర్తి చేస్తామని మాటిచ్చారని,   ఇన్​టైంలో పూర్తి చేసి మాట నిలబెట్టుకోవాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.  ఆఫీస్​ఆవరణలో ఆయా రకాల పెద్ద మొక్కలను నాటాలని సూచించారు. బిల్డింగ్​లో మిగిలిన సివిల్​వర్క్స్​తో పాటు  బయట సుందరీకరణ పనులు సమాంతరంగా జరగాలని, అవసరమైతే లేబర్ సంఖ్యను రెట్టింపు చేయాలని ఆదేశించారు. ఆర్అండ్​బీ ఈఈ భాస్కర్, డీఈ రమాదేవి, కాంట్రాక్టర్లు ఉన్నారు.

ఎంపీ ఇంటి ఎదుట ‘స్కీం’ వర్కర్ల ధర్నా

నవాబుపేట, వెలుగు :మహబూబ్​నగర్​ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి ఇంటి  ఎదుట సీఐటీయూ  ఆధ్వర్యంలో శుక్రవారం స్కీం వర్కర్లు ధర్నా నిర్వహించారు. నవాబుపేట మండల కేంద్రం నుంచి ర్యాలీగా వెళ్లి ధర్నాకు దిగారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ పథకాలను ప్రైవేటీకరణ చేసి స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని చూస్తోందని, ఎంపీ పార్లమెంట్​లో కొట్లాడాలని డిమాండ్​చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివాదాలు చేశారు. ఎంపీ అందుబాటులో లేకపోవడంతో పీఏ కు వినతి ఇచ్చారు.  సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమార్తి, డీవైఎఫ్​ఐ జిల్లా ఉపాధ్యక్షుడు భాను ప్రసాద్  తదితరులు పాల్గొన్నారు.

యువత అన్ని రంగాల్లో రాణించాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : యువత అన్ని రంగాల్లో రాణించాలని  జిల్లా యువజన, క్రీడల అధికారి నటరాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్ లో యువజనోత్సవాలు ఘనంగా నిర్వహించారు.  ఫోక్​సాంగ్స్​, డ్యాన్స్​తదితర పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నటరాజ్​మాట్లాడుతూ ఆధునిక యుగంలో అంతరించిపోతున్న ప్రాచీన కళలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాణం పోస్తోందన్నారు. మరుగున పడిన కళాకారులను వెలికి తీసి సత్కరిస్తున్నామని చెప్పారు.  యువ క్రీడాకారులకు చక్కని భవిష్యత్​ఉందని, ప్రతి ఒక్కరూ చదువు, ఆటలతో పాటు అంతరించి పోతున్న కళల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.  డీఆర్డీఏ నర్సింగరావు, డీపీఆర్వో  సీతారాం తదితరులు పాల్గొన్నారు. 

‘బూత్ ​లెవల్’​ మీటింగ్స్​ సక్సెస్ ​చేయాలి

అయిజ, వెలుగు: గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం జరగబోయే బీజేపీ బూత్​లెవల్​మీటింగ్స్​కు పార్టీ లీడర్లు, కార్యకర్తలు హాజరై సక్సెస్ చేయాలని జిల్లా అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఈవెంట్ హాల్, శాంతినగర్ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశానికి పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ, శాంతినగర్ మీటింగ్​కు రాష్ట్ర నాయకుడు పాలక్  చింతా సాంబమూర్తి హాజరవుతారని తెలిపారు. జిల్లా కార్యదర్శి జలగరి అశోక్,  నేతలు నరసింహయ్య శెట్టి, శేఖర్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

వెనుకబడిన స్టూడెంట్లపై ఫోకస్​ పెట్టండి

నవాబుపేట, వెలుగు: గవర్నమెంట్ ​స్కూళ్లలో  టీచర్లు వెనుకబడిన స్టూడెంట్లపై ఫోకస్​ చేయాలని స్కూల్​ఎడ్యుకేషన్​ రీజినల్​ జాయింట్​ డైరెక్టర్​ విజయలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం డీఈవో రవీందర్​తో కలిసి మండలంలోని రేకుల చౌడాపూర్, లింగంపల్లి ప్రైమరీ స్కూళ్లను విజిట్​చేశారు. స్కూళ్లలో జరుగుతున్న ‘మన​ఊరు మనబడి’ పనులను పరిశీలించారు. నాణ్యమైన బోధనతో  ఉత్తమ ఫలితాలను సాధించాలని  కోరారు.  ఎంఈవో రాజు నాయక్, క్లస్టర్​ హెడ్​మాస్టర్​ ఉషారాణి, సీఆర్పీ జనార్దన్​ పాల్గొన్నారు.