ప్రతిపాదనల్లోనే గజ్వేల్ స్పోర్ట్స్​హబ్​

ప్రతిపాదనల్లోనే గజ్వేల్ స్పోర్ట్స్​హబ్​
  • ప్రతిపాదనల్లోనే గజ్వేల్ స్పోర్ట్స్​హబ్​
  • భూమి కేటాయించి ఏడాది పూర్తి 
  • ఫండ్స్​రిలీజ్​ కోసం ఎదురుచూపులు
  • రూ.40కోట్లతో నిర్మించనున్న స్పోర్ట్స్​హబ్​

సిద్దిపేట, వెలుగు: అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో నిర్మించాలనుకున్న స్పోర్ట్స్​హబ్​ప్రతిపాదనలకే పరిమితమైంది. ఏడాది క్రితం దాదాపు రూ.40 కోట్లతో స్పోర్ట్స్​హబ్​ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు స్థలం కూడా కేటాయించారు. ఫండ్స్ మంజూరు కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో నిర్మాణం త్వరగా పూర్తవుతుందని క్రీడాకారులు, గజ్వేల్​వాసులు భావించినా నేటికీ పనులు ప్రారంభం కాకపోవడం గమనార్హం. 

అన్ని క్రీడలకు వేదికగా.. 
అన్ని క్రీడలు ఆడేలా అంతర్జాతీయ ప్రమాణాలతో గజ్వేల్ స్పోర్ట్స్​హబ్​ నిర్మించాలని నిర్ణయించారు. ఈ స్పోర్ట్స్​హబ్​లో అథ్లెటిక్ ట్రాక్, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, క్రికెట్, ఫుట్ బాల్ గ్రౌండ్ లు ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధించి స్పోర్ట్స్​అండ్​ యూత్​అఫైర్స్​ డిపార్ట్​మెంట్ కొన్ని నెలల క్రితం రూ.40 కోట్లతో ​డీటెయిల్​ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసి గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(గడా) కు సమర్పించింది. హబ్​నిర్మాణానికి 28 ఎకరాలు అవసరమవుతాయని రిపోర్ట్​లో ప్రతిపాదించగా సర్కారు 20 ఎకరాలను  కేటాయించింది. కానీ ఫండ్స్ మాత్రం రిలీజ్​చేయలేదు. 

రూ.70 కోట్లతో గడా ప్రతిపాదనలు
స్పోర్ట్స్​హబ్​నిర్మాణానికి గడా ఏడాది క్రితం సర్కారుకు ప్రతిపాదనలు పంపినా, ఇంకా పరిశీలనలోనే ఉన్నాయి. గడా పంపినా ప్రతిపాదనల్లో గజ్వేల్​లో మినీ స్టేడియం ఆవరణలో స్పోర్ట్స్​హబ్ కోసం రూ.40 కోట్లు, తూఫ్రాన్ , ములుగుల్లో మినీ స్టేడియాల నిర్మాణం కోసం మరో రూ.30 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కి కోరింది. ఇంత వరకు ఒక్క రూపాయి మంజూరు కాలేదు. ఇటీవల ఫుట్ బాల్ పోటీల కోసం ఇక్కడే రూ.30 లక్షలతో గ్రౌండ్ నిర్మించగా, ఈ ప్లేస్​లోనే ఫుట్ బాల్ గ్రౌండ్ ను నిర్మించాలని భావిస్తున్నారు. 

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం..
గజ్వేల్ స్పోర్ట్​హబ్​ నిర్మించాలని గడా తీర్మానం మేరకు ప్రభుత్వానికి రూ.70 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. సర్కారు ఆమోదముద్ర వేసి ఫండ్స్​రిలీజ్​చేయగానే పనులు ప్రారంభిస్తాం. 
- ముత్యంరెడ్డి, గడా స్పెషల్ ఆఫీసర్