శబరిమల రద్దీతో కేరళ సర్కారు నిర్ణయం

 శబరిమల రద్దీతో కేరళ సర్కారు నిర్ణయం

తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో లక్షమందికి పైగా భక్తులు దర్శనం కోసం వచ్చారు. రోజురోజుకూ పెరుగుతున్న రద్దీతో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) చర్యలు చేపట్టింది. ఇకపై రోజుకు 90 వేల మంది భక్తులకే దర్శనం కల్పిస్తామని స్పష్టం చేసింది. శబరిమల రద్దీపై సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన సోమవారం సమావేశం జరిగింది. మీటింగ్ అనంతరం టీడీబీ అధ్యక్షుడు అనంతగోపాలన్ మీడియాతో మాట్లాడారు. శబరిమల దర్శన సమయం19 గంటల వరకు పొడిగించినట్లు తెలిపారు.

ఇక నుంచి ఆలయ తలుపులు తెల్లవారు జామున 3 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు.. అలాగే, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11.30 వరకు తెరిచి ఉంటాయని వెల్లడించారు. పెరుగుతున్న రద్దీ కారణంగా అష్టాభిషేకం, పుష్పాభిషేకం అనే ప్రత్యేక ప్రసాదాలు కూడా పరిమితం చేసినట్లు వివరించారు. హరివరాసనం పారాయణం టైంలో భక్తులను అనుమతివ్వనున్నట్లు తెలిపారు. భక్తులకు నీళ్లు, బిస్కెట్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. దర్శనం కోసం ఇప్పటికే 19,17,385 మంది ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారని.. ఆదివారం వరకు మొత్తం14,98,824 మంది ఆలయాన్ని సందర్శించారని టీడీబీ పేర్కొంది.