
111 జీవో ఎత్తివేత.. ఇక ఆ 84 గ్రామాలకు హెచ్ఎండీఏ రూల్స్
రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయం
వీఆర్ఏల రెగ్యులరైజేషన్‌కు ఓకే
కాళేశ్వరం నీళ్లతో మూసీ, హిమాయత్‌సాగర్, హుస్సేన్‌సాగర్ లింక్
హైదరాబాద్‌లో ఆరు డీఎంహెచ్‌వో పోస్టులు
వివరాలను వెల్లడించిన మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, వెలుగు : జీవో 111ను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ ఆ జీవో పరిధిలో ఉన్న 84 గ్రామాలకు ఇక నుంచి హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామాల విధి విధానాలు, రూల్స్ అమలవుతాయని పేర్కొంది. వీఆర్ఏలందరినీ రెగ్యులరైజ్ చేసేందుకు అంగీకరించింది. గురువారం మధ్నాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సెక్రటేరియెట్‌లో కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. వాటిని మంత్రి హరీశ్‌రావు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రం పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని కేబినెట్లో నిర్ణయించినట్లు వెల్లడించారు. దేశానికి మార్గదర్శకంగా తెలంగాణ ఎన్నో అద్భుత విజయాలు సాధించిందని ఆయన అన్నారు. ఒక్కో రోజు ఒక్కో రంగం మీద అన్ని జిల్లాల్లో , గ్రామాల్లో, నియోజకవర్గాల్లో అధికారికంగా ఉత్సవాలను జరుపుతామని చెప్పారు.
మూసీని స్వచ్ఛమైన మూసీగా మారుస్తం
‘‘111 జీవో పరిధిలోని 84 గ్రామాల ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నామని ఎన్నో ఏండ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నరు. అందులో భాగంగానే ఆ జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది” అని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు గోదావరి, కృష్ణా, మంజీరా నీళ్లు సమృద్ధిగా వస్తున్నాయని తెలిపారు. హిమయత్సాగర్, గండిపేట పరిరక్షణకు రింగ్ మైన్, ఎస్టీపీల పనులను వెంటనే ప్రారంభించాలని నిర్ణయించినట్లు వివరించారు.
శంకర్పల్లి, చేవేళ్ల రోడ్లను 150–200 ఫీట్ రోడ్ల మేర డెవలప్ చేయనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం జలాలతో మూసీని, హిమయత్‌సాగర్‌ను లింక్ చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి హరీశ్ వెల్లడించారు. మూసీని స్వచ్ఛమైన మూసీగా మారుస్తామన్నారు. హుస్సేన్‌సాగర్‌ను కూడా కాళేశ్వరం జలాలతో లింక్ చేసే విధంగా డిజైన్లు, విధివిధానాలు రూపొందించాలని సీఎం ఆదేశించారని ఆయన చెప్పారు.
వివిధ శాఖల్లో వీఆర్ఏల సర్దుబాటు
వీఆర్‌ఏలను రెగ్యులర్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి హరీశ్ తెలిపారు. రెవెన్యూతో పాటు ఇరిగేషన్, మున్సిపాలిటీ వంటి వివిధ శాఖల్లో వారిని సర్దుబాటు చేస్తామన్నారు. ఎక్కడ.. ఎవరు.. ఎంతమంది పని అవసరం ఉన్నది అనే దానిపై వీఆర్‌ఏ సంఘాలు, శాఖల అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రెవెన్యూ సెక్రటరీ, సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
ఇక 38 మంది డీఎంఅండ్‌హెచ్‌ఓలు
హెల్త్ డిపార్ట్మెంట్లో రీ ఆర్గనైజేషన్‌పై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ‘‘కొత్త జిల్లాలకు తగ్గట్టుగా డీఎంఅండ్‌హెచ్‌ఓ పోస్టులు శాంక్షన్ చేసినం. హైదరాబాద్ జిల్లా చాలా పెద్దగా ఉంది.. ఇక్కడ కోటి మందికి ఒక్క డీఎంహెచ్‌వో ఉండటంతో హెల్త్ కేర్‌ను పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నం. దీంతో హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఆరుగురు జోనల్ కమిషనర్లతో పనిచేస్తున్నట్లుగానే ఆరు డీఎం హెచ్‌వో ఆఫీస్‌లను క్రియేట్ చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నం. వీటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 38 డీఎంహెచ్వోలు ఉంటయ్” అని వివరించారు. కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో పీహెచ్‌సీలను శాంక్షన్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మొత్తం కాంట్రాక్ట్ సిబ్బందితోనే పనిచేస్తున్నాయని, వీటిలో పర్మినెంట్‌గా స్టాఫ్‌ను నియమించాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి హరీశ్ చెప్పారు.
