మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం

మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్ : మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. హైదరాబాద్ తో సహా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, హర్యానాలో సిట్ అధికారుల సోదాలు ముగిశాయి. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. సిట్ అధికారులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఓ వైద్యుడు తప్పించుకున్నాడని తెలుస్తోంది. సదరు వైద్యుడు ముగ్గురు నిందితుల్లో ఒకరైన రామచంద్ర భారతికి సన్నిహితుడిగా సిట్ అధికారులు గుర్తించారు. 

పరారీలో వైద్యుడు

ఇటు వైద్యుడి ఆశ్రమానికి వెళ్లిన సిట్ అధికారులు...అక్కడున్న స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు వస్తున్నారని ఆశ్రమంలోని ఇన్ చార్జ్ సమాచారం అందించడంతోనే వైద్యుడు తప్పించుకున్నాడని చెబుతున్నారు. కేరళ పోలీసుల సాయంతో ఆశ్రమం ఇన్ చార్జీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న వైద్యుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సదరు వైద్యుడు ఆచూకీ తెలిస్తే.. సిట్ అధికారుల దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. 

వేగంగా సెర్చ్ ఆపరేషన్స్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దేశవ్యాప్తంగా 7 బృందాల‌తో సిట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఫిల్మ్ నగర్‌‌‌‌లోని నందకుమార్‌‌‌‌‌కు చెందిన డెక్కన్ కిచెన్ హోటల్, షేక్‌‌‌‌పేట్, చైతన్యపురిలోని ఇండ్లలో సోదాలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామచంద్ర భారతికి చెందిన హర్యానాలోని ఫరీదాబాద్, ఆయన ఎక్కువగా తిరిగే కేరళలో ఆదివారం కూడా సోదాలు నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులు, రాజకీయ సన్నిహితులు, ఫ్రెండ్స్ నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది. దీంతో పాటు ఏపీలోని తిరుపతిలో సింహయాజికి చెందిన పలు ప్రాంతాల్లో కొంతమందిని విచారించినట్లు సమాచారం. సోదాల వివరాలను సిట్ అధికారులు వెల్లడించడం లేదు. 

లీగల్ ఒపీనియన్‌తో.. 

ఇప్పటికే సేకరించిన ఆధారాలతో సంబంధిత వ్యక్తులను విచారించేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా సీనియర్ లాయర్ల సలహాలు తీసుకుంటున్నారు. నిందితులు ప్రస్తావించిన వ్యక్తులకు తమ దగ్గర ఉన్న ఆధారాలతో ఏ సెక్షన్స్ కింద నోటీసులు ఇవ్వాలనే వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ కేసులో వారికి నేరుగా సంబంధం ఉంటే నిందితులకు జారీ చేసిన విధానంగానే సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా కుట్ర జరిగిందనే కారణంగా రామచంద్ర భారతిపైనే సిట్ ఎక్కువగా ఫోకస్‌ పెట్టినట్లు తెలిసింది.

ఫామ్ హౌస్‌‌‌లో సేకరించిన వీడియో ఫుటేజ్, ఆడియో కాల్ రికార్డులకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ మరో రెండ్రోజుల్లో ఏసీబీ కోర్టుకు అందనుంది. రిపోర్ట్ మొత్తం సీల్డ్ కవర్‌‌‌‌‌లో సిట్‌‌కు అందజేసే అవకాశాలు ఉన్నాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొన్న వివరాలు, ఆడియో కాల్స్‌‌‌‌లో రికార్డ్ అయిన నెంబర్ల వారిగా సంబంధిత వ్యక్తులను వివరణ కోరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలు లభ్యం కావడంతో ఈ వారం రోజుల్లోనే అనుమాతులను విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.