గులాబీ లీడర్ల రుబాబు

గులాబీ లీడర్ల రుబాబు

ప్రశ్నించినోళ్లపై పోలీసుల ముందే దాడులు
ప్రతిపక్ష నేతల నుంచి సామాన్యుల దాకా అందరిపై దౌర్జన్యం

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ప్రశ్నించే వారిపై గులాబీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ ధోరణి బాగా పెరిగిపోయింది. తమ సర్కార్ నే విమర్శిస్తారా? అంటూ పోలీసుల ముందే చేయిచేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని, అధినేత కేసీఆర్‌‌ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోవద్దు.. ‘ఈట్‌‌ కా జవాబ్‌‌ పత్తర్‌‌ సే దేంగే’ అని వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ పిలుపునివ్వడంతోనే క్యాడర్‌‌కు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. అసహనంతో ఎదుటివారిపై చేయి చేసుకుంటున్నారు. సోషల్​ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిని  కూడా టార్గెట్​ చేస్తున్నారు. కొన్నిసార్లు అధికార బలప్రయోగం చేసి వారి నోరు మూయిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌ మొదలు ప్రజాశాంతి పార్టీ చీఫ్‌‌‌‌ కేఏ పాల్‌‌‌‌ వరకు అవతలి వాళ్లు ఎవరైనా దౌర్జన్యం చేస్తున్నారు.

పోలీసు కేసులు, భౌతిక దాడులు
టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఎదురే లేదనే భావన నేతల్లో పెరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వాన్ని, సీఎం సహా ఇతర లీడర్లను నేరుగా, సోషల్‌‌‌‌ మీడియాలో విమర్శించే వారిపై పోలీసులు కేసులు పెట్టి వేధించడం, అప్పటికీ మాట వినకుంటే దాడులకు తెగబడటం పరిపాటిగా మారిపోయింది. గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడో ఒకటి వెలుగులోకి వచ్చేవి. ఇప్పుడు రోజూ జరుగుతూనే ఉన్నాయి. మంత్రి పువ్వాడ అజయ్‌‌‌‌ అండతో కౌన్సిలర్‌‌‌‌ భర్త వేధించడం వల్ల ఖమ్మంలో సాయిగణేశ్‌‌‌‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్‌‌‌‌ జిల్లా రామాయంపేట మున్సిపల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వేధింపులు తట్టుకోలేక తల్లీకొడుకు గంగం సంతోష్‌‌‌‌, పద్మ కామారెడ్డిలోని ఓ హోటల్‌‌‌‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌‌‌‌ రావు కొడుకు రాఘవ వేధింపులు తట్టుకోలేక రామకృష్ణ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలతో సహా ఆత్మాహుతి చేసుకున్నారు. 2021 ఫిబ్రవరిలో హైకోర్టు అడ్వొకేట్లు వామన్‌‌‌‌రావు, నాగమణి దంపతులను పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌‌‌‌ పుట్ట మధు సమీప బంధువు, అనుచరులు పట్టపగలు నడిరోడ్డుపై హత్య చేశారు. కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారనే సాకుతో కొన్ని నెలల కింద రేవంత్‌‌‌‌ ఇంటిపైనా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు దాడికి పాల్పడ్డారు.

అంబేద్కర్‌‌‌‌ జయంతి రోజు నుంచి బండి సంజయ్​ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించారు. జోగులాంబ జిల్లా వేముల గ్రామం వద్ద టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు సంజయ్‌‌‌‌ యాత్రను అడ్డుకొని దాడికి దిగారు. పోలీసుల సమక్షంలోనే రాళ్లు విసిరి, బీజేపీ ఫ్లెక్సీలు కాల్చేశారు. వానాకాలం సీజన్‌‌‌‌లో సూర్యాపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించేందుకు వెళ్లినప్పుడూ సంజయ్‌‌‌‌పై టీఆర్​ఎస్ నేతలు దాడి చేశారు.

వైఎస్సార్‌‌‌‌ టీపీ లీడర్ షర్మిల పాదయాత్రకు అనేక చోట్ల టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు అడ్డు తగిలారు. సూర్యాపేట సమీపంలో ఆమె పాదయాత్రపై దాడి చేసి షర్మిల.. గో బ్యాక్‌‌‌‌ అంటూ నినాదాలు చేశారు.

మంచిర్యాల జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీనివాస్‌‌‌‌తో పాటు పలువురు నేతలు చెన్నూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న మిరప పంటను పరిశీలిస్తుండగా ప్రభుత్వ విప్‌‌‌‌ బాల్క సుమన్‌‌‌‌ అనుచరులు వారిపై దాడి చేశారు.

సిరిసిల్ల జిల్లా రైతులను కలిసేందుకు వెళ్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌‌‌‌పై టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేత, సింగిల్‌‌‌‌ విండో డైరెక్టర్‌‌‌‌ అబ్బాడి అనిల్‌‌‌‌ సిద్దిపేట జిల్లాలోని జక్కాపూర్‌‌‌‌ వద్ద పోలీసు అధికారుల సమక్షంలోనే దాడికి పాల్పడ్డారు.

మంత్రి కేటీఆర్‌‌‌‌ అనుచరుడు, సిరిసిల్ల జిల్లా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధ్యక్షుడు తోట ఆగయ్య, గులాబీ నేతలు ఎల్లారెడ్డిపేట పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లోనే బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బీజేపీ కార్యకర్త రేపాక రామచంద్రం తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు బీజేపీ కార్యకర్తలకు తీవ్రగాయాలు

వరంగల్‌‌‌‌ జిల్లాలో ఎంపీ అర్వింద్‌‌‌‌పై టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, తెలంగాణ జాగృతి నేతలు దాడి చేశారు. నిజామాబాద్‌‌‌‌ జిల్లాలోనూ పలుమార్లు అర్వింద్ క్యాన్వాయ్‌‌‌‌పై పోలీసుల సమక్షంలోనే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు దాడికి పాల్పడ్డారు.

కేటీఆర్‌‌‌‌ కామారెడ్డి జిల్లా పర్యటనను అడ్డుకుంటారనే సాకుతో టీఆర్​ఎస్​ కార్యకర్తలు.. బీజేపీ కార్యకర్తలను వెంటపడి మరీ కొట్టారు.

ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా కేంద్రంలో మంగళవారం కౌన్సిలర్‌‌‌‌ కొడుకు దివ్యాంగుడిపై దాడికి తెగబడ్డారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు దీనిని రెండు వర్గాల మధ్య వివాదంగా మార్చేందుకు ప్రయత్నించారు.