కులవృత్తిదారులకు రూ. లక్ష ఆర్థికసాయం
కులవృత్తిదారులకు సబ్సిడీ కింద రూ. లక్ష ఆర్థికసాయం అందజేయాలని కేబినెట్లో నిర్ణయించినట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. దీనిపై విధివిధానాల కోసం మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కమిటీలో మంత్రులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్‌రెడ్డి సభ్యులుగా ఉంటారని ఆయన వివరించారు. విశ్వబ్రాహ్మణులు, నాయిబ్రాహ్మణులు, మేదరి, కుమ్మరి తదితర వృత్తి కులాలకు ఆర్థిక సాయం అందించేందుకు వెంటనే విధివిధానాలను కమిటీ తయారు చేస్తుందని, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్థిక సాయం మొదలుపెడుతామని చెప్పారు.
వ్యవసాయంలో మార్పుల కోసం కేబినెట్ సబ్ కమిటీ
వడగండ్ల వానలతో రైతులు నష్టపోతున్నది చూశామని, పంట కాలన్ని ఒక నెల రోజుల పాటు ముందుకు జరిపి మార్చి నెలఖారుకు కోతలు పూర్తి చేసుకుంటే నష్టాలు ఉండవని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశంలోనే అతి ఎక్కువ వరి పంట పండించే రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందన్నారు. వ్యవసాయ రంగంలో మార్పుల కోసం ఆ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు. నకిలీ విత్తనాల మీద ఉక్కుపాదం మోపాలని నిర్ణయించామన్నారు. ఈ విషయమై డీజీపీతోనూ చర్చించినట్లు ఆయన చెప్పారు. ఎంతటి వారైనా పీడీ యాక్ట్ పెట్టి వెంటనే అరెస్ట్ చేస్తారని హెచ్చరించారు. అగ్రికల్చర్, పోలీస్, విజిలెన్స్ జాయింట్ టీమ్స్‌గా చెకింగ్స్ చేపట్టాలని అన్నారు. దేశంలో నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని మంత్రి చెప్పారు. మక్కలు, జొన్నలు కొనేందుకు వ్యవసాయ శాఖకు, సివిల్సప్లయ్స్కు గ్యారంటీ లోన్ మంజూరు చేసినట్లు వివరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉమమాహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఫేజ్ -1, ఫేజ్ 2 కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. రెండో విడత గొర్రెల పంపిణీ పది పదిహేను రోజుల్లో మొదలు అవుతుందన్నారు. కేంద్రం నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ముందుకు వెళ్లాలని సీఎం చెప్పారని ఆయన పేర్కొన్నారు.
టీఎస్పీఎస్సీలో 10 పోస్టులు
టీఎస్పీఎస్సీలో 10 పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్, డిప్యూటీ కంట్రోలర్,సెక్యూరిటీ ఆఫీసర్ తదితర పోస్టులు ఇందులోకి వస్తాయని చెప్పారు. వనపర్తిలో జర్నలిస్ట్ భవనానికి 10 గుంటల స్థలం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అదే విధంగా ఖమ్మంలో జర్నలిస్టులందరికీ హౌస్ సైట్స్ కోసం 23 ఎకరాల స్థలం ఇస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు. మైనార్టీ కమిషన్‌లో జైన్ కమ్యూనిటీని కలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని, కమిషన్‌లో జైన్ నుంచి ఒకరిని మెంబర్‌గా తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో కమిషన్ సభ్యుల సంఖ్య 9కు చేరుతుందన్నారు.