మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మలుపులు

మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మలుపులు

మహారాష్ట్రలో రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. శివసేన అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన పార్టీ తమ వర్గానిదేనని ఏక్‌నాథ్‌ వర్గం, ఉద్ధవ్‌ థాక్రే వర్గం వాదిస్తున్నాయి. దీంతో శివసేన పంచాయతీ కేంద్ర ఎన్నికల సంఘం వరకూ వెళ్లింది. రెండు వర్గాల నేతలు శివసేన పార్టీ తమదేనని ఈసీకి లేఖ రాశాయి. 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేలు, 18 మంది లోక్‌సభ ఎంపీల్లో 12 మంది తమకు మద్దతుగా ఉన్నారని ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఎలక్షన్ సింబల్స్ ఆదేశం 1968 ప్రకారం శివసేన పార్టీ గుర్తు విల్లు ధనుస్సు తమకే కేటాయించాలని కోరారు. దీంతో ఈసీ.. ఏక్ నాథ్ షిండే, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గాలకు పలు ఆదేశాలు జారీ చేసింది.  

శివసేన పార్టీకి ఎవరు సారథ్యం వహించాలో చెప్పే ఆధారాలు, రుజువులను డాక్యుమెంటరీ రూపంలో తమకు సమర్పించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. శివసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరి వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నారనే ఆధారాలనూ తమకు సమర్పించాలని ఆదేశించింది. ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం వరకు అన్ని ఆధారాలు, డాక్యుమెంట్లను సమర్పించాలని ఈసీ స్పష్టం చేసింది.