సింగరేణిలో అవినీతి, అక్రమాలపై చర్యలేవీ..?

సింగరేణిలో అవినీతి, అక్రమాలపై చర్యలేవీ..?

మందమర్రి, వెలుగు : అవినీతి రహిత సింగరేణి నిర్మాణమే మా లక్ష్యం.. సంస్థలో ఎక్కడ అక్రమాలు, అవినీతి జరిగినా పసిగట్టి వాటిని నియంత్రించడమే సింగరేణి నిఘా విభాగం ధ్యేయమని పేర్కొంటున్నా ఆచరణలో మాత్రం కానరావడం లేదు. కుంభకోణాలు, అవినీతి కారణంగా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా బాధ్యులను శిక్షించడంలో సింగరేణి విజిలెన్స్​విభాగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సింగరేణివ్యాప్తంగా సోమవారం నుంచి నవంబర్​6 వరకు నిఘా(విజిలెన్స్) వారోత్సవాల పేరుతో కార్మికులకు అవగాహన కల్పించేందుకు యాజమాన్యం రెడీ అయ్యింది. 

అవినీతి, అక్రమాలపై చర్యలేవీ
సింగరేణిలో మస్టర్లు పడిన తర్వాత ఎంతోమంది డ్యూటీలు చేయకుండా బయటకు వెళ్తున్నా వారిపై చర్యలు తీసుకోవడం లేదు. నచ్చినవారికి అనుకూలంగా ఆఫీసర్లు వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. సంస్థలో ఉద్యోగిగా ఉంటూ ఇతర వ్యాపకాల్లో ఉండేవారిపైనా  చర్యలు కొరవడ్డాయి. సింగరేణిలో అవినీతి, అక్రమాలను కట్టడి చేసేందుకు ఏర్పాటు చేసిన విజిలెన్స్​విభాగానికి స్వయం ప్రతిపత్తి లేదు. కేవలం మైనింగ్​ఉన్నతాధికారుల కనుసన్నల్లో నడుస్తోందని, అధికార యంత్రాంగం ఏది చెబితే అది చేయడం, ఎవరిమీద చర్య తీసుకోవాలనుకుంటే వారిపై మాత్రమే నిఘాపెట్టడం, వదిలిపెట్టమన్నవారిని చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు.

సింగరేణిలో పెద్దఎత్తున బొగ్గు అక్రమ రవాణా అయిన కేసుల్లో, దొంగతనంగా ఇసుక తరలింపు, సింగరేణి సామగ్రి దారి మళ్లింపు, భారీ యంత్రాల కొనుగోళ్లలో అవినీతి, కమీషన్ల దందా వెలుగులోకి వచ్చినా విజిలెన్స్​విభాగం ఆఫీసర్లు చర్యలు తీసుకోలేదు. బొగ్గు క్వాలిటీ తగ్గించినా, ఓసీపీ గనుల్లో మట్టి వెలికితీసే కాంట్రాక్టర్​సంస్థకు అనుకూలంగా లీడ్​ను తగ్గించినా, మెడికల్​అన్​ఫిట్ల కేసులో పెద్దమొత్తం వసూలు చేసి రాత్రికి రాత్రే సింగరేణి క్వార్టర్ ఖాళీ చేసి గుట్టుచప్పుడు కాకుండా పారిపోయినా పట్టించుకోలేదు. మేడిపల్లి ఓసీపీ గనిలో నుంచి సీహెచ్​పీకు వెళ్లాల్సిన బొగ్గు లారీలు పెద్దఎత్తున పక్కదారి పడితే దానిపై ఎంక్వయిరీ ఒక కొలిక్కి రాలేదు. గతంలో జరిగిన మెడికల్​అన్​ఫిట్ల కేసుల్లో కొంతమంది సింగరేణి డాక్టర్ల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ అయినట్లు గుర్తించినా ఎలాంటి చర్యలు లేవు.

శ్రీరాంపూర్​ఓపెన్​కాస్ట్​ గనిలో మూడు సంవత్సరాల కిందట రూ.300 కోట్ల డీజిల్​కుంభకోణం జరిగితే ఇప్పటివరకు దోషులపై చర్యలు లేవు. కోయగూడెం ఓసీపీలో డీజిల్​కుంభకోణంపై చర్యలు లేవు. శ్రీరాంపూర్​ ఏరియాలో రిటైర్డు జీఎంపై పెద్దఎత్తున అవినీతి కంప్లైంట్స్​ఉన్నాయి. జైపూర్​లోని ఎస్టీపీపీలో ఇసుక అక్రమ రవాణా జరిగినా, ఇనుప స్క్రాప్​ తప్పుదారి పట్టినా చర్యలు లేవు. నాసిరకం మిషనరీలు, వృథా కొనుగోళ్లు, తప్పుడు ప్లానింగ్​, దుబారా ఖర్చులు వంటి అక్రమాలు వెలుగు చూశాయి.  

ఫిర్యాదులపై పట్టింపేదీ
సింగరేణి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త రంగ సంస్థ కావడంతో అవినీతి చోటుచేసుకుంటే ఎవరికి కంప్లైంట్​ చేయాలనేది కార్మికులకు తెలియడం లేదు. సంస్థలో చదువుకున్నవారి సంఖ్య తక్కువగా ఉండటంతో అన్యాయం జరిగినా సహిస్తున్నారు. అక్కడక్కడ ఓరల్​గా కంప్లైంట్​ చేసినా పెద్దగా స్పందన లేకపోవడంతో మౌనంగా ఉండటం మినహా ఏం చేయలేని దుస్థితి ఉంది. ఇటీవల జూనియర్​అసిస్టెంట్​పోస్టుల పరీక్షల్లో దళారుల ప్రమేయం ఉందని అభ్యర్థులు కోర్టును సైతం ఆశ్రయించారు. కానీ ఈ వ్యవహారంపై నిఘా విభాగం కనీసం దృష్టి సారించలేదు.  విజిలెన్స్​విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు కొత్తగూడెంలోని ప్రధాన ఆఫీస్​తో పాటు ఇటీవల జైపూర్​లో మరో ఆఫీస్​ను అందుబాటులోకి తీసుకువచ్చినా అవినీతి, అక్రమాలకు కళ్లెం పడటం లేదు.

అమాయకులను వేధించేందుకే..
అమాయకులను వేధించేందుకు సింగరేణి నిఘా విభాగం ఉంది. అధికారుల అక్రమాలు, అవినీతిని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కార్మికులు చిన్న తప్పు చేసినా, ఎవరైనా ఆకాశరామన్న లెటర్​రాసినా నిఘా విభాగం దాడులు, చర్యలు తప్పడం లేదు. అధికారుల జేబు సంస్థగామారింది. నిఘా విభాగానికి స్వయం ప్రతిపత్తి ఉండాలి. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. 
- యాదగిరి సత్తయ్య, బీఎంఎస్ స్టేట్​ప్రెసిడెంట్(సింగరేణి విభాగం)​​