అన్నదమ్ములను కాటేసిన పాము..

అన్నదమ్ములను కాటేసిన పాము..

అన్న మృతి.. తమ్ముడికి సీరియస్​

పాపన్నపేట, వెలుగు: అర్ధరాత్రి పడుకుని ఉన్న అన్నదమ్ములను పాము కాటేసిన ఘటనలో అన్న మృతిచెందగా తమ్ముడి పరిస్థితి సీరియస్​గా ఉంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం దౌలాపూర్ కు చెందిన జింక కేశమ్మ, నారాయణ దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. రోజులాగే గురువారం రాత్రి అందరూ భోజనంచేసి ఇంట్లో నిద్రపోయారు. అర్ధరాత్రి పెద్ద కొడుకు రామ్​చరణ్(11) వాంతులు చేసుకున్నాడు. కొద్దిసేపటికి చిన్నకొడుకు నర్సింలు(6)కు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు అనుమానించి ఇంట్లో వెతకగా టీవీ దగ్గర పాము కనిపించింది. వెంటనే పామును చంపేశారు. రాంచరణ్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాము కరిచిందని మెదక్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్​కు తరలిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. గ్రామంలో మధ్యాహ్నం రామ్ చరణ్ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా నర్సింలు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే గ్రామస్థులు అతన్ని మెదక్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. పాముకాటుతో ఓ కొడుకు మృతిచెందడం, మరో కొడుకు పరిస్థితి సీరియస్​గా ఉండడంతో టెన్షన్​తో కేశమ్మ, నారాయణ దంపతులు అనారోగ్యానికి గురయ్యారు. దాంతో వారిద్దరిని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే రోజు ఒకే కుటుంబంలో ఒక బాలుడు చనిపోవడం, మరో ముగ్గురు ఆస్వస్థతకు గురికావడంతో గ్రామంలో విషాదచాయలు
అలుముకున్నాయి.