
- అర్బన్ జిల్లాల్లో రెండు మూడేండ్లలో పదవీ విరమణలు
- రూరల్ జిల్లాల్లో 20 ఏండ్ల దాకా ఖాళీ పోస్టులే ఉండవు
- జిల్లా స్థాయి ఉద్యోగాల్లో వేకెన్సీలు ఏర్పడక గ్రామీణ యువతకు పెద్ద దెబ్బ
హైదరాబాద్, వెలుగు: సీనియారిటీ ప్రాతిపదికన జరుగుతున్న ఉద్యోగుల కేటాయింపులతో రూరల్ జిల్లాల యువతకు తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడింది. సీనియర్ఎంప్లాయీస్ అర్బన్ జిల్లాలను ఎంచుకుంటుండగా, జూనియర్ ఉద్యోగులు రూరల్ జిల్లాలకు అలాట్ అవుతున్నారు. దీనివల్ల అర్బన్ జిల్లాల్లో రెండు మూడేండ్లలో రిటైర్మెంట్ల తర్వాత ఖాళీలు ఏర్పడే అవకాశం ఉండగా.. రూరల్ జిల్లాలకు వెళ్లిన ఉద్యోగుల సర్వీస్ ఇంకా దాదాపు 25 ఏండ్లు ఉంది. ఈ లెక్కన ఆయా రూరల్ జిల్లాల్లో కనీసం మరో 20 ఏండ్ల వరకు పోస్టులు ఖాళీ అయ్యే చాన్సే లేదు. భవిష్యత్లో జిల్లా కేడర్ఉద్యోగుల భర్తీ సమయంలో రూరల్ జిల్లాల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ ఉండే అవకాశం ఉండదు. దీని వల్ల రూరల్ జిల్లాల నిరుద్యోగులకు అన్యాయం జరగబోతోంది. ప్రస్తుత ఉద్యోగుల విభజనలో జిల్లా స్థాయి ఉద్యోగులే దాదాపు రెండున్నర లక్షల మంది ఉండటం గమనార్హం.
సీనియారిటీ తెచ్చిన తంటా
కొత్త జోనల్ ప్రకారం ఉద్యోగుల కేటాయింపుకు ప్రభుత్వం 317 జీవో ఇచ్చింది. కమిటీల ద్వారా జోనల్, జిల్లా కేడర్ల వారీగా ఉద్యోగులను విభజించి, సీనియారిటీని పరిగణలోకి తీసుకొని వారిని ఆయా జోన్లు, జిల్లాలకు అలాట్ చేస్తోంది. అయితే జిల్లా కేడర్ పోస్టులకు సీనియారిటీని పరిగణలోకి తీసుకోవడం వల్ల 50 ఏండ్లు పైబడిన సీనియర్లందరూ ఉమ్మడి జిల్లాలోని అర్బన్ జిల్లాలకే వెళ్తున్నారు. గత పదేండ్ల నుంచి రిక్రూట్అయి, ఇంకా 20 ఏండ్లు సర్వీస్ఉన్నవారు.. తప్పని పరిస్థితుల్లో వారి సొంత జిల్లా వదిలి సుదూర రూరల్జిల్లాలకు అలాట్అవుతున్నారు. ఉదాహరణకు ఉమ్మడి వరంగల్జిల్లాలో వరంగల్, హనుమకొండ, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా కేడర్ పోస్టుల కేటాయింపులో సీనియర్ ఉద్యోగులంతా.. హనుమకొండ, వరంగల్, జనగామ లాంటి అర్బన్ జిల్లాలను ఎంచుకుంటుండగా.. జూనియర్లు ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు వెళ్తున్నారు. సీనియర్లు అలాట్అయిన జిల్లాల్లో రెండు మూడేండ్లలో రిటైర్మెంట్జరిగి ఖాళీలు ఏర్పడితే.. జూనియర్ఉద్యోగులు అలాట్అయిన జిల్లాల్లో ఇంకో 20 ఏండ్ల వరకు ఖాళీలు ఏర్పడే చాన్స్ ఉండదు. దీంతో ఆయా జిల్లాల నిరుద్యోగులకు నష్టం జరిగే ప్రమాదముంది. జిల్లా కేడర్ మొత్తం ఉద్యోగుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏండ్ల పైబడిన వారు 60 వేల పైచిలుకు ఉంటారని అంచనా.
ఆ జిల్లాల్లో ఎక్కువగా జూనియర్లే..
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్, కామారెడ్డి, మహబూబాబాద్, నాగర్కర్నూల్, మంచిర్యాల, సిరిసిల్ల, జగిత్యాల వంటి జిల్లాలకు ఎక్కువ శాతం జూనియర్ఉద్యోగులే అలాట్ అయినట్లు తెలుస్తోంది. మిగతా అర్బన్ జిల్లాల్లో సీనియర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఖాళీలు ఖాళీలకు ఇబ్బంది లేకపోయినా.. రూరల్ ఖాళీ పోస్టులు ఎలా ఏర్పడుతాయనేది ప్రశ్నార్థంగా మారింది. కొత్త పోస్టులు శాంక్షన్ చేస్తే గానీ అక్కడ రిక్రూట్మెంట్కు చాన్స్ ఉండదు. గత ఏడేండ్లలో పోలీసు డిపార్ట్మెంట్, ఇతర శాఖలు చేపట్టిన రిక్రూట్మెంట్భర్తీలు కలిపితే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. రాష్ట్రం ఏర్పడక ముందు నాలుగైదేండ్లు చేపట్టిన ఉద్యోగాల భర్తీ వేలల్లోనే ఉంది. ఇలా దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఈ 15 ఏండ్లలో చేరినవాళ్లే. వారు రిటైర్అయ్యేందుకు ఇంకా చాలా ఏండ్లు పడుతుంది.
టీచర్లలో స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలను ప్రభుత్వం జిల్లా కేడర్లోనే ఉంచింది. రాష్ట్రంలో 1.05 లక్షల మంది టీచర్లు ఉన్నారు. ఉద్యోగుల సర్దుబాటులో ఎక్కువ మంది టీచర్లు వారు ఉన్న స్కూలును వదిలి మరోచోటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీచర్ల కేటాయింపునకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో అర్బన్జిల్లాలకు ఎక్కువ పోటీ ఉంది. సీనియర్లు అందరూ అర్బన్ జిల్లాలకు వెళ్తుండగా.. 2008, 2012, 2018 సంవత్సరాల్లో రిక్రూట్ అయిన టీచర్లు రూరల్ జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది.
అర్బన్ జిల్లాల్లో రిటైర్మెంట్లు త్వరగా పూర్తయి.. అక్కడ వందల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీ అయితే, రూరల్ జిల్లాలో ఒక్క టీచర్ పోస్టు కూడా ఉండే చాన్స్ లేదు. డీఎడ్, బీఎడ్ పూర్తి చేసి టీచర్ కొలువుల కోసం ఎదరుచూస్తున్న అభ్యర్థులకు అన్యాయం జరగనుంది. ఉద్యోగుల సర్దుబాటులో ప్రభుత్వం అనధికారంగా స్కూళ్ల రేషనలైజేషన్ చేస్తోందని, స్టూడెంట్లుతక్కువ ఉన్నారన్న సాకు చూపి టీచర్లను కేటాయించడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పిల్లలు ఎక్కువ ఉండి టీచర్లు తక్కువ ఉన్న స్కూళ్లలో టీచర్లను నింపాల్సి వస్తుందని ఆయా పోస్టులను అలాట్మెంట్లో పెట్టడం లేదని అంటున్నారు.